రేవంత్ నివాసం ముందు మాజీ ఎమ్మెల్యేకి అవమానం
x

రేవంత్ నివాసం ముందు మాజీ ఎమ్మెల్యేకి అవమానం

ఎర్రటి ఎండలో మాజీ ఎంఎల్ఏ గుమ్మడినర్సయ్యను నిలబెట్టిన పోలీసులు


గుమ్మడి నర్సయ్య...ఈ పేరుకు కొత్తగా పరిచయం అవసరంలేదు. తెలంగాణ రాజకీయాల్లో గుమ్మడి నర్సయ్య అంటే బాగా పాపులర్. ఎలాగంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District)లోని ఇల్లెందు నియోజకవర్గం(Illendu segment) నుండి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. సీపీఐఎంఎల్ నుండి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన ఏకైక ఎంఎల్ఏ గుమ్మడి నర్సయ్యే(Gummadi Narsaiah). వయసు మీదపడటంతో ఇపుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇపుడు ఈయన ప్రస్తావన ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth)ని కలిసి తన నియోజకవర్గంలోని సమస్యలను మాట్లాడుదామని ప్రయత్నం చేస్తున్నారు నర్సయ్య. నాలుగురోజుల నుండి ప్రయత్నంచేస్తున్నా ఒక్కసారి కూడా సీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు.

రేవంత్ బిజీగా ఉన్నారు కాబట్టి అపాయిట్మెంట్ దొరకలేదనే అనుకుందాం. నర్సయ్య ప్రతిరోజు బంజారాహిల్స్ లోని సీఎం ఇంటికి వెళుతునే ఉన్నారు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు నర్సయ్యను రోడ్డుపైనే నిలిపేస్తున్నారు. కనీసం ఇంట్లోని విజిటర్స్ కూర్చునే ప్రాంతంలోకి కూడా వెళ్ళనీయటంలేదు. దాంతో నర్సయ్య రోడ్డుపక్కనే పేవ్మెంట్ పైన ఎర్రటి ఎండలో నిలబడుతున్నారు. ఇపుడున్న ఎండలకు మామూలు జనాలు ఎండలో నడవటమే కష్టం. అలాంటిది వయసు అయిపోయిన పైగా అనారోగ్యంతో ఉన్న మాజీ ఎంఎల్ఏని ఎర్రటి ఎండలో నాలుగురోజులుగా పోలీసులు నిలబెట్టేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఐదుసార్లు ఎంఎల్ఏగా పనిచేసిన గుమ్మడి నర్సయ్య విషయంలో ప్రోటోకాల్ పాటించాలని కూడా పోలీసు అధికారులకు తెలియకపోవటమే విచిత్రంగా ఉంది.

తెలిసిన రాజకీయ నేతలతో, అధికారులతో నర్సయ్య సీఎం అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తునే ఉన్నారు. ఫోన్లో మాట్లాడినపుడు సీఎం ఇంటికి రమ్మని చెబుతున్నారు కాబట్టి మాజీ ఎంఎల్ఏ వెళుతున్నారు. మాజీ ఎంఎల్ఏని రమ్మని చెప్పిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవటంలేదు. దాంతో ఎర్రటిఎండలోనే గుమ్మడినర్సయ్య గంటలకొద్దీ నిలబడాల్సొస్తోంది. చివరకు ఓపికలేక రేవంత్ ను కలవటం అనవసరమని మాజీ ఎంఎల్ఏ డిసైడ్ అయినట్లున్నారు.

Read More
Next Story