
క్వాంటం వ్యాలీ ఏర్పాటులో క్యూపిఐఏఐ భాగస్వామ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యూపీఐఏఐ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వాలీలో క్యూపిఐఏఐ భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు క్యూపిఐఏఐ సంస్థ ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఈ అంశాలపై చర్చించేందుకు క్యూపీఐఏఐ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం భేటీ అయ్యారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే, విద్యార్ధుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నాగరాజన్‌ను కోరారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి క్యూపిఐఏఐను కోరారు. తద్వారా విద్యార్ధులు, పరిశోధకులు, స్టార్టప్‌లు క్వాంటం అల్గారిథంలు, అప్లికేషన్‌లను రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.