నా తల్లిని పోలీసులు బెదిరిస్తున్నారు:పైలా దిలీప్‌
x

నా తల్లిని పోలీసులు బెదిరిస్తున్నారు:పైలా దిలీప్‌

సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసు.


ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఏ30 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పైలా దిలీప్‌ పోలీసులపై కీలక ఆరోపణలు చేశారు. తన తల్లిని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా లిక్కర్‌ స్కామ్‌లో వచ్చిన ముడుపులను తాము నివాసం ఉంటున్న ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన్నట్లు ఒప్పుకోవాలని తనపైన, తన కుటుంబంపై ఒత్తిడి చేస్తున్నారు.

అంతేకాకుండా తనపైన, తన కుటుంబంపైన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తన కుటుంబాన్ని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని పైలా దీలీప్‌ ఆరోపించారు. పైలా దిలీప్‌ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించాడు. తనపైన, తన కుటుంబంపైన పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని పిటీషన్‌ దాఖలు చేశాడు. పైలా దిలీప్‌ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై ఏసీబీ కోర్టు స్పందించింది. దీనిపైన విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 3కు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు కలకలం రేపుతోంది. రూ. 3500 కోట్లు అక్రమాలు జరిగాయని తెరపైకి వచ్చిన ఈ లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్టు చేసిన సిట్‌ అధికారులు పలువురిని విచారించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మాజీ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవను కూడా విచారించారు. సిట్టింగ్‌ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, మరో మాజీ అధికారి కృష్ణన్‌మోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పతో పాటు 12 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను అటాచ్‌ చేయాలని సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు పిటీషన్‌ను దాఖలు చేసింది. దీనిపైన స్పందించిన ఏసీబీ కోర్టు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని 11 మంది నిందితులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిస్టలరీ సంస్థల డైరెక్టర్లు, బ్యాంకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కీలక నిందితుడిగా ఉన్న రాజ్‌ కసిరెడ్డి, బూనేటి చాణక్య, కాశీచయనుల శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్‌ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ డిస్టలరీ డైరెక్టర్‌ నల్లనన్‌ మతప్పన్, ఎస్‌బీఐ చెన్నై, ఐసీఐసీఐ హైదరాబాద్, విజయవాడ ట్రెజరీ అధికారి కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Read More
Next Story