పొంగులేటి రు. 6 వేల కోట్లు నిజమేనా ?
x
Minister Ponguleti Srinivasula Reddy

పొంగులేటి రు. 6 వేల కోట్లు నిజమేనా ?

రెవిన్యుశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు తమ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు


రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు మాట్లాడినా లేదా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడినా వేల కోట్ల రూపాయల లెక్కలే ఉంటున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే రెవిన్యుశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు తమ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు. కేసీఆర్ ఆలోచనే దుబ్బాక ఎంఎల్ఏల కొత్త ప్రభాకరరెడ్డి నోటివెంట వచ్చిందని మంత్రి అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ ఎంఎల్ఏల(Telangana Congress MLAs)ను కొనుగోలుచేసేందుకు బీఆర్ఎస్(BRS) రు. 6 వేల కోట్లు ఖర్చుచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు. తమప్రభుత్వం ఏర్పడిన 15నెలలకే కూల్చేయాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్న విషయం బయటపడిందన్నారు. కేసీఆర్(KCR) కుట్రలను చూస్తు ఊరుకునేదిలేదని మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు.

అధికారంలో ఉన్నపుడు తమకు కావాల్సిన వాళ్ళకు అడ్డగోలుగా కేసీఆర్ వేలాది కోట్లరూపాయలు అనేకరూపాల్లో దోచిపెట్టినట్లు ఆరోపించారు. అలాంటివాళ్ళంతా ఇపుడు తమ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నట్లు పొంగులేటి(Ponguleti Srinivasareddy) చెప్పారు. తమ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్నవాళ్ళే బీఆర్ఎస్(BRS) కు నిధులు అందించి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు. ప్రజాధనాన్ని అడ్డుగోలుగా దోచుకున్నవారిని, ప్రభుత్వ భూములను చెరబట్టిన వాళ్ళు ఏడేడు లోకాల అవతల ఎక్కడున్నా వదిలిపెట్టేదిలేదని మంత్రి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత కుట్రలకు ఎలా చెక్ పెట్టాలో తమకు బాగా తెలుసని మంత్రి థీమా వ్యక్తంచేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ రు. 6 వేల కోట్లు ఖర్చుపెట్టడానికి రెడీగా ఉన్నట్లు మంత్రి ఆరోపించారు. ఈ 6 వేల కోట్లరూపాయల ఖర్చు ఎందుకంటే ఎంఎల్ఏలను కొనుగోలు చేయటానికని చెప్పారు. కాంగ్రెస్ కు ఇపుడున్నఎంఎల్ఏలు 64మంది. ఇంతమందిని కొనుగోలుచేయటానికి బీఆర్ఎస్ 6 వేల కోట్లరూపాయలను రెడీగా పెట్టుకున్నదంటే ఒక్కొక్కిరికి సుమారు 94 కోట్లరూపాయలు ఇవ్వటానికి సిద్ధపడినట్లుగా అర్ధంచేసుకోవాలి. మొత్తం 64 మంది ఎంఎల్ఏల్లో అందరూ ప్రలోభాలకు గురవ్వరు కదా. ప్రలోభాలకు గురయ్యేవాళ్ళు కొంతమంది ఎంఎల్ఏలు మాత్రమే ఉంటారు. పైగా అధికారపార్టీ నుండి ప్రతిపక్షంలోకి వెళ్ళేవాళ్ళు ఇప్పటికైతే ఎవరూ ఉండరనే అనుకోవాలి.

ఎందుకంటే, అధికారపార్టీలోఉంటే పనులుజరుగుతాయి, కాంట్రాక్టులుదక్కుతాయి, బిల్లులు మంజూరుచేయించుకోవచ్చు. మూడున్నర సంవత్సరాల అధికారపార్టీ అండను వదులుకుని ఎవరూ ప్రతిపక్షంలోకి వెళ్ళాలని అనుకోరు. ఎన్నికలకు ముందు ఏడాది లేదా ఆరుమాసాల్లో కాంగ్రెస్ కు మళ్ళీ గెలుపు అవకాశాలు లేవని అనుకున్నపుడు మాత్రమే ప్రతిపక్షాల్లో చేరటానికి ఎంఎల్ఏలు ఆలోచిస్తారు. బీఆర్ఎస్ ప్రస్తుత బలం 38మంది ఎంఎల్ఏలు. వీళ్ళల్లో కూడా 10 మంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. అంటే నెంబర్ గేమ్ లో బీఆర్ఎస్ ప్రస్తుత బలం 28 మంది ఎంఎల్ఏలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీఆర్ఎస్ తక్కువలో తక్కువ 33 మంది ఎంఎల్ఏలను కొనుగోలు చేయాల్సుంటుంది. అంతమందిని కొనుగోలు చేయటం సాధ్యంకాదు. పైగా ఒకరిద్దరితో బీఆర్ఎస్ మాట్లాడగానే విషయం ఏదోలా బయటకు పొక్కుతుంది. అప్పుడు రేవంత్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుకదా.

ఒకవైపు ఫిరాయింపుల మీద పోరాడుతు...

ఒకవైపు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల మీద అనర్హత వేటుపడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రింకోర్టులో పోరాడుతున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS MLAs defections) మీద అనర్హత వేటుకోసం పోరాడుతు మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఎల్ఏలను కొనుగోలుచేసే ఆలోచనచేస్తుందా ? ఒకవేళ ఏదోలా బీఆర్ఎస్ ఆలోచనచేసినా రేవంత్ కొనసాగనిస్తారా ? కాబట్టి ఏ విధంగా చూసినా పొంగులేటి చెప్పినట్లుగా కాంగ్రెస్ ఎంఎల్ఏలను కొనుగోలుచేయటానికి బీఆర్ఎస్ రు. 6 వేల కోట్లను ఖర్చుచేయటానికి సిద్ధంగా ఉందన్నది కేవలం ఆరోపణ మాత్రమే అనిపిస్తోంది. కొంతమంది కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాక్కున్నా బీఆర్ఎస్ ఎలాగూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేందని అందరికీ తెలిసిందే. ఏదేమైనా పొంగులేటి చెప్పిన రు. 6 వేల కోట్ల కథపై చర్చలైతే జరుగుతున్నాయి. చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story