
కడప కొండల్లోని గుహల్లో బండరాళ్లపై గీసిన చిత్రాలు
కడప కొండల్లో ఆదిమానవుల ఆవాసాలు!
మొన్న జ్వాలాపురం.. ఇప్పుడు కడప కొండలు.. మానవజాతి పరిణామ క్రమానికి గురుతులు.. నిజంగానే ఆదిమానవులు ఇక్కడున్నారా?
రాయలసీమకు మానవజాతి పరిణామ క్రమానికి సంబంధం ఉండి ఉండవచ్చునన్న అనుమానాలకు రుజువులు దొరుకుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లా నేటి నంద్యాల జిల్లా జ్వాలాపురం గ్రామం పురాతత్వ ప్రాంతంగా రికార్డులకు ఎక్కింది. సుమారు 73 వేల సంవత్సరాల కిందట ఇండోనేషియాలోని టోబో అగ్నిపర్వతం పేలితే ఆ శకలాలు ఇక్కడ వచ్చి వాలాయని పురాతత్వ నిపుణులు నిగ్గుతేల్చారు. టోబోలో విరజిమ్మిన బూడిద ఇక్కడి జుర్రేరు ఆనకట్ట నుండి బనగానపల్లె వరకు నదీ తీరం వెంట 9 కిలోమీటర్ల మేర సగటున ఓ మీటరు మందాన బూడిద పేరుకు పోయింది. జ్వాలాపురం వద్ద 2003 నుండి 2010 వరకు జరిపిన తవ్వకాల్లో టోబా విస్ఫోటనానికి ముందు దాని తరువాత కూడా ఇక్కడ మానవ ఆవాసాలు ఉండేవనే ఆధారాలు లభించాయి. ఈ బూడిద పొరకు అడుగున, పైనా కూడా ఆధునిక మానవులు వాడిన పనిముట్లు వేలాదిగా లభించాయి.
ఇప్పుడు తాజాగా కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్లు లభించాయి. కడప కొండల్లోని అనేక ప్రాంతాల్లో చరిత్రపూర్వ శిలా కళాఖండాలు ఉన్నట్టు తేలింది. కడప జిల్లా బద్వేలు, సిద్దవటం, మైదుకూరు పరిధిలోని లంకమల అభయారణ్యంలోని కొండల్లో వేల సంవత్సరాల నాటి ఎన్నో చారిత్రక వింతలు, విశేషాలు బయటపడుతున్నాయి. కుశస్థలి నది, చింతకుంట, కొండ వాలుపై చిన్న గుహ లాంటి నిర్మాణం కూడా ఇప్పటికే కనిపించాయి.
కుశస్థలి నది ప్రాంతంలో జంతువుల వేట, పిల్లల్ని కాపాడుకోవడం వంటి బొమ్మలు కనిపించగా చింతకుంట గ్రామం వద్ద ఒక రాతి కట్టడంపై మూపురం ఉన్న ఎద్దుల బొమ్మలు కనిపించాయి. విల్లు, బాణాలతో ఉన్న మనుషుల బొమ్మలు కనిపిస్తాయి. ఇక కొండ వాలు ప్రాంతంలో మెగాలిథిక్ సంస్కృతి లేదా ఆదిమ సమాజానికి సంబంధించిన రాతి కళతో కూడిన చిన్న గుహ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
ఇప్పుడు పురావస్తు శాఖ పరిశోధనల్లో నిష్ణాతులైన మునిరత్నం రెడ్డి, యేసుబాబు ఆధ్వర్యంలో ఓ బృందం కడప అటవీ ప్రాంతంలో పర్యటిస్తోంది. ఆదిమానవుడు ఇక్కడ జీవించినట్లు ఈ బృందం పలు ఆధారాలను సేకరించింది.
ఈ బృందం అందించిన సమాచారం ప్రకారం మల్లుగాని బండ (గవి) వద్ద రాతియుగం నాటి ఆదిమానవుడు గీసిన జంతువులు, మనుషులను పోలిన కొన్ని రేఖా చిత్రాలను గుర్తించింది. బండిగాని సెల వద్ద ఉన్న ఒక గుహలో ఆదిమానవుని ఆవాసాలు, రే ఖాచిత్రాలు ఉన్నాయి. తెలుపు రంగుతో గీసిన రేఖా చిత్రాల్లో అడవి జంతువులు, ఆహార వ్యవహారాలకు సంబంధించినవి ఉన్నాయి.
ఇతర వివరాలు...
ఈ బృందంలోని ఓ సభ్యుడు (పేరు రాయడానికి ఇష్టపడలేదు) అందించిన వివరాల ప్రకారం.."ఎరుపు రంగుతో వేసిన బొమ్మల్లో గుర్రం, రాజు, సైన్యం, ఖడ్గం వంటి ఆయుధాలు వాడినట్టు గుహల్లో బొమ్మలు కనిపిస్తున్నాయి. జంతువుల వేటకు ఉపయోగించే ఆయుధాల చిత్రాలు కూడా ఉన్నాయి" మూడు రాతి స్థావరాల్లో ఒకదానిలో రేఖాచిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలలో ముఖ్యంగా మనుషుల, జంతువుల రేఖాచిత్రాలున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహలలో ఆదిమ మానవులు సంచార జీవులుగా నివసించే వాళ్లు. ఇక్కడ నీటి వసతి ఉండడంతో.. జంతువులను వేటాడి జీవించే వాళ్లు.
ఆదిమ మానవుల జీవితానికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, త్వరలో అన్ని వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని యేసుబాబు బృందం ప్రకటించింది.
Next Story