చంద్రబాబుకు పురందేశ్వరి లేఖ.. ముచ్చటగా మూడు విజ్ఞప్తులు
x

చంద్రబాబుకు పురందేశ్వరి లేఖ.. ముచ్చటగా మూడు విజ్ఞప్తులు

రాష్ట్రంలో జరిగిన లిక్కర్ తయారీపై, ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. ఈ లేఖలు పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రమాణాలకు అనుసరించే ఇసుక తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, వీటికి డిజిటల్‌గా చెల్లింపులు జరగాలని కోరారు. అదే విధంగా ఇసుక తవ్వకాలను భారీ మెషిన్లతో జరపకూడదని కోరారు. దాంతో పాటుగా ఐదేళ్లుగా జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని, టాటా,బిర్లా ద్వారా శుద్ధి చేసిన ఇసుకను 25 కేజీల బస్తాలలో అందించాలని తెలిపారు.

లిక్కర్‌పై చర్యలు ఉండాలి

‘‘మద్య నియంత్రణ, క్వాలిటీ లిక్కర్‌పై చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్‌పై విచారణ జరగాలి. ముడిసరుకుల వినియోగం, లిక్కర్ తయారీపై విచారణ జరగాలి. ఇథనాల్‌ కంటే సగం ఖర్చులో లభించే సింథటిక్ ఆల్కహాల్ వినియోగంపై కూడా విచారణ జరగాలి. కాలం చెల్లిన డిస్టిలేషన్, శుద్ధి యంత్రాల వినియోగాన్ని పరిశీలించాలి. కలర్, ఫ్లేవర్ కోసం సింథటిక్ కెమికల్స్ వినియోగంపైనా విచారణ జరిపించాలి. 6-12 నెలల చెక్క బ్యారెల్స్‌లో నిల్వ ఉంచిన ఆల్కహాల్‌ను బాటిళ్లలో నింపేలా చూడాలి’’ అని తెలిపారు.

‘‘శాంపిల్స్‌ను ప్రతీవారం నేషనల్ లేబొరేటరీలో పరీక్షలు జరిపించాలి. పూర్తి స్థాయిలో డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలి’’ అని పేర్కొన్నారు. అదే విధంగా మందుబాబుల్లో పరివర్తన కోసం రిహాబిలిటేషన్ సెంటర్లను రాష్ట్రమంతా ప్రారంభించాలి, బలవంతంగా లీజుకు తీసుకున్న లిక్కర్ తయారీ కేంద్రాలను తక్కువ ధరలకే తిరిగి తీసుకోవాలి అని తెలిపారు. బ్రూవరీస్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story