ఆపరేషాన్ పుంగనూరు..!
x

ఆ"పరేషాన్" పుంగనూరు..!

రాజకీయ ప్రత్యర్థులకు ఆయన కంటిలో నలుసు లాంటి వారు. సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం పెద్దిరెడ్డికి ఓ నేత కొరుకుడు పడని కొయ్యలా మారారు.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: రాజకీయాలంటే ఎత్తులు పైఎత్తులు ఉండాలి. ఇది పుంగనూరులో అక్షర సత్యంలా అమలవుతోంది. మాజీ మంత్రి నూతనకాల్వ అమర్నాథరెడ్డికి స్వయాన సోదరుడు, ఈయన సతీమణి కూడా వైఎస్ఆర్సిపిలో చేరారు. రాజకీయ బద్ధశత్రువైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్వయాన బాబాయ్ కూడా పెద్దిరెడ్డి వెంట ఉన్నారు. ఇది తన రాజకీయ ప్రత్యర్థులకు కొరుకుడు పడకున్నా, వారి కుటుంబాల నుంచి తన వైపు తిప్పుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ డ్రామాను రక్తికట్టిస్తున్నారు.


చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లో నూతనకాల్వ కుటుంబం తిరుగులేని శక్తిగా ఎదిగింది. టిడిపికి ఆవిర్భావం నుంచి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చింది. రాష్ట్రంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పెద్దపంజాణి మండలం పలమనేరు పరిధిలోకి వెళ్ళింది. ఆ మండలం కెళవాతి గ్రామానికి చెందిన నూతనకాల్వ కుటుంబ ప్రతినిధి, మాజీ మంత్రి ఎన్. అమర్నాథ్ రెడ్డి.. పలమనేరుకు మకాం మార్చారు. 1985 నుంచి 1994 వరకు మాజీ మంత్రి ఎన్. అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన చిత్తూరు పార్లమెంటుకు వెళ్లడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పాదం పెట్టారు. 1999లో అమర్నాథ్ రెడ్డి ఓటమిపాలై 2004లో మళ్ళీ ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

నియోజకవర్గాల పునర్విభజన కాస్తా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఆస్కారం కల్పించింది. టీ. సదుం మండలం ( స్వగ్రామం ఎర్రాతివారిపాలెం) పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోకి బదిలీ కావడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నుంచి పుంగనూరుకు మకాం మార్చారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికే నియోజకవర్గంలో బలమైన అనుచరులు, నాయకులు వెంట ఉండడంవల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుగులేని శక్తిగా ఎదగడానికి మార్గం ఏర్పడిందని చెబుతారు. అంతకుముందు పార్టీలు వేరైనా (కాంగ్రెస్ - టిడిపి) పుంగనూరు- పీలేరు నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన ఎన్. అమర్నాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరస్పర సహకారంతో మెలిగే వారని అప్పట్లో వినిపించిన మాట. రాష్ట్ర విభజన తర్వాత వారిద్దరికీ రాజకీయంగా కూడా పోసగని మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో...

ఫ్యాన్ కిందికి అమర్ సోదరుడి ఎంట్రీ

పుంగనూరు అసెంబ్లీ స్థానంలో దశాబ్దాలపాటు నూతనకాల్వ కుటుంబం టిడిపి నుంచి చక్రం తిప్పింది. మాజీ మంత్రి ఎన్. అమర్నాథరెడ్డి స్వయానా తమ్ముడు ఎన్. శ్రీనాథరెడ్డి ఆయన సతీమణి ఎన్. అనూషరెడ్డితో కలిసి వైఎస్ఆర్సిపిలో చేరారు. ట్రబుల్ షూటర్ పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ వ్యవహారంలో చక్రం తిప్పారు.

2019 ఎన్నికల్లో నూతనకాల్వ శ్రీనాథరెడ్డి సతీమణి అనూష రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేశారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గంపై పట్టు ఉన్న నూతనకాల్వ కుటుంబం పెద్దిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చింది. ఎన్నికల తర్వాత కొన్నాళ్లు శ్రీనాథ్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పుంగనూరు టిడిపి ఇన్చార్జిగా చల్లా మధుసూదన్ రెడ్డిని (చల్లా బాబు) టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆయననే అభ్యర్థిగా రంగంలోకి దించారు.

పెద్దిరెడ్డికి కలిసొచ్చిన అవకాశం

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మాజీ మంత్రి ఎన్. అమర్నాథరెడ్డి పలమనేరు నియోజకవర్గానికి మకాం మార్చారు. ఆయనపై పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఎన్.వెంకటేగౌడ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు అక్కడ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ అమరనాథరెడ్డిగా మారాయి. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు ఎన్ శ్రీనాథ్ రెడ్డి.. టిడిపికి దూరంగా ఉండడంతో పెద్దిరెడ్డి కుటుంబం గాలం వేసింది.


ఇటీవల వారం కిందట మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లెలోని శ్రీనాథ్ రెడ్డి ఆయన సతీమణి అనూష రెడ్డితో స్వయంగా చర్చించి వైఎస్ఆర్సిపిలోకి తీసుకురావడంలో సఫలమయ్యారు. ఇది ఒక రకంగా టిడిపికి గండి పడినట్లు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఎం శ్రీనాథరెడ్డి లేదా ఆయన సతీమణి అనూషరెడ్డి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేయాలనే తలంపును కూడా అప్పట్లో మాజీ మంత్రి, ఆయన సోదరుడు అమర్నాథ్ రెడ్డి బతిమిలాడి నివారించగలిగారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ వాతావరణం లేకపోవడంతో వారు ఇద్దరు వైఎస్ఆర్సిపిలో చేరారని తెలుస్తోంది.

కిరణానికి బాబాయి గ్రహణం

పీలేరు నియోజకవర్గంలో కూడా మాజీ సీఎం, రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆయన బాబాయ్ గ్రహణంలా మారారని చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బాబాయ్ నల్లారి తిమ్మారెడ్డి కారణంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రాజకీయ విభేదాలు పొడచూపడానికి కారణమనేది ఆ ప్రాంతవాసులు చెప్పే మాట. గత వివరాల్లోకి వెళితే..

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సారా దుకాణాలను జిల్లాల వారీగా వేలంపాటలు నిర్వహించేవారు. ఆ సందర్భంలో పీలేరు ప్రాంతం నుంచి నల్లారి తిమ్మారెడ్డి కాంట్రాక్టు దక్కించుకున్నారు. పుంగనూరు ప్రాంతం వైపు నుంచి మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి దూకుడుగా వ్యవహరించేవారు. ఇందులో ఒక కట్టుబాటు ఉండేది. మాటమాత్రంగా పరిమితులు విధించుకునేవారు. ఒకరి ఇలాఖాలోకి మరొకరు ప్రవేశించకూడదు అనేది ఆ కట్టుబాటు సారాంశం. దీనిని అతిక్రమించిన మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి పీలేరులోకి ప్రవేశించడం కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం భరించలేక పోయిందని చెబుతారు.


ఈ వ్యాపారం నేపథ్యంలోనే ఏర్పడిన తగువ వల్ల మంత్రి పెద్దిరెడ్డికి నల్లారి సోదరుల మధ్య విభేదాలు పొడచూపాయి అంటారు. అయితే, దాదాపు రెండు దశాబ్దాల కిందటే విభేదాలు మరిచిన నల్లారి తిమ్మారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి చెంతకు చేరారని చెబుతారు. అందుకు అప్పట్లోనే మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా కిరణ్ కుమార్ రెడ్డి బాబాయ్ తిమ్మారెడ్డిని తన వైపు తిప్పుకోవడం ద్వారా వారి కంటిలో నలుసులా మారారు.. అనేది ఈ ప్రాంతం వారు చెబుతున్న మాట. ఇవన్నీ వెరసి రాజకీయ ప్రత్యర్థులకు పెద్దిరెడ్డి పంటి కింద రాయిలా మారారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి, పీలేరులో నల్లారి తిమ్మారెడ్డి అధికార వైఎస్ఆర్సిపి కి ఎంత మేలు చేస్తారు. ఆ ప్రభావం కూటమి పార్టీ అభ్యర్థులపై ఎంత మేరకు ఉంటుందని వేచి చూడాలి.

కొసమెరుపు:

పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొరుకుడు పడని కొయ్యలా మారారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 16 వేల ఓట్లు సాధించగలిగారు. ఎన్నికల్లో పొంగునూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

Read More
Next Story