
Medical students
పీపీపీ వైద్య విద్య- సామాజిక న్యాయం మిథ్య
“ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ” అనే భావన వచ్చే 5,10 ఏళ్లలో మాయమయ్యే ప్రమాదం ఉందంటున్న మానవ హక్కుల వేదిక
(మార్పు శరత్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, టీచర్ ఎడ్యుకేషన్ సంస్థలు, అనుబంధ హాస్పిటళ్లను PPP (Public Private Partnership) విధానంలో ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించే దిశగా ముందుకువెళ్తోంది. ఇది అభివృద్ధి కాదు, విద్యార్థుల సామూహిక హక్కుల హననంగా భావించాల్సి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి...
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 57,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంబిబిఎస్, బీడీఎస్, నర్సింగ్, పారామెడికల్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, రష్యా, ఫిలిప్పీన్స్, ఖజకిస్తాన్ వంటి రాష్ట్రాలు/దేశాలకు వలస వెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీలలో పరిమిత సీట్లు ఉండడం, ప్రైవేట్ సంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.
కేంద్రం అనుమతించిన 17 కొత్త మెడికల్ కాలేజీలలో 8 ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా వాటిని ప్రభుత్వం ప్రజా నియంత్రణలో కాకుండా PPP ఒప్పందాల రూపంలో ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా జరగడమంటే బలహీన వర్గాలను మెడికల్ వైద్య సదుపాయాల నుంచి దూరం చేయడమే. మెడికల్ కాలేజీలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లు కూడా అమ్మకాల జాబితాలో ఉన్నాయి.
ఒక్కో మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా “సంయుక్త నిర్వహణ” పేరుతో ప్రైవేట్ కన్సార్టియాలకు అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని అమలు చేస్తే పేదలకు ఉచిత వైద్యం పూర్తిగా దెబ్బతింటుంది.
ప్రైవేటీకరణ వల్ల కలిగే ప్రమాదాలెన్నో..
ఆరోగ్య బీమా పథకాలు ప్రైవెట్ కంపెనీలు దోపిడీ ప్రాంగణాలుగా మారతాయి. బడుగు జనాల వైద్య హక్కు ఖరీదు అయిపోతుంది. అంగడి సరుకుగా మారుతుంది. ఫీజులు పెరుగుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఎంబిబిఎస్ సీటు ఖర్చు ₹30,000–₹50,000 ఉండగా, ప్రైవేట్ రంగంలో అది 12–15 లక్షల వరకూ ఉంది. మేనేజ్మెంట్ కోట సీట్లు కోటి రూపాయల పై మాటే. PPP మోడల్ తర్వాత ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది.
సీట్లను మేనేజ్మెంట్లు ఇష్టానుసారం అమ్ముకుంటాయి. సామూహిక రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతాయి. గ్రామీణ విద్యార్థులు చదువులకు దూరం అవుతారు. షెడ్యూల్ తెగలు, కులాలలో క్రిమిలేయర్ (సంపన్న శ్రేణులు) మినహా మిగతా విద్యార్థులు అవకాశాలు కోల్పోతారు.
ఆసుపత్రులు సేవా కేంద్రాల కంటే లాభసాటి కేంద్రాలుగా మారతాయి. వేలల్లో ఉండాల్సిన బిల్లులు లక్షల్లోకి వెళతాయి. ఇది సామాన్యుడి జీవించే హక్కు పై దాడే.
ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఆగిపోతుంది. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, తక్కువ జీతాలకే పనిచేయాల్సి ఉంటుంది. అవి కూడా తాత్కాలికి నియామకాలు గానే ఉంటాయి పర్మినెంట్ ఉద్యోగాలు రావు.
ఇతర దేశాల్లో ఏమి జరిగిందంటే...
బ్రిటన్‌లో పీపీపీ మోడల్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్రభుత్వం తిరిగి ప్రజా రంగానికే వైద్య/విద్య సంస్థలను తీసుకురావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో పీపీపీ మోడల్ లో మెడికల్ స్కూళ్లు నిర్వహించాలని ప్రయత్నించి ఘోరంగా దెబ్బతిన్నారు. చివరికవి నిర్వీర్యం అయ్యాయి. చిలీలో విద్య రంగంలో ప్రైవేటు పెట్టుబడి సామాన్య ప్రజలను విద్యా హక్కు నుండి దూరం చేసింది.
ఇండియాలోని వివిధ రాష్ట్రాల అనుభవం కూడా దాదాపు ఇలాగే ఉంది. హర్యానా, మహారాష్ట్రలో PPP కాలేజీలు మూతపడిన ఉదాహరణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇదీ పరిస్థితి..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య సంస్థలలో నిపుణులు, అధిక ప్రతిష్ఠాత్మక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగ్ ఆడిట్ నివేదిక ప్రకారం 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 149 ప్రొఫెసర్ పోస్టులు, 156 అసోసియెట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,316 సెకండరీ హెల్త్ సంస్థలలో 743 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య పరికరాలు, ఔషధాలు సమయానికి అందకపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. పలుచోట్ల యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన సాగుతోంది.
ప్రైవేట్ హాసిపిటల్స్, ప్రైవేట్ వైద్య సంస్థలకు ప్రభుత్వ పథకాలు (అయుష్మాన్ భారత్, NTR వైద్య సేవ) అప్పగిస్తే ఏమవుతుందో ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ అనుభవమే. బీమా ఉన్నప్పటికీ సకాలంలో వైద్యం అందని దాఖలాలు ఎన్నో... వైద్య ఉచిత పరీక్షలు అనేవి పేరుకే గాని ఎక్కడా ఆచరణాత్మకంగా లేదు. అందువల్ల ప్రైవేట్ రంగం సహకరిస్తుందనడం సందేహమే.
ఈ పరిస్థితుల్లో తీసుకువస్తున్న పీపీపీ మోడల్ వైద్య కళాశాలలను వ్యతిరేకించాలి. పీపీపీ మోడల్ లో జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. పీపీపీ మోడల్ వల్ల ప్రభుత్వ వైద్య విద్య చతికిలపడుతుంది. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ చేతుల్లోకి వెళతాయి. అడ్మిషన్లలో సామాజిక న్యాయం మాయం అవుతుంది.
“ఆరోగ్యం–విద్య” పౌర హక్కుల నుండి “సర్వీస్ ప్యాకేజ్”గా మారుతుంది. ఈ దశలో ప్రజా సంఘాలు, వైద్య విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల వేదికలు, యూనియన్లు, ఉపాధ్యాయ సంస్థలు ఉద్యమ వైఖరితో ముందుకు రావలసిందే. సమష్టి ఆందోళనలకు పూనుకోవాల్సిందే.
కేంద్ర–రాష్ట్ర పాలకుల్లో ఉన్న ప్రైవేటీకరణ మోజు అడ్డుకట్ట వేయకపోతే, “ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ” అనే భావన వచ్చే 5,10 ఏళ్లలో మాయమయ్యే ప్రమాదం ఉంది.
ప్రజా వనరులు – ప్రజల కోసమనే సూత్రం కూలిపోకుండా నిలబెట్టుకోవడం ఇప్పుడు ప్రజల, ప్రజాస్వామిక వాదుల కనీస బాధ్యత.
(రచయిత- మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు)
Next Story