చెప్పింది పది, చేసింది మూడు..అదెలా సూపర్ హిట్ అవుతుంది
x

చెప్పింది పది, చేసింది మూడు..అదెలా సూపర్ హిట్ అవుతుంది

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వైఖరిపై బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.


రాష్ట్ర ప్రభుత్వం మాటలకూ, కార్యాచరణకూ పొంతన లేదని విమర్శించారు శాసనమండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ. శనివారం జరిగిన శాసనమండలి సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వం 10 హామీలు ఇస్తే, 3 అమలు చేస్తూ సూపర్‌ హిట్‌ అంటూ ప్రచారం చేస్తోంది. ఇది ప్రజలను మోసం చేయడమే కాక, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నా, ఆ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సభలో సభ్యుల ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వడం కాకుండా తప్పించుకునే ధోరణి అవలంబించడమే కాక, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది’’ అని వ్యాఖ్యానించారు.

కార్మికుల పని గంటలు పెంచే బిల్లును విపక్షంగా తీవ్రంగా వ్యతిరేకించామని, దానిలో భాగస్వామ్యం కాదని స్పష్టం చేసిన బొత్స, క్రిడల్లో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తికి ఉద్యోగం కల్పించే బిల్లుకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కానీ, ‘‘రాజకీయ గొడవలలో చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా బిల్లులు తెస్తే, అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలు పెరిగే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించారు.
వివాదాల నడుమ మండలి వాయిదా
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో, టీడీపీ కార్యకర్త రామాంజనేయులకు ఉద్యోగం కల్పించే బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందలేకపోయింది. దీంతో, ఆ బిల్లుపై నిర్ణయం తీసుకోకముందే శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.
సభలో చైర్మన్‌ అవమానంపై చర్చ
చైర్మన్‌కు జరిగిన అవమానంపై కూడా సభలో చర్చించామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు బొత్స పేర్కొన్నారు. ‘‘ప్రజల అవసరాలకంటే, రాజకీయ లబ్ధికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం నడుస్తోంది’’ అని విమర్శించారు.
Read More
Next Story