చేతులో డబ్బుల్లేవు. పని చేయించుకున్న వ్యక్తి కూలీ ఇవ్వలేదు. సొంత గూటికి చేరుకోవాలని అనుకున్నారు. డబ్బుల్లేక పోవడంతో బస్సుల్లో ప్రయాణించే అవకాశం లేదు. భార్య నాలుగు నెలల గర్భిణీ. అయినా ధైర్యం చేశారు. కాలినడకనే ప్రయాణం సాగించారు. రోడ్డు మార్గం వారికి తెలియక పోవడంతో కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ వ్యక్తిని దారి అడిగారు. అతను ఓ దారి చూపించాడు. ఆ దారి గుండా నడక సాగించారు. నడిచే కొద్ది అడవే వస్తోంది.. కానీ ఊరు రావడం లేదు. అలా రాత్రంతా ఆ అడవిలో తిరుగుతూనే ఉన్నారు. తర్వాత తెలిసింది వారికి దారి తప్పి పోయామని. తర్వాత రోజు 100కి డయిల్ చేశారు. ఎక్కడ ఉన్నారో పోలీసులకు కూడా చెప్పలేక పోయారు. చివరికి బాధితుల ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారు ఉన్న చోటుకు పోలీసులు వెళ్లి కాపాడి బయటకు తీసుకొచ్చి.. వారి సొంతూరుకు పంపించారు. పని చేయించుకున్న వాడు కూలీ డబ్బులు ఇవ్వని కారణంగా ఆ పేద జంట నరకం అనుభవించారు. ఈ అమానవీయ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీనువెంకట్, అతని భార్య ధనలక్ష్మి దంపతులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి చెందిన కొడమంచిలికి చెందిన వారు. భార్య ధనలక్ష్మి నాలుగు నెలల గర్భిణీ. బతుకుదెరువు కోసం చేపలు పట్టే కూలీకి పల్నాడు జిల్లాకు వెళ్లారు. ఏప్రిల్ 19న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బంగారుపెండ తండాకు వెల్లారు. అక్కడ శైలేష్ అనే వ్యక్తి వద్ద చేపలు పట్టే పని చేశారు. తిరిగి తమ సొంతూరు వెళ్లాలని ఆశ పడ్డారు. చేసిన పనికి కూలీ ఇవ్వమని శైలేష్‌ను అడిగారు. కానీ అతను కూలీ డబ్బులు ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లికి చేరుకోవాలని ఆశపడ్డారు. చేతిలో డబ్బులు లేని కారణంగా కాలినడకనే వెళ్తామని నిర్ణయించుకున్నారు. భార్య నాలుగు నెలల గర్భిణీ అయినా ధైర్యం చేశారు. నడక సాగించారు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు మార్గం తెలియని ఆ జంట తమ ఊరుకు ఎలా వెళ్లాలని ఒక వ్యక్తిని అడిగారు. అతను అడవి దారి చూపించాడు. అతను చూపించిన దారిలోనే వెళ్లింది ఆ జంట. ఈ క్రమంలో చీకటి పడింది. దారి తప్పి పోయారు. దీంతో రాత్రంతా ఆ అటవీ ప్రాంతంలోనే తిరుగుతూనే ఉన్నారు. కృష్టా నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలోనే తిరుగాడుతూనే ఉన్నారు.
శుక్రవారం ఉదయం బయలుదేరిన ఆ నిరుపదే జంట శనివారం ఉదయం వరకు దారి తెలియక కాలినడకన ఆ అటవీ ప్రాంతమంతా తిరుగుతూనే ఉన్నారు. చివరకు శనివారం ఉదయం 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు తమ సమస్యను వివరించారు. అయితే తాము ఎక్కడున్నమనే వివరాలు పోలీసులకు చెప్పలేక పోయారు. దీంతో బాధితుల ఫోన్ సిగ్నల్ ప్రకారం వారున్న చోటుకు చేరుకున్నారు. పోలీసుల ముందు ఆ జంట కన్నీరు పెట్టుకుంది. కొత్తపుల్లారెడ్డిగూడెంకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు. వారి విరాలను తెలుసుకొని బస్సులో వారి స్వగ్రామానికి చేర్చారు.