‘అదంతా అబద్ధమే’.. భార్య బర్త్‌డే వేడుకపై ప్రత్తిపాటి క్లారిటీ..
x

‘అదంతా అబద్ధమే’.. భార్య బర్త్‌డే వేడుకపై ప్రత్తిపాటి క్లారిటీ..

ప్రత్తిపాటి పుల్లారావు భార్య ప్రత్తిపాటి వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా సంచలనంగా మారాయి. సాధారణ గృహిణిగా.. పెద్దగా ప్రజల్లో గుర్తింపు కూడా లేని ఆమె తన పుట్టిన రోజు వేడుకలను సీఐలు, ఎస్సైల సమక్షంలో జరుపుకోవడమే ఇందుకు కారణం.


ప్రత్తిపాటి పుల్లారావు భార్య ప్రత్తిపాటి వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా సంచలనంగా మారాయి. సాధారణ గృహిణిగా.. పెద్దగా ప్రజల్లో గుర్తింపు కూడా లేని ఆమె తన పుట్టిన రోజు వేడుకలను సీఐలు, ఎస్సైల సమక్షంలో జరుపుకోవడమే ఇందుకు కారణం. మామూలుగా ఇంకెవరైనా ఇలా చేసుకున్నా పెద్దగా కలకలం రేపేది కాదే.. కేవలం ఆమె ఎమ్మెల్యే ప్రత్తిటి పుల్లారావు సతీమణి కావడంతోనే ఆమె పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఎలాంటి అధికారం లేని ఒక మహిళ పుట్టిన రోజు వేడుకను పోలీసులు జరపడం వెనక అసలు కారణం ఏంటని వైసీపీ వాళ్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్తా వివాదంగా మారడంతో దీనిపై ప్రత్తిపాటి పుల్లారావు ఘాటుగా స్పందించారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అది యాదృచ్ఛికమే..

తన భార్య పుట్టినరోజు నాడు జరిగిన పరిణామాలు యాదృచ్ఛికమేనని ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. ఎవరూ అనుకోని చేసినవి కావని, కేవలం వైసీపీ చేస్తున్న నిరాధారమైన, అసత్య ప్రచారాలే పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నవంటూ మండిపడ్డారు. జరిగింది ఒకటి అయితే దానిని మరో రకంగా చిత్రీకరించి తన ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్నారని విమర్శించారు. ఏమీ విషయం, విశేషం లేకపోయినా తన కుటుంబంపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం, ఆరోపణలు చేయడం, కించిత్‌గా మాట్లాడటం తనను ఎంతగానో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారు అంటున్నట్లే తన భార్య ఎటువంటి అధికారంలేని, సాధారణ మహిళ అని, తనపై ఉన్న కోపం, కక్షను ఆమెను మాటలు అంటూ తీర్చుకోవడం ఏమాత్రం సబబు కాదని ఆయన అన్నారు.

పదవికే కాదు.. పార్టీకీ రాజీనామా చేస్తా..

ఈ సందర్భంగా ఆయన వైసీపీకి ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. ‘‘ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించడానికి పోలీసులను పిలిచాను. అదే సమయంలో పార్టీ నేతలు కేక్ తీసుకురావడం యాదృచ్ఛికంగా జరిగింది. నా భార్య కేక్ కట్ చేస్తుంటే పోలీసులు అక్కడ ఉండటం అనుకోకుండా జరిగిన పరిణామమే.. కావాలని చేసింది కాదు. అంతేకాకుండా అధికారుల బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారని, అక్రమ వ్యాపారలకు కొమ్ము కాస్తున్నారంటూ హైదరాబాద్‌లో ఉన్న నా కుటుంబంపై బురద జల్లడం సమంజసంకాదు. బదిలీల్లో మా కుటుంబం జోక్యం ఉంటే దానిని నిరూపించాలి. నిరూపించిన మరుక్షణం నేను పదవికే కాదు.. పార్టీకి కూడా రాజీనామా చేస్తా’’ అని సవాల్ చేశారు.

జరుగుతున్న ప్రచారం ఇదీ..

ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ మంగళవారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందులో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌లు పాల్గొన్నారు. ఎటువంటి అధికారం, హోదా లేకపోయినా వెంకట కుమారి అలియాస్ వెంకాయమ్మ పుట్టినరోజును పోలీసులు ఘనంగా నిర్వహించారు. కేక్ తీసుకొచ్చి కట్ చేయించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా బదిలీల్లో ప్రత్తిపాటి జోక్యం ఉండటంతో దానికి సంబంధించి కాకా పట్టడానికే సదరు పోలీసులు అక్కడకు చేరుకున్నారని వైసీపీ వారు ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్తిపాటి కంటే అధిక హోదాలో కొనసాగారు ఆయన భార్య వెంకాయమ్య. ఈసారి ప్రత్తిపాటికి మంత్రి పదవి రాకపోవడానికి కూడా అదే కారణమన్న వాదన వినిపిస్తోంది. కానీ ఇప్పటికి కూడా నియోజకవర్గంలో నియామకాలు, సెటిల్‌మెంట్లు, దందాలు అన్నీ కూడా వెంకాయమ్మ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, అందులో భాగంగానే తమ బదిలీలో, నియామకాల గురించి చర్చించడానికే అక్కడకు వెళ్లి ఆమె పుట్టినరోజును అధికారులు ఘనంగా నిర్వహించారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read More
Next Story