పిఎస్ఆర్ అంజనేయులు ఐపీఎస్.. ఎందుకు అరెస్ట్ చేసుకోమంటున్నారు..
x

పిఎస్ఆర్ అంజనేయులు ఐపీఎస్.. ఎందుకు అరెస్ట్ చేసుకోమంటున్నారు..

సినీ నటి జత్వాని కేసు.. కోర్టులో పిటీషన్ వేసుకున్న ఐదుగ్గురికి హై కోర్టు బెయిల్ యిచ్చింది. వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు లేరు. ఎందుకు?


ఏపీ పోలీస్ ఉన్నతాధికారులను హడలెత్తించింది సినీనటి కాదంబరి జత్వానీ కేసు. కూటమి అధికారంలోకి రాగానే సినీనటి జత్వాని వద్దకు ముంబై వెళ్లిన ఏపీ పోలీస్ అధికారులు ఆమెను విజయవాడకు తీసుకొచ్చారు. ఎందుకు ఆమె వద్దకు వెళ్లారు. అసలు ఆమె ఎవరు? పోలీసు అధికారులు నేరుగా వెళ్లి ఎందుకు తీసుకు రావాల్సి వచ్చిందనే విషయంపై ఇప్పటికే చాలా వర్తలు వెలువడ్డాయి. ఆమెతో ప్రభుత్వమే కేసు పెట్టించింది. ఆమె పెట్టిన కేసు పోలీస్ అధికారులపై కావడం విశేషం. ఎందుకు ఆమె పోలీసులపై కేసు పెట్టిందనేది కేసు పెట్టిన కొత్తలో సంచలనం రేకెత్తించింది.

ఆమె కేసు పెట్టింది మొదలు దర్యాప్తు కొనసాగింది. అకారణంగా కేసు పెట్టించి జత్వానీని రిమాండ్ కు పంపించేలా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సాధారణంగా ఎవరిమీదైనా కేసు పెడెతే తాను తప్పు చేయలేదని కోర్టులో మాత్రమే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆమెపై పెట్టిన కేసు విచారణలో ఉండగానే ఆమె పోలీసులపై పెట్టిన మరో కేసులో దర్యాప్తు జరిగి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఒక ఏసీపీ, ఒక సీఐ, ఒక లాయర్ కారణమని నిర్థారించారు. ముగ్గురు ఐపీఎస్ లు, ఇద్దరు పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేసింది.

ఇద్దరు ఐపీఎస్ లతో పాటు మరో ముగ్గురికి బెయిల్

ముగ్గరు ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు బెయిల్ వచ్చింది. వీరితో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక లాయర్ కూడా బెయిల్ పొందారు. బెయిల్ పొందిన వారిలో విజయవాడ సీపీగా పనిచేసిన కాంతిరాణా తాతా, డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని ఉన్నారు. ఈ అధిరులిద్దరికీ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే వీరు జత్వానీ కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ తరువాత ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఆరుగ్గురిలో ఐదుగ్గురు వేరు వేరుగా హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐపీఎస్ లతో పాటు ఏసీపీ హనుమంతరావు, సీఐ ఎం సత్యనారాయణకు బెయిల్ వచ్చింది. వీరు కూడా సస్పెన్షన్ లోనే ఉన్నారు. వీరితో న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు కూడా బెయిల్ పొందారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈలోపు కోర్టు బెయిల్ ఇవ్వడంతో అరెస్ట్ చేసే అవకాశం కూడా లేదు.

పిఎస్ఆర్ బెయిల్ పిటీషన్ వెయ్యలేదు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పి సీతారామాంజనేయులు బెయిల్ కోసం బెయిల్ పిటీషన్ దాఖలు చేయలేదు. అందరికీ బెయిల్ వచ్చి పీఎస్ఆర్ కు ఎందుకు బెయిల్ రాలేదని ఆరా తీస్తే ఆయన బెయిల్ పిటీషన్ దాఖలు చేయలేదని తెలిసింది. దీంతో ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఆయన ఫోన్ కలవ లేదు. పోలీసులు కేసు పెట్టిన తరువాత ప్రభుత్వం సస్పెండ్ చేయగానే ఆంజనేయులు ఒకే మాట చెప్పారు. నన్ను ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నారు. ఆ మాటపై ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ స్పందించలేదు. ఐపీఎస్, ఐఏఎస్ వర్గాల్లో వీరిపై కేసుల వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. జత్వానీ పై నమోదైన కేసు కోర్టులో ఉండగానే ఆమెను పనికట్టుకుని పిలిపించి ప్రభుత్వ పెద్దలు కేసు పెట్టించి ఐపీఎస్ లను సస్పెండ్ చేశారనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. నేటి కూడా ఈ విషయంలో ప్రభుత్వంలోని కొందరు పెద్దలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.

రాజకీయాల్లోకి వస్తారా?

పీఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి. మరో ఏడాదిలో ఆయన రిటైర్డ్ కానున్నారు. 2001, 2002 సంవత్సరాల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దొంగలు, దౌర్జన్య కారులు, దోపిడీ దారులు, రౌడీలు, కబ్జా దారులు హడలెత్తి పోయారు. సమాజానికి చీడపురుగులుగా మారిన ఎంతో మందిని పూచిక పుల్లల్లా వేరి పారేశారనే చర్చ ఇప్పటికీ ఉంది. క్యాంపు కార్యాలయంలో పూజ గదిలో నుంచి బొట్టు పెట్టుకుని బయటకు వస్తున్నారంటే ఆయన సరౌండింగ్స్ లో ఎన్ కౌంటర్ జరిగిందని అందరూ భావిస్తారు. మారువేషాల్లో తిరిగి రౌడీల రూపు లేకుండా చేశారు. గుంటూరు ఎస్పీగా బాధ్యతలు తీసుకునే రోజునే ఆయన రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఎస్పి కార్యాలయానికి రిక్షాపై వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక యువతిని చీటింగ్ కేసులో అకారణంగా అరెస్ట్ చేయించారనే నేరంలో ఇరుక్కుని సస్పెండ్ కావడం ఏమిటనేది పెద్ద చర్చగా మారింది.

ఈ కేసులో ఉన్న ఇద్దరు ఐపీఎస్ లు బెయిల్ తీసుకుంటే ఈయన అసలు బెయిల్ పిటీషన్ దాఖలు చేయలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నేను తప్పు చేయలేదు. ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లటానికి సిద్ధం అని తన సన్నిహితుల వద్ద అన్నట్లు విశ్వసనీయ సమాచారం. అరెస్ట్ జరిగిన తరువాత వచ్చే సానుభూతితో రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది.

Read More
Next Story