గిరిజనులను విద్యకు దూరం చేస్తున్న విధానాలు!
x

గిరిజనులను విద్యకు దూరం చేస్తున్న విధానాలు!

సమాజానికి దూరంగా ఉన్న గిరిజనులను అక్షరాస్యులను చేసి ఆధునిక సమాజంలో కలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం.


ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల చదువులు ముందుకు సాగటం లేదు. వీరి చదువుల కోసం గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ విద్యాలయాలు, గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం ఇన్ని విధాల విద్యాలయాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ విధానాల కారణంగా గిరిజనుల పిల్లలకు సరిగా చదువులు అబ్బటం లేదు. ప్రభుత్వ గిరిజన స్కూళ్లలో ఐదో తరగతి పాసైన విద్యార్థికి ఓనమాలు రావడం లేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజంగా వారికి చదువులు రావడం లేదు. ఇందుకు ఉపాధ్యాయులు ప్రధాన కారణమైతే, ఆ స్కూళ్లలో నియమించే ఉపాధ్యాయులు గిరిజనులే కావడం కూడా ఒక కారణం. స్కూలు సమయంలోనూ ప్రభుత్వ గిరిజన పాఠశాలలో లేకుండా ఎక్కడో కల్లు దుకాణంలో ఉపాధ్యాయులు తేలుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలో పిల్లలకు అక్షరం ముక్క కూడా రావడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలు చెట్లు, పుట్టలు పట్టుకుని తిరుగుతున్నారు.

ఆశ్రమ పాఠశాలల్లోనూ అవే పరిస్థితులు..
ప్రభుత్వ గిరిజన విద్యాలయాలు సరిగా పనిచేయడం లేదని ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ స్కూళ్లు కూడా అలాగే తయారయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో గిరిజన ఆశ్రమ స్కూళ్లు 371 ఉన్నాయి. ఇదులో వేలల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆశ్ర స్కూళ్లు అంటే ఒక విధంగా గురుకుల విద్యను పోలి ఉంటుంది. రాత్రులు అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఉండకుండా ఇంటికి వెళతారు. పగలు స్కూలు సమయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు స్కూళ్లో ఉంటారు. అక్కడే భోజనం ఉంటుంది. టీచర్లు కూడా అక్కడే ఉండాలి. స్టడీ అవర్స్‌ కూడా ఉంటాయి. కానీ ఆశ్రమ స్కూళ్లకు కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. దాదాపు 80 శాతం స్కూళ్లకు కనీసం కాంపౌండ్‌ గోడలు కూడా లేవు. నాడు–నేడు ప్రోగ్రాం ద్వారా గత ప్రభుత్వం కొన్ని స్కూళ్లకు కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మించినా మిగిలిన కొన్ని స్కూళ్లకు లేవు. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదువుకోవచ్చు. ఉపాధ్యాయులు స్కూళ్లలో తప్పకుండా ఉండి పాఠాలు చెప్పటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పిల్లలు సరిగా రాకుంటే వారిని స్కూలుకు పిలిపించుకుని మంచిగా భోజనం పెట్టి అక్షరాలు నేర్పించాలి. ఆ తరువాత వారు నేగా గురుకుల స్కూళ్లలో చేరేందుకు వీలు ఉంటుంది. అయితే 30 శాతం విద్యార్థులు కూడా ఈ స్కూళ్ల నుంచి గురుకులాలకు రావడం లేదని పలువురు ఉపాధ్యాయులే చెబుతున్నారు.
ఇక గురుకుల విద్యకు సంబంధించి ఎంతో ఓర్పుతో ఉపాధ్యాయులు పిల్లల వద్ద కూర్చుని నేర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఒకటో తరగతి నుంచి 11 వ తరగతి వరకు విద్యనభ్యసిస్తారు. వేరు వేరు పేర్లు ఈ స్కూళ్లకు పెట్టినా మొత్తం 199 గిరిజన గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఈ స్కూళ్లు, కాలేజీల్లో మొత్తం విద్యార్థులు 51,040 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో 10 శాతం కూడా ఐఐటీ వంటి సంస్థల్లో సీట్లు సాధించలేకపోతున్నారు. ఇందుకు ప్రభుత్వం తీసుకునే విధానాలే కారణమని గిరిజనులు పలువురు చెబుతున్నారు. మంచి భోజనం పెడుతున్నాము. చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. అయినా చదువులో ముందుకు అనుకున్న స్థాయిలో అడుగులు వేయలేకపోతున్నారని ఉపాధ్యాయులే చెప్పటం విశేషం.
గురుకులాల్లోనూ ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులా!
రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో 1,656 మంది ఔట్‌ సోర్సింగ్‌ టీచర్లు ఉన్నారు. వీరికి కన్సాలిడేటెడ్‌ పేమెంట్స్‌ ప్రభుత్వం ఇస్తోంది. ఒక్కో ఉపాధ్యాయునికి రూ. 10,500 నుంచి 18,000 వరకు ఇస్తోంది. ఇదే రెగ్యులర్‌ ఉపాధ్యాయులు అయితే రూ. 70వేల నుంచి లక్షపైన జీతాలు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి తాము ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నామని, తమకు అవకాశం కల్పించి రెగ్యులర్‌ చేసే ప్రతిపాదన మానేసి ప్రస్తుతం నిర్వహించబోయే డిఎస్సీలో తమ పోస్టులు కూడా ఖాళీ కింద చూపించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమలో కొంత మందికి 40ఏళ్లు దాటాయని, ఇంకా కొంత మంది రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నారని అంతటి వయసు ఉన్న తమను కాదని, పోస్టులు ఎలా ఖాళీ చూపించి తమను ఏమి చేయాలనుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
15 రోజులుగా నిరాహార దీక్షలు
తమకు తమ తోటి ఉపాధ్యాయులతో సమానంగా జీతాలు ఇవ్వాలని, తమను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, డీఎస్సీలో తమ పోస్టులు ఖాళీలుగా చూపించటాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు సుమారు 1,500 మంది సమ్మెకు దిగారు. రాష్ట్రంలోని ఐటీడీఏల ముందు, విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద నిరసన దీక్షలు చేస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు విద్యాశాఖ మంత్రి ఒక అధికారిని రాయభారం పంపించి నాలుగు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్‌ చెప్పారని, మీరు దీక్షలు విరమించాలని కోరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వారి వద్దకు రాలేదు. ఏ విషయం చెప్పలేదు. తిరిగి శుక్రవారం సమ్మెచేస్తున్న వారి స్థానాల్లో గిరిజన ఆశ్రమ స్కూళ్లలో పనిచేస్తున్న 550 మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించారు. ఈ నియామకాలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఆశ్రమ స్కూళ్లలో చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. టీచర్లు కూడా పూర్తిస్థాయిలో లేరు. అయితే అవేమీ పట్టించుకోకుండా అక్కడి వారిని డిప్యుటేషన్‌లపై ఎక్కడంటే అక్కడ నియమించడంతో వారు తట్టా బుట్టా సర్థుకుని గురుకులాల వద్దకు వస్తున్నారు. ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈ డిప్యుటేషన్‌లు ఎప్పుడు క్యాన్సిల్‌ అవుతాయో తెలియదు. కుటుంబాన్ని వదిలి పెట్టి గురుకులాలకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటాన్ని పలువురు ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు.
గిరిజన గురుకులాల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే...
గిరిజన గురుకుల స్కూల్స్‌ 5 నుంచి 10వ తరగతి వరకు 28 ఉన్నాయి. ఈ స్కూల్స్‌లో 7467 మంది బాలురు, 4,622 మంది బాలికలు కలిపి 12,089 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. పీటీజీ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ (ప్రిమిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌)లో మూడు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. మొత్తం ఈ రకం స్కూల్స్‌ పది ఉన్నాయి. ఈ స్కూళ్లలో 4,039 మంది బాలురు, 904 మంది బాలికలు చదువుతున్నారు. అంటే మొత్తం 4,933 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజీలు 29 ఉన్నాయి. ఈ కాలేజీల్లో కేవలం ఇంటర్‌ మీడియట్‌ వారు మాత్రమే చదువుతున్నారు. బాలురు 4,502 మంది కాగా, బాలికలు 3,497 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 7,999 మంది ఇంటర్‌ చదువుతున్నారు. ఇవి కాకుండా అప్‌ గ్రేడెడ్‌ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కాలేజీలు 4 ఉన్నాయి. ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతారు. బాలురు 525 మంది కాగా బాలికలు 2,012 మంది ఉన్నారు. మొత్తం 2,537 మంది ఉన్నారు.
స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కింద 4 స్కూల్స్‌ ఉన్నాయి. ఇందులో 8 నుంచి ఇంటర్‌ మీడియట్‌ వరకు విద్యార్థులు చదువుతున్నారు. బాలురు 600 మంది కాగా బాలికలు 565 మంది ఉన్నారు. మొత్తం 1,165 మంది బాల బాలికలు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక కాలేజ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు మూడు ఉన్నాయి. ఇందలో ఇందులో బాలురకు ఒకటి, బాలికలకు రెండు ఉన్నాయి. కేవలం ఇంటర్‌మీడియట్‌ విద్యను మాత్రమే ఈ కాలేజీల్లో బోధిస్తారు. 152 మంది బాలురు, 287 మంది బాలికలు కలిపి 439 మంది విద్యనభ్యశిస్తున్నారు. ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ స్కూల్స్‌ నుంచి, హాస్టల్స్‌ నుంచి కన్వర్షన్‌ ద్వారా ఏర్పటు చేసిన స్కూళ్లు 81 ఉన్నాయి. ఈ స్కూళ్లలో 3 నుంచి 6వ తరగతి వరకు ఉన్నారు. బాలురకు 50, బాలికలకు 31 ఏర్పాటు చేశారు. ఇందులో 9,465 మంది బాలురు, 6,256 మంది బాలికలు కలిసి మొత్తం 15,721 మంది విద్యభ్యాసం చేస్తున్నారు. మినీ గురుకులాలు 12 ఉన్నాయి. ఈ గురుకులాల్లో ఒకటి నుంచి 5వ తరగతి, 8వ తరగతి బోధిస్తారు. మొత్తం 2493 మంది విద్యర్థినీ విద్యార్థులకు వేరు వేరుగా క్లాసులు, వసతి ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ (ఈఎంఆర్‌ఎస్‌) 19 ఉన్నాయి. ఈ స్కూల్స్‌లో 6 నుంచి ఇంటర్‌ వరకు బోధిస్తారు. ఇక్కడ మాత్రం కో ఎడ్యుకేషన్‌ ఉంటుంది. మొత్తం 3,603 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇవన్నీ గురుకుల విద్యకు సంబంధించిన స్కూళ్లు. ప్రస్తుతం ఈ స్కూళ్ళలో ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
పది మంది ఐఏఎస్‌లు
గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి 10 మంది ఐఏఎస్‌లు పనిచేస్తున్నారు. శ్రీశైలం, నెల్లరూ మినహా మిగిలిన ఐటీడీఏల్లో ఐఏఎస్‌లు పీవోలుగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థకు కూడా ఐఏఎస్‌ను ప్రభుత్వం నియమించింది. ఏ శాఖకూ లేని విధంగా ఇంత మంది ఐఏఎస్‌లు ఉన్నా గిరిజన పిల్లలకు సరైన విద్యను అందించడంలో వెనుకబడటానికి కారణాలు ప్రభుత్వం వివరించాల్సి ఉంది.
Read More
Next Story