
హైకోర్ట్ వెళ్లమన్నా..తాడిపత్రికి నో ఎంట్రీ
తాడిపత్రికి చేరుకోకుండా మధ్యలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆపేసిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం మరోమారు వేడెక్కింది.వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఈరోజూ చేదు అనుభవం ఎదురయింది. తాడిపత్రిలో అడుగుపెట్టాలన్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఈ ఆధిపత్య పోరు నాటకీయ పరిణామాలకు వేదికైంది.ఎవరికివారు పైచేయి సాధించాలని భావించిన జేసీ, కేతిరెడ్డి మధ్య పోలీసులు నలిగిపోయారు.
ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పోలీసు బందోబస్తుతో కేతిరెడ్డిని తాడిపత్రికి చేర్చాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తిమ్మంపల్లి నుంచి పట్టణంలోకి వస్తున్న ఆయనను పోలీసులు మార్గమధ్యంలోనే నిలిపివేశారు. కేతిరెడ్డి కోర్టు ఉత్తర్వులను చూపించినా, ఉన్నతాధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పి పోలీసులు అనుమతించలేదు. మొత్తంమీద, కోర్టు ఆదేశాలు, రాజకీయ వ్యూహాల నడుమ తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణంలో శివుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టడం కూడా కేతిరెడ్డిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అనుచరులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాలు ఎదురుపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కూడా బలగాలను ఏర్పాటు చేశారు.
కేతిరెడ్డీ.. దమ్ముంటే తాడిపత్రికి రా!
అంతకుముందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి అడుగుపెట్టనివ్వబోమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చిచెప్పారు. "కేతిరెడ్డీ..దమ్ముంటే తాడిపత్రికి రా..తేల్చుకుందాం" అంటూ బహిరంగ సవాల్ విసిరారు. హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్న క్రమంలో జేసీ ఈ సవాల్ విసిరారు .కోర్టు ఆదేశాలు ఎన్ని ఉన్నా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. "ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి, ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు, అక్రమాలకు ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టాలు, న్యాయాలు మీకు ఒకలా, మాకు ఒకలా వర్తిస్తాయా?" అని ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా పెద్దారెడ్డిపై కక్ష లేదని, కానీ ఆయన చేసిన పనులను మాత్రం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ముందు తాడిపత్రికి రావడం కాదు, అక్రమంగా నిర్మించిన తన ఇంటి సంగతి చూసుకోవాలని పెద్దారెడ్డికి జేసీ హితవు పలికారు.
పోలీసుల వివరణ
పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకున్న ఘటనపై డీఎస్పీ వెంకటేశులు స్పందించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతోందని, దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. అదే సమయంలో కేతిరెడ్డి పట్టణంలోకి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఆపాల్సి వచ్చిందని వివరించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు తీరుపై పెద్దిరెడ్డి ఆగ్రహం
పోలీసుల చర్యపై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి కాకుండా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. “పోలీసులకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వమా లేక జేసీనా?” అని ఆయన ప్రశ్నించారు. గతంలో తాను ఎలాంటి ఫ్యాక్షనిజం చేయలేదని, అయినా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని కేతిరెడ్డి తెలిపారు.
Next Story