
పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు 14 రోజులు రిమాండ్
ముంబాయి సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు.
డీజీపీ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు మే 7 వరకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముంబాయి సినీ నటి కాదందబరి జెత్వానీ కేసును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో ఇది వరకే సీనియర్ ఐపీఎస్ అధికారులైన కాంతిరాణా టాటా, విశాల్‌గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ ముత్యాల సత్యనారాయణలపై కూడా కేసు నమోదు చేశారు. వీరు ప్రస్తుతం సస్పెన్‌లో ఉన్నారు. తాజాగా ఈ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులును మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించిన అనంతరం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పీసీఆర్ ఆంజనేయులును మూడో ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆంజనేయులుకు మే 7 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.