నష్టపరిహారం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి
x

నష్టపరిహారం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి

మొంథా తుఫాను ప్రభావంపైన వైఎస్ జగన్ YSRCP నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో బారీగా పంటల నష్టాలు జరిగిన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజియనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో తుఫాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంటల నష్టం, దెబ్బతిన్నఆస్తుల వివరాలను అడిగి తెలుసుకుని, వాటిపైన చర్చించారు. బాధిత ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నాయకులకు జగన్‌ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలబడాలని, వారి సమస్యలకు ప్రభుత్వం నుంచి పరిష్కారమయ్యే దిశగా కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు YSRCP నేతలు, కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తూ, ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడం, ఆహారం, మందులు, అత్యవసర సామగ్రి అందించడంలో కీలక పాత్ర పోషించారు. తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న గ్రామాల్లో పర్యటించి, నష్టాలు అంచనాల వివరాలను కాన్ఫరెన్స్‌లో జగన్‌కు వివరించారు.

YSRCP పార్టీ ప్రతి జిల్లాలోనూ బాధితుల సహాయ సంఘాలు ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. ఈ కాన్ఫరెన్స్‌లో జగన్, పార్టీ స్థాయిలో మరిన్ని సహాయ చర్యలు, ప్రభుత్వంపై ఒత్తిడి వ్యూహాలు, రాబోయే రాజకీయ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజల సేవలు అందించడం పార్టీ మొదటి ప్రాధాన్యత అని గుర్తు చేస్తూ, తుఫాను తర్వాత పునర్నిర్మాణంలో పార్టీ పాత్రను బలోపేతం చేయాలని పిలుపు ఇచ్చారు.

Read More
Next Story