
జూదరులకు ’ప్రచారం‘ శిక్ష
శ్రీకాకుళం జిల్లాకు చెందని ఓ న్యాయమూర్తి ఓ వినూత్నమైన తీర్పును వెలువరించారు. అది తెలుసుకోవాలంటే దీనిని చదవాల్సిందే..
’జూదం ఆడటం చట్ట రీత్యా నేరం‘, ’బహిరంగ ప్రదేశాలలో మద్య పానం నిషేదం‘, ’జూదం ఆడితే కుటుంబం నాశనం‘, ’జూదం వ్యసనం మానండి‘, ’జూదం ఆడితే జైలు శిక్ష తప్పదు‘ వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులు పట్టుకున్న వీళ్లేమీ సోషల్ యాక్టిస్టులు కాదు, సమాజం బాగుపడాలని, పేకాట వంటి జూదానికి బానిసలు కాకూడదని, కుటుంబాలను కాపాడుకోవాలని కోరుకునే సామాజిక కార్యకర్తలేమీ కాదు. వీరు జూదరులు. పలు మార్లు జూదం ఆడుతూ పోలీసులకు చిక్కిన వాళ్లు. కోర్టు తీర్పులతో జరిమానా కట్టిన వాళ్లు. జూలుకు వెళ్లొచ్చిన వాళ్లు. అయితే ప్రస్తుతం వీరు సామాజిక కార్యకర్తలుగా మారారు. అలా మారేలా కోర్టు కీలక పాత్ర పోషించింది. పోలీసులు దానిని అమలు చేస్తున్నారు. అది ఎలా జరిగిందంటే..
జూదరుల్లో మార్పు రావడం లేదని
శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ మళ్లీ జూదం ఆడుతూ పలుమార్లు పట్టుబడిన వ్యక్తులకు స్థానిక కోర్టు వినూత్న శిక్ష విధించింది. సాధారణ జరిమానాలు లేదా జైలు శిక్షలు విధించినా ఈ జూదరుల్లో మార్పు రావడం లేదని భావించిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి కె. శివరామకృష్ణ, నిందితులకు సరికొత్త శిక్షను విధించారు. అదేంటంటే.. పేకాట, జూదం, మద్యపానం పట్ల సమాజంలో అవగాహన కల్పించేలా ప్లకార్డులతో ప్రచారం చేయించే శిక్ష విధించారు. ఈ నవనిర్మాణాత్మక తీర్పు జూదం అనే వ్యసనం నుంచి విముక్తులు చేయడానికి, జూదం నిరోధానికి కొత్త మార్గాన్ని చూపుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇటీవల శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్ పోలీసులు జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ వీరిపైన కేసు నమోదు చేసి, బుధవారం నిందితులను జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి శివరామకృష్ణ ప్రతి నిందితుడికి రూ.1,000 అపరాధ రుసుం విధించడంతో పాటు, జూదం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి, ఆర్థిక నష్టాలు వస్తాయి వంటి సమస్యలపై ప్లకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గురువారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పించే కార్యక్రమం కొనసాగించాలని సూచించారు.
ఆ మేరకు గురువారం అరసవల్లి కూడలి వద్ద డీఎస్పీ సీహెచ్ వివేకానంద పర్యవేక్షణలో నిందితులు ప్లకార్డులు ప్రదర్శించారు. "జూదం ఆడితే కుటుంబం నాశనం", "జూదం వ్యసనం మానండి", "జూదం ఆడితే జైలు శిక్ష తప్పదు" వంటి సందేశాలు, స్లోగన్ లతో రాసిన ప్లకార్డులతో వారు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ దృశ్యం స్థానికులను ఆకర్షించగా, జూదం వ్యసనం నుంచి దూరంగా ఉండాలనే అంశంపైన చాలా మంది స్పందించారు. డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ, ఇలాంటి శిక్షలు జూదరుల్లో మార్పు తీసుకొస్తాయని, సమాజంలో అవగాహన పెంచుతాయని తెలిపారు.
మరో వైపు ఈ వినూత్నమైన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు రాష్ట్రంలోని ఇతర కోర్టులకు ఆదర్శంగా నిలుస్తుందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. జూదం వంటి వ్యసనాలను నిరోధించడానికి శిక్షలు, జరిమానాలు, జైలుకు పంపడం వంటి శిక్షలు సరిపోవని, సమాజ సేవ, అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా అమలు చేయాలని సూచిస్తున్నారు. శ్రీకాకుళం పోలీసులు జూదం నిరోధానికి నిరంతరం దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ శిక్ష మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

