
తిరుచానూరు ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆమె ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి వేద పండితులు అందజేశారు.
ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ ఎస్ వేంకటేశ్వర్ , జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుచానూరులో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానికుల రాకపోకలను నిలిపివేశారు.
తిరుచానూరు పర్యటన ముగించుకుని సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేస్తారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవెంకటేశ్వర స్వామిని రాష్ట్రపతి దర్శించుకుంటారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తిరుపతి పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలలో కూడా ఆమె పాల్గొంటారు.
Next Story

