వైన్‌ షాపుల కోసం ప్రైవేటు వ్యక్తుల ఆరాటం
x

వైన్‌ షాపుల కోసం ప్రైవేటు వ్యక్తుల ఆరాటం

మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు మద్యం సిండికేట్లు రంగంలోకి దిగాయి. వ్యక్తులు కూడా ఎక్కవుగా దరఖాస్తులు చేసే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో వైన్‌ షాపులకు దరఖాస్తులు ప్రారంభయ్యాయి. ప్రైవేటు వారికి అప్పగిస్తుండటంతో దుకాణాలను దక్కించుకునేందుకు వ్యక్తుల్లో ఆరాటం ఎక్కువైంది. ఒక్కొక్కరు ఆరు నుంచి పది దరఖాస్తులు కూడా చేసుకుంటున్నారు. మరి కొందరు సిండికేట్‌గా తయారై వంద షాపుల వరకు అప్లికేషన్‌లు పెట్టాలని నిర్ణయించుకోవడం విశేషం. సిండికేట్‌లో ఎవరి పేరుతో దుకాణం వచ్చినా, అందరూ కలిసి నిర్వహణ ఖర్చులు భరించుకోవడంతో పాటు లాభాలు పంచుకుంటారు. మంగళవారం నుంచి దరఖాస్తులు చేసుకోవడం మొదలు కాగా మంగళవారం రెండు వందలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అమావాస్య రోజులు కావడం, బుధ, గురువారాలను కూడా అమావాస్య రోజులుగానే పరిగణించడం వల్ల ఈ రెండు రోజులు ఎక్కువ దరఖాస్తులు దాఖలయ్యే అవకాశాలు తక్కువ. మంగళవారం ఒక్క రోజు దాఖలైన వాటిల్లో ఎక్కువ శాతం మాన్యువల్‌గా ఇచ్చినవే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లలో ఈ దరఖాస్తులు దాఖలు చేశారు.

అందుబాటులోకి వెబ్‌ పోర్టల్‌
నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు వెబ్‌ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది...... ఈ వెబ్‌ పోర్టల్‌ ద్వారా నేరుగా దరఖాస్తులు ఎక్సైజ్‌ శాఖకు చేరేలా పంపొచ్చు. ముందుగా వెబ్‌ పోర్టల్‌లో లాగిన్‌ కావలసి ఉంటుంది. ఎక్సైజ్‌శాఖ వెబ్‌సైట్‌లో ఈ పోర్టల్‌ ఉంది. యూజర్‌ ఐడీగా దరఖాస్తు దారులు తమ ఫోన్‌ నంబర్లను ఉపయోగించుకోవచ్చు. పాస్‌వర్డ్‌ వారికి ఇష్టమైన దానిని ఇచ్చి లాగిన్‌ కావచ్చు. లాగిన్‌ అయిన తర్వాత ఎలా దరఖాస్తులు చేసుకోవాలనే దానిపై ఉత్తర్వులను కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు. నూతనంగా లాగిన్‌ అయ్యే వెబ్‌ పోర్టల్‌కు సంబంధించి యూజర్‌ మాన్యువల్‌ను కూడా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.
సీఎం చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన తర్వాత 2017లో 4,380 షాపులకు 78వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రస్తుతం 3,396 షాపులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ షాపులను దక్కించుకునేందుకు లక్షకు పైగా దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒక్కో దుకాణానికి సగటున 30 దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. నాన్‌ రీఫండబుల్‌ డిపాజిట్‌ కింద తీసుకునే మొత్తం రూ. 2వేల కోట్ల వరకు వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2,261 దుకాణాలు , నగరాల్లో 511, మునిసిపాలిటీల్లో 499, నగర పంచాయతీల్లో 125 షాపులు ఏర్పాటు చేస్తున్నారు.
నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంటుందా?
గత ప్రభుత్వం కంటే నాణ్యమైన లిక్కర్‌ను తక్కువ ధరలకు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆరు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కమిటీ పర్యటించి ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఈ నివేదిక ప్రకారం గిట్టుబాటు ధరలకు ఇస్తేనే గత ప్రభుత్వంలో విక్రయించిన రేట్ల కంటే 50 శాతం తక్కువ రేట్లకు ఇవ్వొచ్చని అధ్యాయన కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. మద్యం ప్రియులు కోరుకునే ప్రతి బ్రాండ్‌ను దుకాణాల్లో ఉంచాలని, మద్యం షాపులను దక్కించుకున్న వారికి ఆదేశాలు ఇవ్వనున్నారు. మంచి బ్రాండ్స్‌ అనిపించి డిమాండ్‌ పెరిగిందని ధరలు పెంచే అవకాశం లేకుండా ఎక్సైజ్‌ విధానాన్ని తీసుకొని రానున్నారు. తమ బ్రాండ్‌ ప్రత్యేకతను అడ్వరై్టజ్‌మెంట్‌ చేసుకునేందుకు మాల్స్‌ వద్ద డిస్టల్లరీస్‌కు సంబంధించిన వారు షాపుల యజమానుల అనుమతులతో లోపలికి రావచ్చని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది.
ఈ నెల తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. శుక్రవారం నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మద్యం వ్యాపారంలోకి గతంలో వచ్చిన వారే ఎక్కువుగా వచ్చే అవకాశాలు ఉంటాయని, ఈ వ్యాపారంలో లాభ నష్టాల గురించి వారికే బాగా ఐడియా ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది.
Read More
Next Story