మొక్కలకు విదేశీ ముద్రవేయడం తప్పు...
x
కోనోకార్పస్ (Conocarpus erectus) మొక్క

మొక్కలకు 'విదేశీ' ముద్రవేయడం తప్పు...

మరయితే వంకాయ, మిర్చి, ఆలూ, టమోట ... అన్నీ విదేశీ పంటలే అంటున్న ప్రొఫెసర్ బయ్యపు రెడ్డి


తెలుగు రాష్ట్రాలలో కోనో కార్పస్ (Conocarpus erectus) మొక్కపై నిరాదార నిందలు వేస్తూ ప్రజలలో భయాందోళలను కల్పిస్తూ విధ్వంసం చేయడాన్ని ఆపి, బహుళ ప్రయోజనాలు గల కోనో కార్పస్ మొక్కలను రక్షించాలని ప్రముఖ పర్యావరణ వేత్త ,వందలాది నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇప్పించడానికి తోడ్పడిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ కె. బయ్యపు రెడ్డి విజ్ఞప్తి చేశారు.

జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో కోనో కార్పస్ మొక్కలపై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

కోనో కార్పస్ విదేశీ మొక్క అనే విమర్శించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ టమాటా, ఆలుగడ్డలు, గోధుమలు, మొక్కజొన్న, కాఫీ, టీ, పొగాకు, మిర్చి లాంటి పంటలన్నీ విదేశాల నుండి తెచ్చుకున్నవే అని ఆయన గుర్తు చేశారు.


కోనో కార్పస్ మొక్క ప్రపంచంలో మొదట యమెన్ దేశంలో సహజ సిద్ధంగా పెరుగుతూ నేడు ప్రపంచంలో అత్యధిక దేశాలకు విస్తరించిందని. దుబాయ్, కువైట్, అబూదబి లాంటి గల్ఫ్ దేశాలలో నీరు లభించక పోయినప్పటికీ కోనో కార్పస్ మొక్కలు ఆయా దేశాల మొక్కలలో 70 శాతానికి పైగా పెరిగి పచ్చదనాన్ని అందిస్తున్నాయని ప్రొఫెసర్ కె. బయ్యపురెడ్డి అన్నారు.

కోనో కార్పస్ పర్యావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను అత్యధికంగా తీసుకుంటూ, అత్యధిక ఆక్సిజన్ ను అందిస్తున్న చెట్టు అని తెలుపుతూ చాలా వేగంగా పెరుగుతుందన్నారు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుందని, కలుషితమైన నీటిని, కలుషితమైన భూమిని కాపాడుతుందన్నారు. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం నుండి ప్రజలను రక్షిస్తుందని ఎలాంటి నిర్వహణ వ్యయం లేకుండా అభివృద్ధి చెందుతుందన్నారు.
అలర్జీ, ఆస్మా లాంటి సమస్యలు వ్యక్తిగతమైనవని తెలుపుతూ బెంగళూరులోని అంతర్జాతీయ విద్యాసంస్థలలో వేలాది కోనో కార్పస్ మొక్కలతో నిండి ఉన్నాయని ఏ ఒక్క విద్యార్థికీ ఆస్మా, అలర్జీ లాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని నిరాదారమైన ఆరోపణ అని తెలిపారు.
కొన్ని మొక్కలు పండ్లను, మరికొన్ని మొక్కలు పువ్వులను, కలపను అందిస్తే కోనో కార్పస్ పర్యావరణహితంగా అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్ ని తీసుకొని అత్యధిక ఆక్సిజన్ ను అందించే మొక్క అని ఆయన తెలిపారు. కోనో కార్పస్ పై ఒక పిట్ట కూడా వాలదనే ఆరోపణపై వివరణ ఇస్తూ కోనో కార్పస్ మొక్క గుబురుగా పెరుగుతుందని, గూళ్ళు పెట్టుకోవడానికి అనువుగా ఉండదని ఆయన వివరించారు.
పారిశ్రామిక వాడలు, రహదారులు, డివైడర్ల పై నాటితే వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజ నిర్ధారణ కమిటీనీ పర్యావరణ వేత్తలు, సైంటిస్టులు, ప్రముఖ వైద్యులతో ఏర్పాటు చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. గూగుల్ సంస్థ కు చెందిన జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభిప్రాయ ప్రకారం కోనో కార్పస్ మొక్క బహు ప్రయోజనాలు ఉన్నాయని తెలిపిందని వివరించారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ ఎ.ఆర్. రెడ్డి కోనో కార్పస్ పై పరిశోధనలు చేసి పర్యావరణం నుండి అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకునే మొక్క అని రుజువు చేశారన్నారు. కోనో కార్పస్ చెట్ల వేళ్ళ వలన గోడలు పగులుతాయని అనే ఆరోపణ వాస్తవం కాదని గుంటూరు నగరంలో నాలుగు అడుగులు ఉన్న డివైడర్ల పై వేలాది కోనో కార్పస్ మొక్కలను నాటి అది 20 అడుగులకు పైగా పెరిగినా ఏ డివైడర్ కు ఎలాంటి పగుళ్ళు రాలేదని గుర్తు చేశారు.
ప్రపంచంలో ఏ మొక్క అయినా పగలు కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ను వదులుతుందని, కొందరు రాజకీయ నేతలు దీనికి భిన్నంగా పేర్కొనడం వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. జన చైతన్య వేదిక తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో కోనో కార్పస్ పై ఉన్న అపోహాలను తొలగించడానికి, వాటి ప్రయోజనాలను వివరించడానికి సదస్సులు, చర్చ గోస్టులు నిర్వహిస్తామని తెలిపారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలో సగటున ఒక్కొక్క మనిషికి 422 చెట్లు ఉండగా బ్రెజిల్ లో 1500, అమెరికాలో 720, కెనడాలో 318, చైనాలో 140 చెట్లు ఉండగా భారతదేశంలో కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు.

బహుళ ప్రయోజనాలను అందించే కోనో కార్పస్ మొక్కలను రక్షించడానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వృక్ష ప్రేమికులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్ ఇ. ఫల్గుణ కుమార్, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్వ మెంబర్ సెక్రటరీ ఎస్వి యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ టి.వి . కృష్ణారెడ్డి, ఆల్ ఇండియా నేషనల్ బిసి ఫ్రంట్ కన్వీనర్ కే ఎం ఎల్ నరసింహ తదితరులు ప్రసంగించారు. ప్రొఫెసర్ కె బయ్యపురెడ్డి కోనో కార్పస్ మొక్కలపై అందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందర్నీ ఆకర్షించింది.


Read More
Next Story