ఈ ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్, మీరెక్కడైనా చూశారా?
x

ఈ ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్, మీరెక్కడైనా చూశారా?

ఇద్దరు బాలికలను తెలిసిన వ్యక్తే తీసుకుని వెళ్ళాడు.. ఆచూకీ తెలిసినవారు తెలియపరచగలరని పోలీసలు కోరుతున్నారు.


ఎవరీ అమ్మాయిలు?

ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందిన ఒక ఆమె తన భర్తతో విడిపోయి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి గత 8 సంవత్సరాలుగా ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నది. కుమార్తెలు 1) మేడువలెం సరోజినీ, వయస్సు: 15 సం.లు, 2) మేడువలెం పూర్ణిమ, వయస్సు: 14 సం.లు కాకినాడలో చదువుకుంటూ అక్కడే ఒక హాస్టల్ లో ఉంటున్నారు. ఈ సంవత్సరం మే నెలలో సెలవుల కారణంగా ధవళేశ్వరం గ్రామంలో తల్లి ఇంటి వద్దకు వచ్చి ఉంటున్నారు. మూడు నెలల క్రితం మారోజు వెంకటేష్ అను వ్యక్తి రైల్వేలో T.C. గా పనిచేస్తున్నాను అని చెప్పి వీరు ఉంటున్న ఇంటి పై పోర్షనులో అద్దెకు దిగి నాడు అతనితో పాటు ఒక 17 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆమెను తన చెల్లి అని చెప్పేవాడు. ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉంటూ, ఆ ఇద్దరు పిల్లలను మచ్చిక చేసుకుని, వారి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాడు. పిల్లల తల్లిని అక్క అని పిలిచేవాడు. ఆమెను, ఆమె పిల్లలను, అలాగే పక్క పోర్షన్ లో నివాసం ఉండే మరొక ఇద్దరు పిల్లలను తీసుకుని, జూన్ నెలలో అరకు వెళ్లి మూడు రోజులు ఉండి వచ్చారు. అలాగే తిరుపతి వెళ్లి మూడు రోజులు ఉండి, విజయవాడ గుడికి వెళ్లి వచ్చారు. రాజమండ్రి లో షాపింగ్ మాల్ లకు, గోదావరి ఘాట్ లకు, హోటల్ లకు వారిని తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా వారి కుటుంబం తో బాగా సన్నిహితంగా మెలిగాడు.

ఎలా మిస్సయ్యారు?
తల్లికి రైల్వే లో ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి ఆమెను విజయవాడ తీసుకుని వెళ్ళి, 29-07-2024 తేదీకి ముందు రెండు వారాలుగా ఆమెను విజయవాడ లోనే ఉంచాడు. పిల్లవాడిని ఆమె దగ్గరకు చేర్చాడు. ఆమె కుమార్తెలు ఇద్దరినీ హాస్టల్ లో దించుతాను అని చెప్పి జూలై నెల 21 వ తేదిన ధవళేశ్వరం గ్రామం వచ్చాడు. ఇద్దరు పిల్లలను తల్లితో ఫోన్లో మాట్లాడించి హాస్టల్ కి వెళ్తున్నాము అని చెప్పి 22 వ తేదిన ఇద్దరు పిల్లలను తీసుకునివెళ్ళాడు. ఆ తర్వాత కూడా తాను ఒక్కడే విజయవాడ వెళ్లి ఆమెను కలిసి వచ్చాడు. 28వ తేది నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా, తల్లికి అనుమానం వచ్చి, 29.07.2024 వ తేదీన ధవళేశ్వరం తిరిగి వచ్చి, హాస్టల్ వారితో మాట్లాడగా, తన పిల్లలు హాస్టల్ చేరుకోలేదు అని తెలిసింది. దానితో 30-07-2024వ తేదిన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వగా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది.
పోలీసుల దర్యాప్తు
బాలికల మిస్సింగ్ విషయం తెలిసుకున్న జిల్లా యస్.పి. శ్రీ డి. నరసింహ కిషోర్ గారు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుని త్వరితగతిన వారిని కనిపెట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యస్.పి. గారి ఆదేశాలు ప్రకారం, నాలుగు ప్రత్యేక బృందాలు, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు (విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, హైదరాబాదు మరియు విజయనగరం జిల్లా) పంపడం జరిగింది. అదేవిధంగా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం పరిసర ప్రాంతాలలో మూడు బృందాలతో ఎంక్వయిరీ చేయడం జరిగింది. 22 వ తేదీ తర్వాత రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో ఒకరోజు, ఆ తర్వాత నెల్లూరులో ఒక హోటల్లో ఒకరోజు పైగా ఆ పిల్లలు మరియు మారోజు వెంకటేష్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. 28-07-2024 తేదీ ఉదయం సమయంలో తమతో పాటు ఉన్నటువంటి చెల్లి అని చెప్పబడుతున్న బాలికను రాజమహేంద్రవరం బస్టాండ్ లో విశాఖపట్నం వెళ్లే బస్సు ఎక్కించి ఆమెను విజయనగరంలోని తన ఇంటికి వెళ్లి పొమ్మని పంపించి వేశాడు. 28-07-2024 వ తేదీ సాయంత్రం 7 గంటల తర్వాత నుండి గుంటూరు ప్రాంతంలో అతని ఫోను స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది.

దర్యాప్తులోని అంశాల ప్రకారం ఈ కేసును కిడ్నాప్ కేసుగా నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు లోని పురోగతి ఎప్పటికప్పుడు ఆమె తల్లికి తెలియపరుస్తూ ఉండడం జరిగింది. ఆమె కూడా తరచుగా పోలీస్ స్టేషన్కు వచ్చి కనుక్కొని వెళుతూ ఉంది.

జిల్లా ఎస్పీ గారి యొక్క దిశా నిర్దేశాల ప్రకారం రాజమహేంద్రవరం సౌత్ జోన్ డి.యస్.పి. M. అంబికా ప్రసాద్ పర్యవేక్షణలో ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ G.V.V. వినయ్ మోహన్, SI హరికృష్ణ బృందం ఈ కేసు దర్యాప్తు చేస్తుంది.

నిందితుడు మారోజు వెంకటేష్ మరియు ఇద్దరు బాలికల ఫోటోలను ఈ మెసేజ్ తో పాటు జత పరచడం జరిగింది. వారి ఆచూకీ తెలిసిన వారు ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నెంబర్ : 9440796586, రాజమహేంద్రవరం సౌత్ జోన్ డి.యస్.పి. నెంబర్ : 9490760791 లకు సమాచారం ఇవ్వవలిసిందిగా రాజమహేంద్రవరం డి.యస్.పి, సౌత్ జోన్, M. అంబికా ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.


Read More
Next Story