రాజకీయపార్టీలకు, మీడియాకు ‘లడ్డు’ భలే దొరికిందిగా
x

రాజకీయపార్టీలకు, మీడియాకు ‘లడ్డు’ భలే దొరికిందిగా

మనదేశంలో రాజకీయపార్టీలకు, మీడియాకు ప్రతిరోజు ఏదో ఒక వివాదం కావాల్సిందే. ఒక అడ్వర్టైజ్మెంటులో ‘లడ్డూ కావాలా నాయనా’ అని ఒక గొంతు వినబడటం అందరికీ తెలిసిందే.


మనదేశంలో రాజకీయపార్టీలకు, మీడియాకు ప్రతిరోజు ఏదో ఒక వివాదం కావాల్సిందే. ఒక అడ్వర్టైజ్మెంటులో ‘లడ్డూ కావాలా నాయనా’ అని ఒక గొంతు వినబడటం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు రాజకీయ నేతలు, మీడియాకు లడ్డూలాంటి వివాదం కాదు ఏకంగా లడ్డూనే వివాదంగా దొరికింది. అదికూడా అలాంటి ఇలాంటి లడ్డూ కాదు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు చుట్టూనే వివాదం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతో భక్తితో కొలిచే దేవదేవుడు తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాలను వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో చేశారని, జంతువుల కొవ్వు వాడారాని స్వయంగా చంద్రబాబునాయుడు మూడురోజుల క్రితం చేసిన ఆరోపణలతో వివాదం రాజుకుంది.

చంద్రబాబు చేసిన ఆరోపణలకు మద్దతుగాను వ్యతిరేకంగాను పార్టీలు, వ్యక్తులు స్పందిస్తున్నారు. జంతువుల కొవ్వుతో శ్రీవారి ప్రసాదాలు తయారయ్యారన్న ఆరోపణను చాలామంది నమ్మలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. లడ్డూ వివాదానికి మద్దతుగా టీడీపీ మంత్రులు పెద్దగా స్పందించలేదు. అలాగే కూటమిలో కీలకమైన జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెదవి విప్పలేదు. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాత్రం లడ్డూ కల్తీపైన ఘాటుగా స్పందించారు.

ఇక తెలంగాణా బీజేపీ నేతల్లో ఈ వివాదంపై మిశ్రమస్పందన కనబడుతోంది. సీనియర్ నేత, టీటీడీకి ఈవోగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతు చంద్రబాబు ఆరోపణలను తాను నమ్మటంలేదన్నారు. ఎందుకంటే ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసేందుకు అవకాశమే లేదన్నారు. ఏదేమైనా ఆరోపణలు వచ్చాయి కాబట్టి వెంటనే ఈ విషయమై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై తమిళనాడులోని ఎన్టీకే పార్టీ నేత సీమాన్ మాట్లాడుతు చంద్రబాబు ఆరోపణలను కొట్టిపారేశారు. కల్తీ జరిగిన ప్రసాదాలు తిని ఎవరైనా చనిపోయారా ? అంటు ప్రశ్నించారు. శ్రీవారి ప్రసాదాల పేరుతో చంద్రబాబు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారంటు మండిపడ్డారు. దీనికి కౌంటరుగా తెలంగాణా బీజేపీ నేత పొంగులేటి సుధాకరరెడ్డి స్పందించారు. కల్తీ ప్రసాదాలు తిని ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించిన సీమాన్ మానసిక పరిస్ధితి ఏమిటో అర్ధమవుతోందన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండ సంజయ్ మాట్లాడుతు వెంటనే లడ్డూ ప్రసాదం వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివాదంపై సీబీఐతో విచారణ జరిపించి దోషులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలపటం అన్నది తిరుమల శ్రీవారికి జరిగిన పెద్ద అపచారంగా గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ మండిపడ్డారు. అపచారం చేసిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజా వివాదంపై తెలంగాణా ప్రభుత్వం లేదా కాంగ్రెస్ నేతలు పెద్దగా దృష్టి పెట్టలేదు. బహుశా ఇదేదో ఏపీలో చంద్రబాబు-జగన్ మధ్య వివాదంగా చూస్తున్నారేమో. వీళ్ళు కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నేతలు, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభా కరంజ్లాదే, బీజేపీ ఎంపీలు ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు.

నిజానికి చెప్పాలంటే చాలామందికి తిరుమల ప్రసాదాల తయారీలో ఏమి జరిగిందనే విషయం కూడా పూర్తిగా తెలీదు. అయినా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబాబు ఆరోపణ ఆధారంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు స్పందించేస్తున్నారు. మామూలుగానే రాజకీయనేతలు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా పెద్ద వివాదం చేసేస్తారు. వివాదాలు లేకపోతే రాజకీయనేతలకు జనాల్లో ఏమి గుర్తింపుంటుంది ? ప్రచారం ఎలాగొస్తుంది ? ఇదే సమయంలో మీడియాకు కూడా ప్రతిరోజు కొత్త వివాదం కావాలి. ఇపుడు రాజుకుంటున్న లడ్డూ వివాదానికన్నా మరో పెద్ద వివాదం వచ్చేంతవరకు శ్రీవారి లడ్డూ వివాదం రాజకీయపార్టీలకు, మీడియాకు నిజంగానే లడ్డూ లాగ దొరికిందనే చెప్పాలి.

Read More
Next Story