
ప్రధాన మంత్రి కర్మయోగి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాని సభలో భరోసా ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కర్మయోగి, ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
‘‘ప్రధాని మోదీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారు. దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో.. అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి. ఇబ్బందులు ఉన్నా.. ఏమున్నా తట్టుకుని నిలబడాలి. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు సీఎం చంద్రబాబు. ప్రధాని, సీఎం నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తాం. వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తాం’’ అని పవన్ అన్నారు.
ఆయన కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు రెండు మూడు తరాల ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోంది. జీవిత, ఆరోగ్య భీమా సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటం వల్ల ప్రజలు ఆదా చేసుకోగలుగుతారు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.