బంగ్లాదేశీయుల ప్రభావం పై హైదరాబాద్ పోలీసుల హై అలర్ట్
బంగ్లాదేశీయుల్లో బెంగాల్, అస్సాం తర్వాత హైదరాబాద్ కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
బంగ్లాదేశ్ పరిణామాలపై హైదరాబాద్ పోలీసులు అలర్టయ్యారు. గడచిన వారంరోజులుగా బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రజాగ్రహం ముఖ్యంగా విద్యార్ధుల దెబ్బకు షేక్ హసీనా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయారు. బంగ్లాదేశ్ ను వదిలేసిన హసీనా ఇపుడు మనదేశంలో తలదాచుకుంటున్నారు. తాజా పరిణామాలు ఏమిటంటే బంగ్లాదేశ్ మొత్తం అల్లకల్లోలంగా తయారైంది. అందుకనే అవకాశం ఉన్న వాళ్ళు దేశాన్ని దాటేస్తున్నారు. దేశాన్ని దాటుతున్న వాళ్ళంతా ముఖ్యంగా పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోకి వచ్చేస్తున్నారు. వీళ్ళంతా చొరబాటుదారులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ పోలీసులు కూడా ఒక్కసారిగా అలర్టయ్యారు. ఎందుకంటే బంగ్లాదేశీయుల్లో బెంగాల్, అస్సాం తర్వాత హైదరాబాద్ కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇప్పటికే హైదరాబాద్ లోని బాలాపూర్లొ 5 వేలమంది రోహింగ్యాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక్కడే కాకుండా రాచకొండ కమీషనరేట్ పరిధితో పాటు ఓల్డ్ సిటీలో కూడా బంగ్లాదేశీయులతో పాటు రోహింగ్యాలు కూడా చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకనే పై ప్రాంతాల్లో విస్తృతమైన గాలింపు చర్యలు చేస్తునే మొత్తం పోలీసులను ఉన్నతాధికారులు అలర్ట్ చేశారు. ఏ ప్రాంతంలో ఏమి సమస్య తలెత్తుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి ముందుజాగ్రత్తగా అలర్టుగా ఉండాలని ఉన్నతాధికారులందరినీ డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదేశించారు.
మామూలుగా జనాల్లో రోహింగ్యాలు అనగానే మీడియా, సోషల్ మీడియా కారణంగా నెగిటివ్ అభిప్రాయం పెరిగిపోయింది. దానికితోడు ఇపుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల ప్రభావం మనదేశంపై కచ్చితంగా పడుతుంది. కాకపోతే సరిహద్దు ప్రాంతాలపైన ప్రభావం ఎక్కువగా ఉంటుందనటంలో సందేహంలేదు. రోహింగ్యాలు బాలాపూర్లో 5 వేల మంది ఉన్నారనగానే జనాలు ఉలిక్కిపడుతున్నారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలతో రోహింగ్యాలందరికీ పోలీసులు గతంలోనే గుర్తింపు కార్డులిచ్చినట్లు రాచకొండ కమీషనర్ గొట్టె సుధీర్ బాబు చెప్పారు. బంగ్లాదేశ్ నుండి వచ్చిన, వస్తున్న వారితో స్ధానికులకు ఎలాంటి సమస్యలు రాకుండా నిరంతరం నిఘా పెట్టినట్లు సుధీర్ చెప్పారు.
రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిఘా పెట్టినట్లు చెప్పారు. ఎలాంటి పరిణామాలను అయినా ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సుధీర్ చెప్పారు. తీసుకున్న ముందస్తు చర్యలు, నిరంతర నిఘా కారణంగా హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు లేదన్న ధీమాను వ్యక్తంచేశారు.
ఘజియాబాద్ శివార్లలో బంగ్లాదేశీయులు పెద్దఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా తాముంటున్న ప్రాంతంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను కూడా ఎగరేశారని సమాచారం. అలాగే తమ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులపై మనదేశంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు హిందూ రక్షా దళ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకనే వాళ్ళుంటున్న ప్రాంతాలకు వెళ్ళి వేసుకున్న టెంట్లను కూల్చేస్తున్నారు. దాంతో ఘజియాబాద్ లో ఉద్రిక్త పరిస్ధితులు మొదలవుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే హైదరాబాద్ లో కూడా అలాంటి పరిస్ధితులు పునరావృతం కాకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి బంగ్లాదేశ్ లో పరిణామాలు ఎప్పుడు మారుతాయో చూడాల్సిందే.