
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ–ఒక పెద్ద స్కామ్
తాము అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు,
ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఒక పెద్ద స్కామ్ అని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. శనివారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి మెడికల్ కళాశాలలను తీసుకొస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు వాటిని చంపేశారంటే ధ్వజమెత్తారు. ఎంతో కష్టపడి వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను ఏపీకి తీసుకొస్తే వాటిని సీఎం చంద్రబాబు అమ్మకానికి పెట్టారని, అలా అమ్మకానికి పెడితే పేదల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. వైద్య విద్యను పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు దూరం చేశారని మండిపడ్డారు. ధనవంతులు మాదిరిగా కోట్లు ఖర్చు చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యను చదవ గలరా అన్ని నిలదీవారు. మెడికల్ కళాశాలలే కాకుండా, వాటికి కోసం సేకరించిన భూములను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని విడదల రజని ఆరోపించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తాము, తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. తాము, తమ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి ఆ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరం చేస్తామన్నారు. ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ స్కాం వెనుక ఎందరు ఉన్నారో, ఎవరు ఉన్నారో తేలుస్తామని హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ కూడా లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో సీఎం చంద్రబాబు ఆటలు ఆడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా సంస్థలకు కట్టబెట్టడం వెనుక కూడా పెద్ద స్కాం ఉందని రజని విమర్శించారు, వైఎస్ పేరును ప్రజల్లో లేకుండా చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రులు చేస్తున్నారని, తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపి, ఆ ప్రజల ప్రాణాలను కాపాడాలని విడదల రజని డిమాండ్ చేశారు.