
గూగుల్, ఫేస్ బుక్ గుప్పెట్లో యాడ్ రెవెన్యూ : ప్రబీర్ పురకాయస్థ
‘ప్రజాస్వామ్యానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ఫ్యాసిస్టు శక్తుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనేది పెద్ద ప్రశ్న’
‘‘ఏ వార్తా సంస్థ మనుగడకయినా యాడ్ రెవెన్యూ అవసరం. తొంభై శాతం యాడ్ రెవెన్యూను గూగుల్, ఫేస్ బుక్ అదుపు చేస్తున్నాయి. చిన్న పత్రికలకు, ప్రాంతీయ వార్తా సంస్థలకు ఇదొక పెద్ద సవాలుగా తయారైంది’’ అని ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రబీర్ పురకాయస్థ తిరుపతికి వచ్చిన సందర్భంగా, నేటి వార్తా సంస్థల తీరు తెన్నుల గురించి ఆదివారం ఉదయం స్థానికి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘‘ నా పై ఉన్న కోర్టు కేసుల గురించిబెయిల్ కండీషన్ల వల్ల, మాట్లాడదలుచుకోవడంలేదు. ప్రస్తుతం వార్తా త్రికలు, రేడియో, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎంతో సమాచారం అందుతోంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే వ్యవస్థలో వార్తలు కూడా ఒక భాగం. సైన్స్ ఉద్యమంలో ఉన్న నేను వామపక్షభావాలున్న వాడిని. నా రాజకీయాల వల్ల ప్రజలకు ఏం చెప్పాలి, ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నది ఆలోచించాను. నా రాజకీయాలు, సామాజిక సంబంధాల కోసం ఒక స్వతంత్ర ప్లాట్ ఫాం ఏర్పాటు చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో కొద్దిమంది మిత్రులతో కలిసి ‘న్యూస్ క్లిక్’ ( NewsClick) అనే వెబ్ సైట్ ను స్థాపించాను. పెద్ద పెద్ద పత్రికలు, ఛానెళ్లు ఎలా ఉన్నాయో, ఎలాంటి సమస్యలను ఎదుర్కొటున్నాయో పరిశీలించాను.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల నుద్దేశించి ప్రసంగి స్తున్న న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకా యస్థ
నాకున్న పరిమితమైన అవకాశాలతో వార్తా రంగంలోకి ఎలా ప్రవేశించాలి? పెద్ద సంస్థలతో ఎలా పోటీపడాలి? ఒక జర్నలిస్టుగా ప్రజలకు వాస్తవాలను ఎలా చెప్పాలి? ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అనే సవాళ్లు నా ముందుకొచ్చాయి. కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను ప్రజాబాహుళ్యానికి ఎలా అందివ్వాలోనని కూడా ఆలోచించాను.
మీడియా అంటే ఏదో ఒక యాజమాన్యమే కదా! యాజమాన్యం చెప్పిందే రాయాలి కదా!?దీనికి భిన్నంగా ప్రజలకు వాస్తవాలు చెప్పడం ముఖ్యం అనుకున్నాం. ప్రజాస్వామ్యానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ఫ్యాసిస్టు శక్తుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రెస్ క్లబ్ పాత్ర ఏమిటి? నూతన టెక్నాలజీ వస్తోంది. దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం అన్నది మన ముందున్న ప్రశ్న. నా పరిమితులు ఏమిటి, ఏ విషయం చెప్పాలి, ఎలా చెప్పాలనే సమస్యలను ప్రస్తుత వార్తా సంస్థలు ఎదుర్కొంటున్నాయి.
నా చదువు రీత్యా నేను ఇంజనీర్ ను. అది నా మౌలికాంశం. ప్రతివారికీ ఇప్పడు ఇంటర్ నెట్ కనెక్షన్ ఉంది. గూగుల్, యూట్యూబ్, జిమెయిల్ వంటి కమ్యూనికేషన్ అవకాశాలను వాడుకుంటున్నాం. నేటి జర్నలిస్టులు ఏం నేర్చుకోవాలి? చిన్న చిన్న సంస్థలకు ఎలాంటి సాంకేతికత కావాలి? పెద్ద సంస్థల నుంచి ఎదురయ్యే పోటీలో మనం ఎలా చేయాలి? కొత్తగా వచ్చిన జర్నలిస్టులకు ఎలా చేయాలో చెప్పాను.
ముఖ్యంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? లక్షలాది మంది రైతులు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారు? వారిక ఏం కావాలి? ట్రాఫిక్ జాం ఎందుకవుతోంది? వాటికి పరిష్కారాలేమిటి? వంటి క్షేత్ర స్థాయి విషయాల గురించిన దృష్టి కోణం జర్నలిస్టులకు అవసరం. ఇతర ప్రాంతాలతో సంబంధాలకు ఆడియో, వీడియో, రేడియో వార్తలు సరిపోవు. నిన్న జరిగిన సంఘటనలను ఈ రోజు దినపత్రికల్లో వస్తాయి. ఇంటర్ నెట్ సదుపాయం వల్ల ప్రసారాలు 24 గంటలు అందుబాటులోకి వచ్చాయి. పాత టెక్నాలజీతో సమాచార సేకరణ ఇప్పుడు సాధ్యం కాదు. జర్నలిస్టులు ఆధునిక టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ’’ అని సూచించారు.
కార్పొరేట్ శక్తుల ఆధ్వర్యంలో నడిచే సంస్థలనుంచి వచ్చే పోటీని స్వతంత్ర జర్నలిస్టులు ఎదుర్కోగలరా? అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి నేతాజీ ప్రశ్నించారు. దీనికి ప్రబీర్ పురకాయస్థ సమాధానం చెపుతూ, వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తెరిస్తే అంతా యాడ్సే. అయనప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో స్వతంత్రంగా వార్తలు అందివ్వడమే ముఖ్యం అన్నారు.
నాటి ఎమర్జెన్సీని చూశారు. ఇప్పటి ఎమర్జెన్సీ పరిస్థితినీ చూస్తున్నారు. రెండు ఎమర్జెన్సీల మధ్య తేడా ఏం గమనించారు? అని గాలి నాగరాజ అనే మరో సీనియర్ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు సమాధానంగా ప్రబీర్ పురకాయస్థ మాట్లాడుతూ, ‘‘రెంటి మధ్య తేడా అయితే ఉంది. రెండు ప్రభుత్వాల స్వభావాల మధ్య కూడా తేడా ఉంది. అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీలో మార్పు వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు దాడులు చేసే అవకాశాలు పెరిగాయి. ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. ప్రతిఘటించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. నేను ఆశావాదిని.నా ఆశ ఏమిటంటే, సమాజం పెద్ద శక్తి. దాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజాశక్తిని ఓడిస్తారని నేననుకోవడం లేదు. ప్రజల గొంతులను అదుపు చేయలేరు’’ అని స్పష్టం చేశారు.
ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని టెన్ టీవీ రిపోర్టర్, తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్. మురళి వేసిన ప్రశ్నకు సమాధానంగా ‘‘కొన్ని గొంతులు కాదు, అనేక గొంతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. పెద్ద పెద్ద పెట్టుబడులను, ప్రభుత్వాలను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. నిజంగా ఇది పాఠకులకు, రచయితలకు, జర్నలిస్టులకు ఒక ఘర్షణే’’ అని ప్రబీర్ పురకాయస్థ చెప్పారు.
ఎమర్జెన్సీలో ప్రబీర్ పురకాయస్థను నాసా కింద అరెస్టు చేయడం, 2009లో ఆయన స్థాపించిన 'న్యూస్ క్లిక్' పైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరె క్టరేట్ వారి దాడులు, ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పెట్టిన కేసులు, సుప్రీం కోర్టు జోక్యం వంటి విషయాలన్నిటినీ సీనియర్ జర్నలిస్ట్ రాఘవ ముందుగా వివరించారు. ఈ సభలో తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలచంద్ర, ఒక నాటి ప్రజాశక్తి రిపోర్టర్, ప్రస్తుత సీపియం నాయకులు కందారపు మురళి కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రబీర్ పురకాయస్థను సన్మానించారు. ఈ సమావేశంలో అనేక మంది జర్నలిస్టులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి
వలసాధిపత్యం కోసమే ట్రంప్ టారిఫ్ యుద్ధం
నండూరి ప్రసాదరావు స్మారక సదస్పులో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ

