ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద తాకిడి
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద తాకిడి పెరిగింది. దాదాపు 45 వేల క్యూసెక్కులు సముద్రం పాలయ్యాయి.
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటెత్తింది. భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. గత నెలలో వరద పోటెత్తడం, బోట్లు కొట్టుకొని రవాడంతో ప్రకాశం బ్యారేజీ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో మళ్లీ వదర నీరు వచ్చి చేరుతోంది.
ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద వస్తోంది. సోమవారం నుంచే వరద నీరు పెరుగుతోందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ప్రకాశం బ్యారేజికి 45వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు ఏఈ దినేశ్ తెలిపారు.
భారీగానే వరద వస్తున్న నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. మత్స్య కారులు ఎవరూ నదిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇటీవల వరదలకు విజయవాడ పట్టణం అతలాకుతలం అవ్వడంతో మళ్లీ వరద, భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరో వైపు శ్రీశైలం బ్యారేజికి మంగళవారం ఉదయం 1,27,548 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా, 77,821 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గత నెలల వచ్చిన వరదల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరిన లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
Next Story