మామ అల్లుళ్ల మధ్య రాజకీయ వార్‌!
x

మామ అల్లుళ్ల మధ్య రాజకీయ వార్‌!

వారిద్దరూ మామ అల్లుళ్లు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వారు ఒకటిగా కలిసిమెలసి ఉంటూ ఒకరు రాజకీయం చేస్తే మరొకరు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిసారించేవారు.


మడకశిరలో పట్టు కోసం ‘రఘువీరారెడ్డి’ ఆరాటం

టీడీపీ అభ్యర్థి విజయం కోసం మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పోరాటం


ఎపిలోని శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాజకీయాలు తారుమారయ్యాయి. ఎవరికి వారు పట్టు సాధించేందుకు వారిద్దరి మధ్య బంధుత్వ బాంధవ్యాలు తెగిపోయాయి. కాలానుగుణంగా వారిద్దరి మధ్య చిన్నచిన్న రాజకీయ వైషమ్యాలు పొడచూపడంతో తిప్పేస్వామి టీడీపీలో చేరారు. అనంతరం రెండో సారి ఎమ్మెల్సీగా ఆయనకు టీడీపీ అవకాశం ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కకావికలమైనా రఘువీరారెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీనే అంటి పెట్టుకొని ఉంటూ ఎప్పటికైనా పూర్వవైభవం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు.

టీడీపీ అభ్యర్థి మార్పుతో రాజకీయం తారుమారు..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎస్సీ రిజర్డ్వ్‌ స్థానమైన మడకశిర నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ పేరును తొలుత అధిష్టానం ప్రకటించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి ఈరన్న ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తనను రాజకీయంగా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు చేస్తూ వచ్చాడు. అంతటితో ఆగకుండా తిప్పేస్వామికి రాజకీయంగా ప్రత్యర్థి అయిన రఘువీరారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చాడు. దీన్ని జీర్ణించుకోలేని తిప్పేస్వామి ఈ ఎన్నికల్లో ఈరన్నకు టికెట్‌ ఇవ్వకుండా అడ్డుపడుతూ వచ్చారు. అధిష్టానం మాత్రం ఈరన్నకు కాకుండా ఆయన కుమారుడు సునీల్‌ కుమార్‌కు టికెట్‌ ఖరారు చేసి ఆయన విజయానికి సహకరించాలని తిప్పేస్వామిపై అధిష్టానం వత్తిడి పెంచింది. అయినప్పటికీ ఆయన ససేమిరా అంటూనే అభ్యర్థిని మార్పు చేస్తే తాను గెలిపించి బహుమతిగా ఇస్తానని అధిష్టానానికి తరచూ చెబుతూ వచ్చారు. ఇలాంటి పస్థితుల్లో మొదట అభ్యర్థిగా ప్రకటించిన సునీల్‌ కుమార్‌ను కాదని అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి చెందిన ఎం.ఎస్‌.రాజును అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా రెండు రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు బి ఫాం ఇచ్చారు.

ఈరన్నకు రఘువీరారెడ్డి ఆఫర్‌..

తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఇవ్వకుండా అవమానించారని, కాంగ్రెస్‌లో చేరితే టికెట్‌ ఇవ్వడంతో పాటు గెలిపించుకుంటానని ఈరన్నకు మాజీ మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఈరన్న లేదా ఆయన కుమారుడు సునీల్‌ కుమార్‌ ఎవరినో ఒకరిని కాంగ్రెస్‌ తరపున పోటీ చేయించాలని రఘువీరారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుధాకర్‌ పేరు ప్రకటించినా..

కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘువీరారెడ్డి అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే టీడీపీ నుంచి టికెట్‌ చేజారడంతో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న లేదా ఆయన కుమారుడు సునీల్‌ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి టికెట్‌ ఇవ్వాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి యోచిస్తున్నారు. ఈ ఫార్ములా సక్సెస్‌ అయితే టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు విజయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఈరన్నకు దాదాపు 20 వేల ఓట్లు సాలిడ్‌గా ఉన్నాయని ఆయన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తే విజయం సునాయాసంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈరన్న లేదా ఆయన కుమారుడు సునీల్‌ కుమార్‌కు టికెట్‌ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన విజయానికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్‌ బహిరంగంగా చెబుతున్నారు.

టీడీపీ అభ్యర్థి కోసం గట్టి ప్రయత్నం..

తొలుత ప్రకటించిన డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ను కాదని తన కోరిక మేరకు టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్‌ రాజుకు అధిష్టానం బి ఫాం ఇవ్వడంతో ఎలాగైనా తన పరువు నిలుపుకునేందుకు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని ఆయన అధిష్టానం వద్ద హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం టీడీపీ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

త్రిముఖ పోటీ..

మడకశిర నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ విజయం కోసం రాజకీయ ఉద్దండుడు మాజీ మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డి ఇప్పటికే దాదాపు నియోజకవర్గం మొత్తం తిరిగారు. అదేవిధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తన విజయం సునాయాసంగా ఉంటుందని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఈర లక్కప్ప గట్టి నమ్మకంతో ఉన్నారు. రాష్ట్ర విభజన చేసి అభివృద్ధికి నోచుకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి, కొండలను దోచుకున్నారనే ఆరోపణలు ప్రజలు చేస్తున్నందున ఆ పార్టీకి ఓటు వేయరని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో అంతిమ విజయం తమదేనని టీడీపీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు.

Read More
Next Story