సీమకు వ్యాపించిన.. కన్నడిగుల రాజకీయ పవనాలు..
x

" సీమ"కు వ్యాపించిన.. కన్నడిగుల రాజకీయ పవనాలు..

రాయలసీమ ప్రాంతంపై కర్ణాటక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడి పవనాలు బలంగా వ్యాపిస్తున్నాయి.


(ఎస్.ఎస్.వి భాస్కర్ రావ్)


తిరుపతి: కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా రాయలసీమ రాజకీయాలు కేంద్రీకృతమవుతాయి. ఎన్నికల వాడి, వేడి రగలక ముందే పొరుగునే ఉన్న సీమ జిల్లాలకు వ్యాపించాయి. చివరికి ప్రస్తుత ఎన్నికలకు అభ్యర్థులు కూడా కర్ణాటక నుంచి దిగుమతి అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని కీలక నేతలు చేసిన సిఫారసులు కూడా పని చేశాయి. వారి కనుసన్నల్లోనే అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు కూడా చోటు దక్కింది. "రాజకీయాల్లో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో బిజెపి, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎవరికి ఎవరూ తీసుపోరు అని అనిపించుకున్నట్లు పరిస్థితి చెబుతోంది.

గత ఎన్నికల అనుభవాలు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానికంగానే కాకుండా కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి రాయలసీమకు రాజకీయ పవనాలు వ్యాపించే దిశగా వ్యూహాలు సిద్ధం చేశారు. 2024 ఎన్నికలకు కూడా సమీకరణలు, ప్రచార వ్యూహాలు సిద్ధం చేస్తారు. విరాళాలు కూడా ఈ సమావేశమే వేదిక అవుతుందనేది పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పే మాట. ఎన్నికల నేపథ్యంలో ఆ తరహా వ్యూహాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సిపి, టిడిపి పక్షాన బెంగళూరు ఐటీ, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో స్థిరపడిన వర్గాలు రాయలసీమ జిల్లాల వైపు దృష్టి సారించాయి. ప్రధానంగా వైఎస్ఆర్సిపి ఐటీ విభాగం, బెంగళూరు టిడిపి ఫోరం ప్రతినిధులు, సభ్యులు రాయలసీమ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లోకి దిగేశారు.

వైఎస్ఆర్సిపి సిద్ధం

ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్సిపి సిద్ధం సభలతో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. అంతకుముందే.. బెంగళూరులో వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సన్నద్ధమైంది. ఆ విభాగం ఇంచార్జ్ పోశం రెడ్డి సునీల్ రెడ్డి, ఐటి విభాగం ఉద్యోగులు, ఆర్థిక అనుబంధంగా పనిచేస్తున్న వారితో పాటు అభిమానులు కూడా సమీకరించారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన ప్రగతి, సామాన్య ప్రజలకు జరిగిన మేలు వంటి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించాలని నిర్దేశం చేశారు. ప్రజల్లోకి బలంగా పేదల పక్షపాతి ప్రభుత్వంగా అమలు చేసిన కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం సిద్ధం చేశారు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే భాషలో వీడియోలు, పోస్టింగ్స్ తయారు చేసే తీరుపై సన్నద్ధం చేశారు. అదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా అమలు చేయాల్సిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి కూడా మరో వేదికగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.


బిల్డర్స్‌తో భేటీ..!

పలమనేరు వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడకు బెంగళూరుతో అనుబంధం ఉంది. తాపీ మేస్త్రిగా, బిల్డర్‌గా జీవితాన్ని ప్రారంభించినకు ఆయనకు బెంగళూరులో విస్తృత పరిచయాలు సంబంధాలు ఉన్నాయి. దీంతో చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువకులతో పాటు భవనాన్ని నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూడా అక్కడ జరిగిన సమావేశంలో వెంకటయ్య గౌడ్ వారి మద్దతు కోరారు. ఆయనకు అంగ, ఆర్థిక బలం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు సమాచారం. అదే కోవలో కుప్పం వైఎస్ఆర్సిపి నాయకులు, పీలేరు, మదనపల్లి, అనంతపురం జిల్లాలోని పడమటి ప్రాంత వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా వేరువేరుగా తమ ప్రాంతాలకు చెందిన అనేక విభాగాల్లో స్థిరపడిన వారు వ్యాపారంలో ఉన్న వారితో వ్యక్తిగత సమావేశాలు నిర్వహించుకోవడం ద్వారా మద్దతు సమీకరించిన దిశలో ఎవరికి వారు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు సంసిద్ధమయ్యారు.

మేము సిద్ధమే: టిడిపి

కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఏడాది క్రితమే సమాయత్తమైంది. నెల క్రితం టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో బెంగళూరు ఐటీ విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంత టిడిపి నాయకులు కూడా జత కలిశారు. అందులో పలమనేరు, అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం, గుంతకల్, కదిరితో పాటు హిందూపురం ప్రాంత నాయకులు కూడా కలిశారు. వారిలో పలమనేర్ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అనంతపురం ప్రాంతం నుంచి అమెరికానేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్‌తో పాటు అనేకమంది సీనియర్ నాయకులు ఉన్నారు.

నేడు చంద్రగిరి అభ్యర్థి భేటీ

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పులివర్తి నాని.. బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. బెంగళూరు నగరం నారాయణపురం సమీపంలోని మహాదేవపురా వద్ద "చంద్రగిరి బెంగళూరియన్స్" సమ్మిట్ ఏర్పాటు చేశారు. పులివర్తి నాని, ఇంతకుముందు అధికార, ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తమ ఓటర్లను ప్రధానంగా వివిధ రంగాల్లో స్థిరపడిన వారిని మద్దతు కూడగట్టడానికి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు, ఉద్యోగాల్లో ఉన్న యువకులు తమ ప్రాంతంలోని పార్టీలకు, నాయకులకు అండగా నిలుస్తున్నారు. తమకు తోచిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రత్యక్షంగా కూడా నియోజకవర్గాల్లోకి దిగిపోతున్నారు. ఆ కోవలో..

అనంతలో చురుగ్గా ప్రచారం

బెంగళూరులో జరిగే సమావేశాలకు హాజరయ్యే ఐటీ నేరుగా అధికార వైఎస్ఆర్‌సీపీ, టిడిపి నుంచి కూడా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. వైఎస్ఆర్సిపి ఐటీ, సోషల్ మీడియా విభాగాలు ఆ పార్టీకి బలంగా మారాయి. సోషల్ మీడియా ద్వారా కంటెంట్ ను సిద్ధం చేసి జనంలోకి వదిలిపెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బెంగళూరు టిడిపి ఫోరం సభ్యులు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. అందులో భాగంగా.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి టిడిపి ప్రధానంగా ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చారిత్రక అంశాన్ని వివరిస్తున్నారు.

అనంతపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, హిందూపురంలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతుగా బెంగళూరు టిడిపి ఫోరం ప్రతినిధులు కార్యాచరణలోకి దిగారు. నిధుల కోసం పార్టీపై ఆధారపడకుండా ఎవరి ఖర్చులు వారే భరిస్తున్నారని ఆ వింగ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మద్దతుగా బెంగళూరు టిడిపి ఫోరం రంగం లేక దిగింది. పొరుగు రాష్ట్రాలు కర్ణాటక తో పాటు హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి కూడా వివిధ రంగాల్లో స్థిరపడిన వారు అధికార ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా తమ వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధమయ్యారు.


సీమపై కర్ణాటక పవనాలు

ఆధారంగా అల్పపీడనం సముద్రాల్లో ఏర్పడుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ అల్పపీడనం రాయలసీమలోని అన్ని నియోజకవర్గాలకు వ్యాపిస్తున్నాయి. ఇందులో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రభావితం చేయగలిగారు. అందుకు ప్రధాన నిదర్శనం అంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా గుమ్మ నూరి జయరాంను కర్ణాటక నాయకుల ప్రమేయం ఉందంటున్నారు. గుమ్మనూరు జయరాం సోదరుడు కర్ణాటకలో మంత్రి. ఆయనతో పాటు మరో నాయకుడు సాగించిన మంతనాల వల్లే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు గుంతకల్ టికెట్ దక్కిందన్నారు.

అక్కడ బిజెపి... ఇక్కడ వైఎస్ఆర్సిపి

ఎన్నికల్లో మరో గమ్మత్తయిన సంఘటన కూడా చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో బిజెపి ఎంపీగా గెలిచిన మహిళ ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. మైనింగ్ సామ్రాజ్యానికి అధిపతిగా జనార్దన్ రెడ్డికి కుడి భుజంగా ఉండే బళ్లారి జే. శ్రీరాములు సోదరి కావడం గమనించదగిన విషయం. బళ్ళారి బిజెపి నాయకుడు జై శ్రీరాములు సోదరి జలదరాసి 2008 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా బళ్ళారి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బళ్లారిలో పుట్టి పెరిగిన జలదరాశి శాంతకు అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. తర్వాత వారంతా బళ్లారికే వెళ్లి జీవిస్తున్నారు.

అనూహ్యంగా జలదరాశి శాంతకు హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ఆమె సోదరుడు శ్రీరాములు మాత్రం బిజెపిలోనే ఉండడం గమనార్హం. బళ్ళారి బిజెపి మాజీ ఎంపీ శాంతను వైఎస్సార్సీపీలోకి తీసుకురావడంలో రాజంపేట సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన నాయకుల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మరో ముగ్గురు నాయకుల కృషి ఉన్నట్లు సమాచారం.

"నాకు 2014, 2018 ఎన్నికల్లో నా పేరు పరిశీలనకు తీసుకున్నారు. అవకాశం లభించలేదు. ప్రస్తుత పరిస్థితి నాకు అవకాశం లభించేలా చేసింది" ఒక ఇంటర్వ్యూలో హిందూపురం టిడిపి అభ్యర్థి జలదరాశి శాంత వ్యాఖ్యానించారు. "నేను కర్ణాటకలో పుట్టిన .. అనంతపురం జిల్లా గుంతకల్లు కోడలినే. ఈ ప్రాంతం పట్ల సంపూర్ణ అవగాహన ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు నాకు స్ఫూర్తి. స్థానికులకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా" అని శాంత తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏది ఏమైనా రాయలసీమ ప్రాంత రాజకీయాలు, పరిస్థితులు పొరుగునే ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో కేంద్రీకృతమై ఉంటాయని సుస్పష్టం అయింది. ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కర్ణాటీయన్స్ ఏ మేరకు ప్రభావం చేయగలరనేది కాలమే నిర్ణయించాలి!




Read More
Next Story