
పులివెందుల- ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ప్రారంభం
పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా మోహరించిన వైసీపీ, టీడీపీ శ్రేణులు
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతోంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన పోలింగ్ మొదలు కాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ, టీడీపీ వర్గాలు మోహరించి ఉన్నాయి. పోలీసులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఇరుపార్టీల వారు ఘర్షణకు తలపడ్డారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఈ తెల్లవారుజామున (ఆగస్టు 12, మంగళవారం) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును “పోలీసుల అమానుష చర్య”గా ఆయన తీవ్రంగా ఖండించారు. ముందస్తు నోటీసు లేకుండా, సరైన కారణం చెప్పకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, వందలాది టీడీపీ కార్యకర్తలు పులివెందులలోకి వచ్చినా పట్టించుకోని పోలీసులు తనపై చర్యలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు జరిగాయని, కర్రలు, ఇనుప రాడ్లతో ఉన్న వందమంది పైగా టీడీపీ సభ్యులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు చట్టం, శాంతిభద్రతల కాపాడేవారిగా కాకుండా, టీడీపీ గూండాల్లా ప్రవర్తిస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలు స్వేచ్ఛా యుత, న్యాయమైన ఎన్నికలు అనిపించుకుంటాయా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారమై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామన్నారు.
Next Story