సమ్మిట్ల పేరుతో ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారు
x

సమ్మిట్ల పేరుతో ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారు

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును కొలనుకొండ శివాజి డిమాండ్ చేశారు.


పెట్టుబడులు, సమ్మిట్ల పేరుతో కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్ష్యులు కొలనుకొండ శివాజి ధ్వజమెత్తారు. విశాఖపట్నం కేంద్రంగా జరుగనున్న సీఐఐ పారిశ్రామిక సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నది ప్రచార ఆర్భాటం తప్ప మేరేమీ కాదన్నారు. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి లోటులో ఉంటే దుబారా ఖర్చులు చేయడం వల్ల లాభం లేదన్నారు. ఇప్పటికీ విశాఖ భాగస్వామ్య సదస్సును సక్సెస్ చెయ్యటం కోసం , హెలీకాప్టర్స్, విమానాల ప్రయాణాలు, విదేశీ టూర్లు తో ప్రజా ధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేశారని మండిపడ్డారు. ఇవి అన్ని కూడా ఈవెంట్ మేనేజర్కి లబ్ది చేకూరటం కోసమే తప్ప రాష్ట్ర ఖజానాకి, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని విమర్శలు గుప్పించారు. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వడం జరగదన్నారు.

గతంలో జగన్ హాయాంలో ఇదే భాగస్వామ్య సదస్సులు జరిగాయన్నారు. సూటు-బూటు-టై కట్టుకున్న వాళ్ళు భోజనాల దగ్గర, గిఫ్టుల దగ్గర ఎలా తన్నుకున్నది అందరు చూశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేని, ప్రజా ధనాన్ని విచ్చల విడివిగా ఖర్చు పెట్టే ఇటువంటి సమ్మిట్లను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ప్రైవేటు కంపెనీలు కూడా బి.సి., యస్.సి., యస్.టి. వర్గాలకు రిజర్వేషన్ కల్పించితేనే వుపయోగం ఉంటుందన్నారు. ఏపీ బడ్జెట్ 3 1/2 లక్షల కోట్లు వుందన్నారు. ప్రభుత్వ పరంగా 6 వేల కోట్ల ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయని, దీని ద్వారా పేదలు, బడుగు, బలహీన తరగతులకు వైద్య విద్య చేరువ అవుతుందన్నారు.
పేద వర్గాలకు ఉచిత వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ మెడికల్ కాలేజిలు ప్రైవేటు పరం చెయ్యటం వల్ల ఒక్కొక్క సీట్ 2 కోట్లు పెట్టి కొనుక్కోవలసి వస్తుందని, పేద, మధ్య తరగతులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి అంత ఆర్థిక స్థోమత ఎక్కడ ఉందని కొలనుకొండ శివాజి ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వం నిర్ణయంపైన రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పీపీపీ మోడ్ లోనే చేపట్టేందుకు ముందుకెళ్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రైవేటు వారికి రాయితీలు ఇచ్చినా కూడా పేదల వైద్యానికి వారు ఉచిత వైద్యం చేయడం లేదు. అదే ప్రభుత్వం చెయ్యడం వల్ల గుంటూరు ప్రభుత్వ హాస్పటల్, కాలేజిల లాంటి కొద్ది కాలేజీలు ప్రభుత్వ అధ్వర్యములో అమోఘమైన సర్వీసులు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పారిశ్రామిక సమ్మిట్లు, ఎఐ డేటా సెంటర్ల వల్ల ఉపయోగం లేదని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజి విజ్ఞప్తి చేశారు.
Read More
Next Story