నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్కుపై ప్రజాభిప్రాయ సేక ‘రణం’!
x
సీపీఐ(ఎం) నాయకుడు లోకనాథాన్ని ఈడ్చుకెళ్తున్న పోలీసులు

నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్కుపై ప్రజాభిప్రాయ సేక ‘రణం’!

ఏడు గ్రామాల ప్రజల నిరసనలు, ఆందోళనల మధ్య అధికారులు పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్కు ఏర్పాటును అంగీకరించబోమని స్పష్టం చేశారు.


మా ప్రాణాలకు ముప్పు తెచ్చే, మా ఉపాధిని దెబ్బతీసే బల్క్‌ డ్రగ్‌ పార్కు మాకొద్దు.. మా పొట్టకొట్టే ఎలాంటి పార్కు మాకొద్దు.. ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటును విరమించుకోకపోతే మా తడాఖా చూపిస్తాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్కును అంగీకరించం’ అని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఏడు గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కుకు రాజయ్యపేటతో పాటు ఆ పరిసర గ్రామాలైన చందనాడ, బోయపాడు, అమలాపురం, బుచ్చిరాజుపేట, పాటిమీద, మూలపర్ర గ్రామాలకు చెందిన రెండు వేల ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేటాయించింది. ఇప్పడు తాజాగా నక్కపల్లి మండలంలోని పెదతీనార్ల, జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం, ఎస్‌.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామాల్లో అదనంగా మరో 800 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పార్కుకు భూ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు అదనంగా మరింత భూమిని సేకరించడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కొన్నాళ్ల నుంచి వీరు పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు, తహసీల్దారు కార్యాలయం ముట్టడి వంటి కార్యక్రమాల ద్వారా తమ నిరసనలు చేపడ్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.


బల్క్‌ డ్రగ్‌ పార్కు వద్దంటూ ఆందోళన చేస్తున్న ప్రజలు

ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత..
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రం నక్కపల్లి తహసీల్దారు కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిని అడ్డుకునేందుకు బల్క్‌ డ్రగ్‌ పార్కు ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు, వృద్ధులు, యువకులు ఉదయాన్నే పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాధిత ప్రజల్లో అధిక శాతం మంది మత్స్యకారులే ఉన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్న సంగతి తెలుసుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు.. ఈ పార్కుకు అనుకూలంగా మాట్లాడే టీడీపీ శ్రేణులను (బాధిత గ్రామాలకు చెందని వారిని కూడా) ముందుగానే ఎంపిక చేసుకున్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటైతే ఎంతో మేలు జరుగుతుందని వీరితో చెప్పించేందుకు ప్లాన్‌ వేశారు. ముందస్తు వ్యూహం ప్రకారం తొలుత వారందరినీ పబ్లిక్‌ హియరింగ్‌కు అనుమతించారు. అందుకనుగుణుంగానే వీరు బల్క్‌ డ్రగ్‌ పార్కు వస్తే ఆ ప్రాంతంలో అభివృద్ధే అభివృద్ధి, ఉపాధే ఉపాధి అంటూ ఉపన్యాసాలు దంచారు. సీపీఐ(ఎం) నాయకులు ఒకరిద్దరిని మాత్రమే రానిచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతంలో ఆందోళన చేస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.లోకనాథం, ఇతర నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అలాగే వైసీపీ నేత వీసం రామకృష్ణ సహా మరికొందరిని ముందస్తుగా హౌస్‌ అరెస్టులు చేసి మరొక ప్రాంతానికి తరలించారు.

ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న దృశ్యం

మేం ఎలా బతకాలో చెప్పండి..
తమ భూములను బలవంతంగా సేకరిస్తూ తమ గోడును వెళ్లబోసుకోనివ్వడం లేదంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితులు ఆగ్రహించారు. వీరిని పబ్లిక్‌ హియరింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లకుండా పోలీసులు నిలువరించారు. అయితే వీరు వెనక్కి తగ్గకుండా అడ్డంగా వేసిన బారికేడ్లను నెట్టేసి లోపలకు చొచ్చుకు వెళ్లారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటును ససేమిరా అంగీకరించబోమని కుండబద్దలు కొట్టారు. ఈ పార్కు వల్ల వాటిల్లే అనర్థనాలను ఏకరువు పెట్టారు. ‘మేం ఎప్పడూ సముద్రంలో చేపలేటకెల్లి బతికేవోల్లమే. ఏరోజు కట్టంతో ఆరోజే బతుకుతాం. ఈ పేక్టరీ పెట్టి ఏం మంచి సేత్తారో సెప్పండి. మాకేం జాబులిత్తారో సెప్పండి. అంట్లు తోముకునీ జాబులు, సీపుర్లు ఊడ్సుకునీ జాబులునా? పెద్ద జాబులు ఎక్కడెక్కడ నుంచి వొచ్చినోల్లకే ఇత్తనారు. మా ఊర్లో సేలామందికి కేన్సర్‌తో బాదపడుతున్నారు. వైజాగ్‌ తీసుకెల్తే అక్కడ ఆస్పటల్లో సచ్చిపోతన్నారు. జీవితాంతం కేన్సర్‌తో సచ్చిపోవడమేనా? ఉజ్జోగాలు సేసుకునీ వోళ్లే బతకండి.. మే సచ్చిపోతాం’ అని మత్స్యకార మహిళ ప్రజాభిప్రాయ సేకరణలో నిలదీస్తే.. అధికారులు నీళ్లు నమిలారు. తమ ప్రాణాలను, జీవితాలను నాశనం చేసే, ఉపాధిని హరించే బల్క్‌ డ్రగ్‌ పార్కును అడ్డుకోవడానికి ఎంతవరకైనా వెళ్తామని, ప్రాణాలైనా అర్పించి తమ భూములను కాపాడుకుంటామని అధికారులకు స్పష్టం చేశారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు వస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుందని మభ్య పెడుతున్నారని, ఒకవేళ ఇస్తే గిస్తే సెక్యూరిటీ గార్డులో, నాలుగో తరగతి ఉద్యోగాలో ఇస్తారు తప్ప మంచి ఉద్యోగాలు ఇవ్వరని తెగేసి చెప్పారు. ఇప్పటికే మొదలు పెట్టిన తొలిదశ పనుల్లో ఇతర రాష్ట్రాల వారికే తప్ప స్థానికులకు ఉద్యోగాలివ్వలేదని ఉదహరించారు.
ప్రజలే చనిపోతే అభివృద్ధి ఎవడిక్కావాలి?
‘బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజలే అనారోగ్యంతో చనిపోతారు. ప్రజలే చనిపోతే ఇక అభివృద్ధి ఎవడిక్కావాలి? అలాంటి అభివృద్ధి మాకొద్దు. రైతులు భూములు కోల్పోయి బికారులవుతారు. తాగడానికి నీళ్లులేక ఏడుస్తుంటే పోలవరం కాలువ నీళ్లు ఈ పార్కు అవసరాలకిస్తాం అంటున్నారు. ఆ నీళ్లు మాకిస్తే పంటలు పండించుకుని బతుకుతాం. బల్క్‌ డ్రగ్‌ వ్యర్థ రసాయనాలను ఎక్కడ వదులుతారో స్పష్టం చేయడం లేదు. మమ్మల్ని ఏం చేస్తారు? అంటూ గ్రామాల ప్రజలు అధికారులను నిలదీశారు.
పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నారు?
తొలుత ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కును కాకినాడ జిల్లా తొండంగి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే అప్పట్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు వ్యతిరేకంగా స్థానికుల పక్షాన నిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ నుంచి నక్కపల్లి మండలం రాజయ్యపేటకు ఈ బల్క్‌ డ్రగ్‌ పార్కును మార్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పవన్‌ కల్యాణ్‌ మాకు ఎందుకు మద్దతుగా నిలవడం లేదని, ఏం చేస్తున్నారని ఈ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భారీ బందోబస్తు నడుమ ప్రజాభిప్రాయ సేకరణ..
బల్క్‌ డ్రగ్‌ పార్కుపై ప్రజాభిప్రాయ సేకరణకు ఆయా గ్రామస్తులను నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలుసుకున్న అధికారులు నక్కపల్లి తహసీల్దారు కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి వందల సంఖ్యలో పోలీసులను రప్పించి మోహరించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు రామకృష్ణ, కుమారస్వామిలు వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలను నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది. పబ్లిక్‌ హియరింగ్‌కు నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ తదితరులు హాజరయ్యారు.
Read More
Next Story