ఆధారాల ధ్వంసానికి కుట్ర.. ముంబై నటి కాదంబరి చెప్పిన విస్తుబోయే అంశాలు..
ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు ఊహకందని మలుపులు తిరుగుతోంది. తాజాగా తన కేసుకు సంబంధించిన సంచలన విషయాలను ఆమె బయటపెట్టారు.
ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు ఊహకందని మలుపులు తిరుగుతోంది. తాజాగా తన కేసుకు సంబంధించిన సంచలన విషయాలను ఆమె బయటపెట్టారు. ఇన్నాళ్లూ ఈ కేసుకు సంబంధించి ప్రచారంలో ఉన్న అనేక విషయాలు వాస్తవమేనని.. జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌ను కాపాడుకోవడానికే తనను వైసీపీ నేతలు, కొందరు పోలీసులు వేధించారని ఆమె కుండబద్దలు కొట్టారు. జిందాల్‌పై తాను ఫైల్ చేసిన అత్యాచార కేసును వెనక్కు తీసుకోవాలన్నదే వారి మెయిన్ డిమాండ్‌గా ఉందని, దాని కోసమే తనను, తన కుటుంబాన్ని తీవ్రాతి తీవ్రంగా వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసును కూడా బనాయించారని, ఈ కేసు పేరుతో జిందాల్‌కు వ్యతిరేకంగా తన దగ్గర ఉన్న సాంకేతిక సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారని చెప్పారామే. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా తాతాలపై ఫిర్యాదు చేసిన అనంతరం దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె సంచలన విషయాలు బహిర్గతం చేశారు. జిందాల్‌పై పెట్టిన అత్యాచార కేసును వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేకుంటే తనపై మరిన్ని కేసులు పెడతామని విజయవాడ పోలీసులు తనను బెదిరించారని ఆమె తన వెల్లడించింది.
అందరినీ బెదిరించారు..
‘‘ఫిబ్రవరి 10-14 తేదీల మధ్య నా కస్టడీ సమయంలో నాపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. జిందాల్‌పై కేసును వెంటనే ఉపసంహరించుకుకోవాలని బెదిరించారు. ఆఖరికి నా ఫోన్‌లోని నెంబర్లన్నింటికి కాల్ చేసి.. జిందాల్‌పై పెట్టిన కేసు వెనక్కు తీసుకునేలా జెత్వానీనిని ఒప్పించాలని, ఒప్పుకోని వేళ మీమీ రాష్ట్రాల్లో జెత్వానిపై కేసులు పెట్టండని బెదిరించారు. ఆఖరికి ఓ న్యాయవాదితో కూడా ఇదే విషయం చెప్పించారు. ఫిబ్రవరి 3న నేను.. మా అమ్మతో కలిసి కారులో వెళ్తుండగా కొందరు వ్యక్తులు మా కారును వారి కార్లతో అడ్డగించారు. మమ్మల్ని కిడ్నాప్ చేసి.. మా ఫోన్లు, ఐపాడ్‌లు అన్నీ లాగేసుకున్నారు. వాళ్లెవరో కూడా మాకు తెలియలేదు. అప్పటికి జిందాల్‌పై నేను పెట్టిన అత్యాచారం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఆ కేసు విచారణను అడ్డుకోవడానికే నన్ను కిడ్నాప్ చేసి ఉంటారని అనుకున్నా. అదే రోజు సాయంత్రం మరో టీమ్.. మా ఫ్లాట్‌కు వెళ్లి మా నాన్నను కూడా కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌తో ముంబైలోని కోర్టులో హాజరుపరిచడానికి తీసుకెళ్లారు. అప్పుడు మాకు అర్థమైంది.. వాళ్లంతా కిడ్నాపర్లు కాదు పోలీసులు అని. అప్పటికి కూడా వాళ్లు ఏ రాష్ట్రం పోలీసులు, ఏ స్టేషన్‌కు చెందిన వారు? మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఇలాంటి వివరాలేమీ మాకు తెలియదు. ట్రాన్సిట్ వారెంట్‌తో మమ్మల్ని ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి తీవ్రంగా వేధించారు. జిందాల్ కేసుకు సంబంధించి నా దగ్గర ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారు ఎంత ఒత్తిడి చేసినా వారికి నేను వాటిని అందించలేదు’’ అని ఆమె చెప్పారు.
హోటల్‌లో కూడా నిఘా
‘‘విజయవాడ జైలు నుంచి విడుదలయ్యాయ.. బెయిల్ షరతుల మేరకు ఇబ్రహీంపట్నంలోనే ఉండాల్సి వచ్చింది. దాంతో అక్కడే నోవా రెసిడెన్సీలో రూమ్స్ తీసుకున్ని ఉన్నాం. అక్కడ ఉన్నామని తెలియడంతో ఇన్‌స్పెక్టర్ సత్యానారాయణ, కొందరు పోలీసులు కలిసి మేము ఉంటున్న హోటల్‌పై రైడ్ చేశారు. మేము అక్కడ ఉన్నంత కాలం మాపై నిఘా ఉంచారు. ఆ తర్వాత శాంపిల్ సిగ్నేచర్ ఇవ్వడానికి మే 29న విజయవాడకు వచ్చాను. అప్పుడు కూడా కొందరు పోలీసులు మాట్లాడుతూ.. ‘‘నిన్ను ఏ క్షణంలో అయినా ఎవరైనా తీసుకెళ్లే అవకాశం ఉంది. జాగ్రత్త’’ అని హెచ్చరించారు. క్షణం క్షణం నన్ను వెంటాడి వేధించారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.