చంద్రన్న పాలనలో ఇక రామరాజ్యం వచ్చినట్టేనా! చటుక్కున చిక్కులు తీరతాయా!
ఇలా వచ్చిన సమస్యలు అలా చటుక్కున పరిష్కారం అవుతుంటే ఇక రామరాజ్యం వచ్చినట్టే. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నట్టే కదా. మరి ఈ పిటీషన్ల వరదేంటీ? ఈ గోలేంటీ?
2018-2019
"మన ప్రభుత్వం వచ్చాక ఏ సమస్య అయినా గ్రామ సచివాలయానికి వచ్చిన 48 గంటల్లో పరిష్కారం కావాలి. లేదా 72 గంటల్లో అది ఎందుకు పరిష్కారం కాలేదో ఎక్కడ చిక్కుందో సంబంధిత వ్యక్తికి సమాధానం వస్తుంది. ఆ తర్వాత కూడా పరిష్కారం కాకపోతే అది నేరుగా సచివాలయంలోని సంబంధిత శాఖకు వస్తుంది. ఎంత చిక్కు సమస్య అయినా వారంలో పరిష్కారం అవుతుంది.." ఈ మాట ఎవరిదో గుర్తు చేయాల్సిన పని లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంలో హామీ ఇచ్చి 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టి ఐదేళ్లు పాలన చేసి ఓడిపోయారు.
2024 సెప్టెంబర్ 28, అమరావతి.
"ప్రజావేదిక.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్థలం. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం, మంగళగిరి. ఈ వేదికలో ప్రజల నుంచి స్వీకరించే ఏ సమస్య అయినా 24 గంటల్లో పరిష్కారం కావాలి. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఏ రోజు వచ్చిన ఫిర్యాదులు ఆరోజే సంబంధిత శాఖలకు చేరాలి. గరిష్టంగా వారంలో పరిష్కారం కావాలి" ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఇలా వచ్చిన సమస్యలు అలా చటుక్కున పరిష్కారం అవుతుంటే ఇక రామరాజ్యం వచ్చినట్టే. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నట్టే కదా. అప్పుడెప్పుడో రాయలేలిన సీమ రతనాల సీమ అన్నారట. ఇక ఇప్పుడు చంద్రబాబు ఏలిన ఆంధ్రరాజ్యం రామరాజ్యం అవుతుందేమో మరి.
రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం, సమస్యలు పరిష్కారం అవుతుంటే జనం ఇంకా ఎందుకు సమస్యలతో క్యూ కడుతున్నారు. వందలు వేలల్లో ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి. పోనీ సమాజం మారుతున్నప్పుడు, మనుషులు పూటకో రకంగా ఉంటున్నప్పుడు కొత్త సమస్యలు పుట్టుకురావాలి గాని పాత సమస్యలే ఎందుకుంటున్నాయో అర్థం కావడం లేదని ఓ ప్రజా సంఘం కార్యకర్త డి.సుబ్బరాయుడు అన్నారు. నిజమే కదా.. అవే గట్టు సమస్యలు, అవే ఆక్రమణల సమస్యలు, అవే ఈతిబాధలు, కబ్జాలు, అధికారుల అవినీతి, లంచగొండితనం, విపరీత జాప్యం, పోలీసుల ఆగడాలు వంటి పాచిపోయిన సమస్యలే ఎందుకు వస్తున్నాయన్నది వాలిడ్ ప్రశ్నే. లోపం ఎక్కడుంది? పాలకులు లేదా విధాన నిర్ణేతల తీరులోనా? ప్రజల మానసిక స్థితిలోనా? అధికార దొంతర్ల వ్యవస్థలోనా? ఇవన్నీ పరిశీలించదగిన అంశాలే.
టీడీపీ కూటమి ప్రభుత్వం రాకముందు సుమారు 17వందల రోజులకు పైగా వైసీపీ ప్రభుత్వం ఉంది. గ్రామసచివాలయ వ్యవస్థతో ఎప్పటి కప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కరించినట్టు చెప్పుకువచ్చింది. అంటే కొన్ని వేల సమస్యలు పరిష్కరించి ఉంటుంది. చంద్రబాబు వచ్చాక మూడున్నర నెలల్లో సీం చంద్రబాబుకు ప్రజల నుంచి 4,396 వినతులు అందాయి. ఇందులో 75శాతం పరిష్కారమైనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుకు అందిన వినతులపై అధికారులు ఓ రిపోర్ట్ ఇచ్చారు.
ఈ నివేదిక ప్రకారం 3,327 వినతులు పరిష్కారమయ్యాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలించింది. ఆయా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి కనుక్కున్నామని కూడా అధికారులు చెబుతున్నారు. సరిగ్గా జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అధికారులు ఇదే మాట చెప్పారు. ఎవరో ఒకరికి ఫోన్ చేసి మాట్లాడించడం, వాళ్లేమో నువ్వు దేవుడివయ్యా, నువ్వు లేకపోతే మేము లేమయ్యా అంటూ దండాలు దస్కాలు పెట్టడం చూశాం. తీరా ఎన్నికలపుడు చూస్తే ఆయన 11 సీట్లతో ఓడికూర్చున్నారు.
ఇప్పుడు అధికారులు మళ్లీ అదే సీన్ ని రిపీట్ చేస్తున్నారా? తెలియదు. చంద్రబాబుకి సీఎంగా అనుభవం ఉంది. ఇలాంటి డ్రామా సీన్లు తెలియవనుకోం. మొత్తం 2వేల 5వందల వినతులపై ఈ ఆడిట్ జరిగినట్టు చెబితే చంద్రబాబు నమ్మారా? పాలకుడు గనుక నమ్మక తప్పదు. ఇందులో 1,400 మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 700 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 400 మంది ఫోన్ తీయలేదు. దీంతో వీటిపై మరోసారి పరిశీలన జరిపారు. మొత్తంగా 150 వినతులకు సంబంధించి పరిష్కారం కాకుండానే అయినట్లుగా చూపించారు. దీనిపై చంద్రబాబు ఏమి చెబుతారో చూడాలి.
కూతవేటు దూరంలో ఇన్ని సమస్యలుంటే..
రాష్ట్ర సచివాలయానికి కూతవేటు దూరంలోని జిల్లాల నుంచే ఎక్కువగా సమస్యలు వచ్చాయి. దూరాభారం నుంచి రాలేక రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల వారు సమస్యల్ని ముఖ్యమంత్రికి విన్నవించలేదు. మంగళగిరికి సమీపంలోని గుంటూరు జిల్లా నుంచి 429, ఎన్టీఆర్ జిల్లా నుంచి 358 వినతులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. 200కు పైగా వినతులు వచ్చిన జిల్లాల్లో తిరుపతి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు ఉన్నాయి. 100లోపు వినతులు అందిన జిల్లాల్లో అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలు ఉన్నాయి. మిగతా జిల్లాల నుంచి రాలేదంటే ఆ ప్రాంతాలంతా సుభిక్షంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నట్టా? చంద్రబాబు పాలన స్టైల్ సంతృప్త స్థాయి (సాచ్యురేషన్ లెవెల్). అందరి కళ్లల్లో ఆనందం చూడాలన్నది చంద్రబాబు వాంఛ. ఇప్పుడు ఆ సంతృప్తి ఒక్క గుంటూరు జిల్లా వాసుల్లోనే వ్యక్తమైందట.
సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆయనకు వినతులు ఇవ్వడానికి వచ్చినవారితో కార్యాలయం కిక్కిరిసిపోయింది. వినతులు తీసుకోవడానికి ఆయన 3గంటల పాటు నిలబడే ఉన్నారు. దివ్యాంగులు, వృద్ధుల నుంచి కార్యాలయం ప్రధాన ద్వారం వద్దే వినతులు తీసుకొన్నారు. ఏకధాటిగా మూడు గంటల పాటు చంద్రబాబు నేరుగా వినతులు స్వీకరించినా ఇంకా పెద్దసంఖ్యలో సందర్శకులు మిగిలిపోవడంతో వారినుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు తీసుకొన్నారు. అంటే సమస్యలందించే వారి జాబితా చాంతాడులా పెరిగిందే తప్ప తరగడం లేదు. పోలీసు అధికారులపై ఫిర్యాదులకు తెంపులేదు. భూకబ్జాల గోల ఆగలేదు. అధికార మార్పిడితో ఆనాటి బాధితుల గోడు వినపడుతూనే ఉంది. అరమోడ్పు కన్నులతో ఆర్ధిక సాయం కోసం ఎత్తిన చేతులు కిందకు దిగడం లేదు. దొంగ పాస్ పుస్తకాలతో వాల్చుకున్న భూమి సొంతదారుల వేదనకు అంతే లేదు. ఇలా నిన్నంతా (సెప్టెంబర్ 28) టీడీపీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. అదీ సీఎం చంద్రబాబు కనుసన్నలలో..
మరి లోపం ఎక్కడో, దానికి పరిష్కారమేమిటో చంద్రబాబు కనిపెట్టాలి. తన జీవితాన్ని ప్రజా సంక్షేమానికి అంకితం చేశానని ప్రకటించిన చంద్రబాబు మున్ముందు ప్రజల నుంచి ఈ స్థాయిలో వినతులు స్వీకరించకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు ఓ బాధితుడు రామకృష్ణ అన్న నిజం కావాలి.
Next Story