రోడ్డు మార్గంలో నో పర్మిషన్ ..హెలీకాప్టర్ ఓకే
x

రోడ్డు మార్గంలో నో పర్మిషన్ ..హెలీకాప్టర్ ఓకే

జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసుల ఆంక్షలు


వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ ప్రయాణించే మార్గం విషయంలో కీలక సూచనలు చేశారు. ప్రజాభద్రత, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించారు. కేవలం హెలికాప్టర్‌లో మాత్రమే పర్యటనకు రావాలని స్పష్టం చేశారు.

జగన్ ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెంలో పర్యటిస్తారు.అందుకోసం వైసీపీ పూర్తి ఏర్పాట్లు చేసుకుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకు సుమారు 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు వైసీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు. అయితే అందుకు జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

జగన్ రోడ్డు ప్రయాణ మార్గంలోని ప్రధాన కూడళ్ల వద్ద భారీగా జనసమీకరణ చేసి, ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిందని, అలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.అందుకే జగన్ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి నిరాకరించామన్నారు. అయితే తాను వెళ్లాల్సిన ప్రాంతానికి నేరుగా హెలీకాప్టర్ లో వెళ్లవచ్చని తెలిపారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూసే బాధ్యత తమపై ఉందని ఎస్పీ పేర్కొన్నారు.
Read More
Next Story