అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు కానరాని ప్రజా దర్బార్‌లు
x

అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు కానరాని ప్రజా దర్బార్‌లు

అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్‌ ప్రజల్లోకి వెళ్లింది లేదు. ప్రజల సమస్యలు తెలుసుకునింది లేదు. అధికారంలోకి వచ్చినా ప్రజల సమస్యల కోసం ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌.


ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ, వాటి పరిష్కారం కోసం అనునిత్యం పని చేసే వారు ప్రజల నేతలుగా చెరగని ముద్ర వేసుకుంటారు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేక పోయినా ప్రజల అండగా ఉంటారు.. ఆదరిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శైలి అందుకు భిన్నం. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలను కలిసేందుకు కానీ, వారి సమస్యలు వినేందుకు కానీ, ఆ సమస్యలను పరిష్కరించేందుకు కానీ ప్రయత్నించింది లేదు.. సమయం వెచ్చించింది లేదు.. అసలు అలాంటి ఆలోచనలు కూడా చేసింది లేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్యాలెస్‌కే పరిమితమయ్యారు. అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు. ప్రజా దర్బార్‌లు పెట్టి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్డీఏ కూటమి నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్‌లు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ.

2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రం ప్రతిపక్షంలో కూర్చో పెట్టారు. 2017 నవంబరు వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలు, ప్రభుత్వ పాలన తీరు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గళమెత్తుతూ వచ్చారు. అసెంబ్లీలో మాట్లాడితే లాభం లేదని, అధికారంలోకి రావాలంటే పాదయాద్రే శరణ్యమని భావించారు. 2017 నవంబరు నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబరు 6న ఇడుపులపాయలో నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో తన పాదయాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు నాటి 13 ఉమ్మడి జిల్లాలను టచ్‌ చేస్తూ పాదయాత్రను చేపట్టారు. 134 నిజయోజక వర్గాల్లో 341 రోజుల పాటు 3,648కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. 2,516 గ్రామాల్లో జగన్‌ పాదయాత్ర సాగింది. ప్రజల్లో కలియతిరుగుతూ దాదాపు 14 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమావేశాలు చేపట్టారు. తర్వాత 2019 ఎన్నికలు రానే వచ్చాయి. ఆ ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి, ప్రజలను కలిసిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత ప్రజలను ఏమి కలుస్తాములే అనుకున్నారో ఏమో కానీ క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. నవరత్నాల ద్వారా అన్నీ చేస్తున్నాం, ఇక ప్రజలకు ఏమి సమస్యలు ఉంటాయని భావించారో ఏమో ప్యాలస్‌కే పరిమితిమై, ప్రజల సమస్యలను పట్టించుకోవడం పక్కన పెట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చినా ప్రజలను కలవడం, వారి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ మాదిరిగానే జగన్‌ కూడా చేస్తారని భావించి నిరాశకు లోనయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోని జగన్‌మోహన్‌రెడ్డి, కనీసం పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా కలిసేందుకు సమయం వెచ్చించలేదనే విమర్శలు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. జక్కంపూడి రాజా, కరణం ధర్మశ్రీ, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బహిరంగానే జగన్‌ తీరు వల్లే ఓడిపోయామని విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని జగన్‌ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు గురుకొచ్చారనే విమర్శలు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.
ప్రజలను కలవడం, వారి సమస్యలను తెలుసుకోవడంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌లతో పాటు జగన్‌మోహన్‌రెడ్డిలను పోల్చుతూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. విపక్ష నేతలుగా ఉన్నప్పుడూ వారు ప్రజలను కలుస్తూ, వారి సమస్యల గురించి తెలుసుకోవడం చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానిని వదిలి పెట్ట లేదని, ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, కానీ జగన్‌ మోహన్‌రెడ్డి అందుకు భిన్నంగానే వ్యవహరించారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇటీవల జగన్‌ తన సొంత నియోజక వర్గమైన పులివెందులలో పర్యటన చేపట్టారు. దీనికి మంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలవడంతో పాటు ప్రజా దర్బార్‌ పెట్టి ప్రజలను కలిసి వారి సమస్యలను వినే ప్రయత్నం చేపట్టారు.
Read More
Next Story