వైఎస్‌ కుటుంబంలో రాజకీయ చదరంగం
x

వైఎస్‌ కుటుంబంలో రాజకీయ చదరంగం

వైఎస్‌ కుటుంబంలో ఎవరికి వారే మధనపడుతున్నారు. తమ బాధను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకిలా?


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో వైఎస్‌ కుటుంబానికి ఉన్న విలువ తెలియంది కాదు. వైఎస్‌ఆర్‌ బతికుండగా అందరూ ఒకే తాటిపై ఉండే వారు. ఏది చేసినా ఉమ్మడి కుటుంబం ద్వారానే జరిగేది. వైఎస్‌ఆర్‌ దుర్మరణం పాలైన తర్వాత వైఎస్‌ కుటుంబంలో రాజకీయ చిత్ర పటమే మారిపోయింది. ముందు కాంగ్రెస్‌ పార్టీపై కుటుంబ సభ్యులంతా పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కనిపించకుండా పోయిన తర్వాత వైఎస్‌ కుటుంబం నుంచి ఒక్కొక్కరుగా విడిపోతూ వచ్చారు. 2019లో వివేకానందరెడ్డి హత్యకు గురైన తర్వాత కుటుంబ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో బేధాభిప్రాయాలు పొడచూపాయి.

వైఎస్‌ఆర్‌ మరణించిన వెంటనే ఆయన భార్య విజయమ్మ రెండు సార్లు పులివెందుల నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. జగన్‌ కొత్త పార్టీని స్థాపించి కాంగ్రెస్‌ పార్టీ స్థానంలో నేను ఉన్నానని భరోసా ఇవ్వగలిగారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ ఆ పదవికి రాజీనామా చేశారు. నా ప్రమేయం లేకుండానే నేను చెప్పినట్లుగా ప్రకటనలు వెలువడటం నాకు ఇష్టం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొ న్నారు. తదనంతర పరిణామాల్లో జగన్‌కు ఆయన చెల్లెలు వైఎస్‌ షర్మిల కూడా దూరమయ్యారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో జగన్‌ చిన్నాన్న హత్య విషయాన్ని పట్టించుకోవడం లేదని, ఎవరైతే హత్యకు సహకరించారో వారినే ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ కాపాడుతున్నారని వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, వైఎస్‌ఆర్‌ కుమార్తె షర్మిల మాట్లాడటం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనాలకు దారి తీసింది.
గుండెల్లోతుల్లో బాధను మాటల రూపంలో
గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తూ మాట్లాడిన మాటలు కుటుంబ సభ్యుల్లోని మనసుల్లో మరింత ఆందోళనకు కారణమయ్యాయి. అవినాష్‌ రెడ్డి జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. అవినాష్‌ ఏ తప్పూ చేయలేదని నాకు నమ్మకముంది. అందుకే కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చానని పులివెందుల నామినేషన్‌ సభలో అన్నారు. అవే కాకుండా పసుపు చీర కట్టుకొని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్‌ వారసులు అంటూ పరోక్షంగా వైఎస్‌ షర్మిల, సునీతలపై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ కుటుంబంపై కుట్రలు చేసిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్‌ సౌభాగ్యమ్మ తన మనసులోని బాధను బయటకు చెప్పేందుకు ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. నీ తండ్రి వైఎస్‌ఆర్‌ చనిపోయినప్పుడు ఎలాంటి బాధను అనుభవించావో, మీ చిన్నాను కోల్పోయిన నీ చెల్లెలు సునీత కూడా అంత కంటే ఎక్కువ బాధను అనుభవించింది. మనో వేదనకు గురైంది. మీ చిన్నాన్న హత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం ఏమిటని ఆ లేఖలో జగన్‌ని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడే చెల్లెళ్లను హేళనగా మాట్లాడుతుంటే తనకు బాధగా ఉందనే భావనను స్పురించేలా లేఖలో ఆమె చెప్పారు. నీ పత్రిక, చానల్‌లో కూడా హత్యను వక్రీకరించి చెప్పడం చెల్లెళ్ల గురించి మరొకరు ఇష్టాను సారంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా నా మనసును మరింతగా బాధపెడుతుందనేది ఆమె లేఖలోని మరో అంశం. హత్యకు కారకులైన వారికి టికెట్‌ ఇవ్వడం బాధగా ఉందని, న్యాయం, ధర్మం వైపు నిలబడాలని వేడుకొంటున్నానని ఆమె లేఖలో కోరడం విశేషం.
దుమారం రేపుతున్న మాటలు
రాజకీయ క్షేత్రంలో అన్నా చెల్లెళ్ల మాటల తూటాలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ చెల్లెలు షర్మిలపై కానీ సునీతపై కానీ నేరుగా విమర్శలు గుప్పించకుండా తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీలు వీళ్లను రాజకీయ పావులుగా వాడుకుంటున్నాయని తన ఎన్నికల ప్రసంగాల్లో చెబుతున్నారు. అయితే షర్మిల కానీ సునీత కానీ ముఖ్యమంత్రే తప్పు చేశారని, మా అన్నే మా నాన్న హత్యకు బాధ్యత వహించాలని నేరుగానే మాట్లాడుతున్నారు. ఈ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తమ గుండెల్లోతుల్లో నుంచి పుటుకొస్తున్న ఆవేదన అని రాజకీయ పరిశీలకుల్లో కొందరు వ్యాఖ్యానిస్తుండగా అధికారం కోసం జరిగే పోరాటంలో ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు అప్పుడప్పుడూ ఉంటాయని పరిశీలకుల్లోని మరి కొందరు వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
తన బిడ్డ ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోర్కెను నెరవేర్చే విధంగా తగిన ఆశీర్వాదాలు ఇవ్వాలని వైఎస్‌ విజయమ్మ కోరుకుంటోంది. కడప పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌ అభిమానులు నాకు అండగా నిలవాలని షర్మిల కోరుతోంది. నా తండ్రిని హత్య చేసిన హంతకులను శిక్షించడంలో మా అన్న జగన్‌ ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలని సునీత కోరుతోంది. చిన్నాన్నను చంపిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నావంటూ ఆవేదనతో ప్రశ్నిస్తోంది జగన్‌ చిన్నమ్మ సౌభాగ్యమ్మ. ఇవన్నీ చూస్తుంటే కుటుంబ సభ్యుల్లోనే ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవడం, బాధపడటం చూస్తుంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజమేనని ఓటర్లు తేలిగ్గా తీసుకుంటారా? వైఎస్‌ కుటుంబంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే అంశాన్ని తీవ్ర పరిగణలోకి తీసుకుంటారా అనే వేచి చూడాల్సిందే.
Read More
Next Story