’పోలీసులా..రౌడీలా‘? తెనాలి ఘటనపై ఫైరైన జాతీయ ఎస్సీ కమిషన్
x

’పోలీసులా..రౌడీలా‘? తెనాలి ఘటనపై ఫైరైన జాతీయ ఎస్సీ కమిషన్

తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ ఆందోళన వ్యక్తం చేశారు.


భారత దేశంలోనే మరే ఇతర ప్రాంతంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో దళితుల పట్ల పోలీసు వ్యవస్థ అమానుషంగా వ్యవహరిస్తోందని, పోలీసులా?, రౌడీలా? అని మండిపడ్డారు. మచ్చుకు కొన్ని సంఘటనల గురించి ఆయన ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే..

పోలీసుల తీరుపై ఆగ్రహం: పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో ఒక దళితుడిని పోలీసులు రౌడీల్లా పాశవికంగా కొట్టడాన్ని ఆయన ఖండించారు. ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించారు.
అమరావతి భూముల వివాదం: అమరావతిలో దళితులకు కేటాయించిన డీకే పట్టా భూములను భూముల రేట్లు పెరిగాయనే సాకుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటి వరకు 35 ఎకరాల భూమిని తీసుకున్నారని, దీనిపై 85 ఫిర్యాదులు వచ్చాయని ఆయన వెల్లడించారు. బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కోదాడ లాకప్ డెత్: తెలంగాణలోని కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై ఆయన స్పందిస్తూ, కేవలం సీఐ సస్పెన్షన్‌తో సరిపెట్టకూడదని, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దళితులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, జాతీయ ఎస్సీ కమిషన్ ఈ అంశాలను తీవ్రంగా పరిగణిస్తోందని రామచందర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
Read More
Next Story