
తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి
ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. పవన్ కల్యాణ్ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో మంటలు రేపుతున్నాయి. పవన్‌కల్యాణ్ కామెంట్స్‌పై రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు సీరియస్ అయ్యారు. అయితే ఎన్డీఏలో పవన్ భాగస్వామి కావడంతో బీజేపీ మాత్రం ఇంకా ఎటువంటి కామెంట్లు చేయలేదు.
పవన్ ఏమన్నారంటే..
పవన్ కల్యాణ్ గత వారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తూ.. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి పచ్చదనమే కారణమన్నారు. నరుడు దిష్టికి నల్ల రాయి అయినా బద్దలైపోతుందని అంటుంటారని, ఆ దిష్టి కోనసీమకు తగిలిందన్నారు. కోనసీమలో చుట్టూ పచ్చదనం, కొబ్బరి చెట్లు ఉంటాయని అంటుంటారని, కానీ ఇప్పుడు విరిగిపోయిన చెట్లే కనిపిస్తున్నాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
పవన్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే...
తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే పవన్‌కల్యాణ్ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు తనన బాధించాయన్నారు. వెంటనే బేషరతుగా పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
ఒకవేళ పవన్‌కల్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని ఆయన హెచ్చరించారు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా చెబుతున్నా…పవన్‌కు సంబంధించి ఒక్క సినిమాను కూఢా థియేటర్‌లో విడుదల కానివ్వమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి సూపర్‌స్టార్ అయినా మంచోడని కోమటిరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ దిష్టి కాదు, ఆంధ్రా పాలకుల వల్ల తమ రాష్ట్ర ప్రజలు ప్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజాన్ని ఎంతగా బాధించాయో, ఆ రాష్ట్ర నాయకుల ఆవేదన, ఆగ్రహం చూశాకైనా పవన్‌కు అర్థమై వుంటుంది. ఈ నేపథ్యంలో తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటారా? లేక మరింత రెచ్చగొట్టేలా స్పందిస్తారా? అనేది తెలియాల్సి వుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే...
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గోదావరి జిల్లాల పచ్చదనానికి తెలంగాణ దిష్టి తగిలినట్టుందని ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు.
తాజాగా పవన్ కామెంట్స్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి విరుచుకుపడ్డారు. పవన్‌కల్యాణ్‌వి తలతిక్క మాటలుగా ఆయన అభివర్ణించారు. అలాంటి మాటలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. తెలంగాణపై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో ఇబ్బంది పడాల్సి వస్తుందని మంత్రి శ్రీహరి హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదన్నారు.
తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావని ఆయన గుర్తు చేశారు. మైలేజీ పొందాలంటే పనితనం చూపాలని హితవు చెప్పారు. అన్నదమ్ముల్లా విడిపోయామని, కలిసుందామని ఆయన అన్నారు.
Next Story

