ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హిందూవులను రెచ్చ గొడుతున్నాయా? అన్ని మతాలను కూడగుట్టుతున్నాయా? అనే సందిగ్ధం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చగా మారింది. తిరుమల లడ్డుకు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏ నాడు ఇటువంటి దుష్పరిణామాలు జరగ లేదు. వెంకటేశ్వరుని ప్రతిష్టకు భంగం కలగ లేదు. కానీ జగన్ ప్రభుత్వంలో ఇది జరిగింది. దీనికి అందరూ ఒక్కటి కావాలి. అందరు కలిసి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాలు ఇచ్చారనే దానిపై చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో దాదాపు 319 దేవాలయాలు అపవిత్రమయ్యాయి. రామతీర్థంలో రాముడి తల నరికితే ఆ తలను అర్చకులు చేత పట్టుకుని బాధపడుతుంటే తన మనసు కలత చెందింది. అస్థిరత క్రియేట్ చేయాలని తనకు లేదు. అపవిత్రం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. అందుకే అందరూ ఏకం కావాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రామతీర్థం రాముడు విషయాన్ని ఒకటికి మూడు సార్లు తన మాటల్లో చెప్పుకొస్తూ హిందువుల మనసులు కూడగట్టే యత్నం చేశారు.
దశాబ్దాల పోరాటాల ఫలితం అయోద్య రామాలయ నిర్మాణం. అయోద్యలో రాముడి ప్రతిష్ట సందర్భంగా లక్ష తిరుమల లడ్లు జగన్ పంపారు. అంటే దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని అపవిత్రులను చేశారు. జగన్ చేసిన ఈ తప్పిదం వల్ల హిందూ ధర్మం దెబ్బతినింది. గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరుగుతున్న దాన్ని ఎందుకు సమర్థించారు. వారి పై చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న థర్మారెడ్డిలు శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి ఒక్కో టికెట్‌ను రూ. 10వేలకు అమ్మారు. కానీ రసీదు రూ. 500లకే ఇచ్చారు. ఇది దోపిడీ కాదా? అంటు పవన్ ప్రశ్నించడం విశేషం. దానిలో కూడా అవినీతి చోటు చేసుకుందని, దీని వల్ల హిందువుల మనోభావాలను ఇలా కూడా దెబ్బ తీసారని మండి పడ్డారు.
తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని, అయితే ఈ విషయాలపై తాను ఆందోళనల వరకు దిగలేదన్నారు. కానీ నాడు జరిగిన విషయాలను ఇప్పుడు చూస్తే తన మనసు కలత చెంది ఆవేదనకు గురవుతుందని చెబుతూ హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చేసిన తప్పులను తిరిగి పదే పదే టీటీడీ బోర్డు చేసింది. భగవంతుడికి అన్యాయం చేస్తే శిక్ష అనుభవించక తప్పదంటూ హిందువుల అటెన్షన్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
అందరూ ఎక్కడ ఏ మతానికి అపవిత్రత జరిగిన కలిసి కట్టుగా బయటకు రావాలి అని పిలుపునిచ్చారు. ఒక మతం వారు మరో మతంపై దాడులకు దిగొద్దంటూ హితవు చెప్పారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే.. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. ఒక మతం అపవిత్రతకు గురైందని భావిస్తే.. మరో మతం వారు అపవిత్రతకు గురైన మతానికి ఎందుకు బాసటగా నిలుస్తారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు. అనేది మరో పెద్ద చర్చకు దారి తీసింది. ఎన్డీడీబీడీకి పరీక్షల కోసం నెయ్యి శాంపిల్స్‌ను పంపిస్తే అందులో సోయా, సన్‌ఫ్లవర్ వంటి పలు రకాల వెజిటబుల్ ఆయిల్స్, ఫిష్ ఆయిల్, పశువుల కొవ్వు, పంది కొవ్వు నెయ్యిలో ఉన్నట్లు రిపోర్టు వచ్చిందని, ఇంత కంటే దారుణం ఏముంటుందని వ్యాఖ్యానించారు.