
పోలీసులంటే అధికార పార్టీ ఏజెంట్లా? ఫిర్యాదులపై కేసులెందుకు పెట్టరు?
పోలీసులు టీడీపీ, జనసేన వారి ఫిర్యాదులు మాత్రమే నమోదు చేస్తూ వైఎస్సార్సీపీ వారు ఇచ్చిన ఫిర్యాదులు నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీసింది.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోలీసు వ్యవస్థ దాసోహం అంటోందా.. అధికార పార్టీ చెప్పినట్టే నడుచుకుంటుందో.. విపక్షం చేసే ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆవేళ వైసీపీ అయినా ఇవాళ టీడీపీ అయినా అదే తీరుతో వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు టీడీపీ, జనసేన వారి ఫిర్యాదులు మాత్రమే నమోదు చేస్తూ వైఎస్సార్సీపీ వారు ఇచ్చిన ఫిర్యాదులు నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీసింది.
కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీల మధ్య రాజకీయ ఘర్షణలు పెరుగుతున్నాయి. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి రోజాను హేళనగా మాట్లాడారు. రూ. 2వేలు ఇస్తే ఏదైనా చేస్తుందని అన్నారు. రోజా కేసు పెడితే పోలీస్ కేసు నమోదు చేయలేదు. గుడివాడలో కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ వారు దాడికి పాల్పడి, దుర్భాషలాడారు. ఆమె కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. అలాగే నెల్లూరు జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇండిపై కొందరు దుండగులు దాడిచేస్తే ఆయన పెట్టిన కేసును పోలీసులు రిజిస్టర్ చేయలేదు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడారని ఆమె కేసు పెడితే దానిని మాత్రం నమోచేశారు. ఈ సంఘటనల్లో పోలీసులు, ప్రభుత్వ తీరుపై ప్రజలు విశ్వాసం పెంచుకుంటారా? లేదా? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.

మాజీ మంత్రి రోజాపై వ్యాఖ్యలు
నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజాపై వ్యక్తిగత హేళన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ‘రూ. 2 వేలు ఇస్తే ఏదైనా చేస్తుంది’ అని వ్యాఖ్యానించడం రోజాను భావోద్వేగానికి గురిచేసింది. ఆమె ఈ వ్యాఖ్యలను రాజకీయ కుట్రగా ఆరోపించారు. పోలీసులు ఆమె ఫిర్యాదును నమోదు చేయలేదు. ఈ సంఘటనను వైఎస్సార్సీపీ మహిళా విభాగం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు విజయవాడలో వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేశారు.

రోజాపై ఎమ్మెల్యే భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలను సినీ తారలు రాధిక, కుష్బూ, రమ్యకృష్ణ, కవిత, నవనీత్ కౌర్, మీనా తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి అయిన రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి ఇంట్లో కూడా తల్లీ, చెల్లి ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

గుడివాడలో ఉప్పాల హారికపై దాడి
కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి, దుర్భాషలాడారు. తన భర్త రాము, ఆమె కారులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమావేశానికి హాజరవుతుండగా రోడ్డపైనే కారును టీడీపీ కార్యకర్తలు ఆపివేశారు. కారు అద్దాలు పగుల గొట్టారు. వారిని భయబ్రాంతులకు గురిచేశారు. భర్త ఎదుటే హారిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఆమె అక్కడే కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైఎస్సార్సీపీ నాయకుడు మార్గాని భరత్ ఈ దాడిని ‘హత్యాయత్నం’గా అభివర్ణించారు, పోలీసులు ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు.

నెల్లూరులో నల్లపురెడ్డి ఇంటిపై దాడి
నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో ఫర్నీచర్, కార్లు ధ్వంసమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈనెల 7వ తేదీ రాత్రి ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు నమోదు చేయలేదు. అయితే ఆరు రోజుల తరువాత ఫిర్యాదును నమోదు చేస్తూ గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదును నమోదు చేశారు.
కోవూరులో వివాదం
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు చేశారు. తనను దుర్భాషలాడారని చేసిన ఫిర్యాదును పోలీసులు నమోదు చేశారు. కానీ ఇతర సంఘటనల ఫిర్యాదులు నమోదు కాకపోవడం వివాదాస్పదంగా మారింది.
పోలీసుల తీరు, ప్రభుత్వం పాత్ర
ఈ సంఘటనల్లో పోలీసులు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదులను నమోదు చేయకపోవడం, టీడీపీ నాయకుల ఫిర్యాదులను త్వరగా నమోదు చేయడం పోలీసు వ్యవస్థపై పక్షపాత ఆరోపణలకు దారితీసింది. ఇది ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది.
కూటమి ప్రభుత్వం ‘అరాచక పాలన’ నడుపుతోందని, వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ దాడులు, వ్యక్తిగత దూషణలు రాజకీయ కుట్రల్లో భాగమని రోజా పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ గత పాలనలో అవినీతి, దోపిడీ జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, అభివృద్ధిని అందిస్తోందని వాదిస్తున్నారు.

వైఎస్సార్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్ లతో మాజీ సీఎం వైఎస్ జగన్
ప్రజల అభిప్రాయం
ఈ సంఘటనలు, ముఖ్యంగా పోలీసుల పక్షపాత్ర ఆరోపణలు, ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మహిళా నాయకులపై దాడులు, దుర్భాషలు, పోలీసుల నిర్లక్ష్యం వంటివి ప్రజలలో, ముఖ్యంగా మహిళలు, వైఎస్సార్సీపీ అనుకూల ప్రజలలో అసంతృప్తిని పెంచుతాయి.
సామాజిక మాధ్యమాలలో ఈ సంఘటనలపై చర్చలు జోరందుకున్నాయి. రోజా పై జరిగిన వ్యక్తిగత దాడులు, గుడివాడ, నెల్లూరు సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ప్రభుత్వం పట్ల ప్రజలలో ప్రతికూల అభిప్రాయాన్ని పెంచింది.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కొంత మంది ప్రజలు దృష్టి పెట్టినప్పటికీ (పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటివి), ఈ రాజకీయ ఘర్షణలు ప్రజలను రెండు వర్గాలుగా విభజిస్తున్నాయి. టీడీపీ అనుకూలవర్గం ప్రభుత్వాన్ని సమర్థిస్తుండగా, వైఎస్సార్సీపీ అనుకూలవర్గం ఈ సంఘటనలను ప్రభుత్వ వైఫల్యంగా చూస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించినప్పటికీ, రాజకీయ ఘర్షణలు, పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర ఆరోపణలు ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ సంఘటనలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయి.
వైఎస్సార్సీపీ ఈ సంఘటనలను ఉపయోగించి, కూటమి ప్రభుత్వాన్ని ‘అరాచక పాలన’గా చిత్రీకరిస్తోంది. ప్రజలలో తమ పట్ల సానుభూతిని పెంచే ప్రయత్నం చేస్తోంది. రోజా వంటి నాయకులు ఈ సంఘటనలను రాజకీయంగా ఉపయోగించుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినే అవకాశం
ప్రస్తుత రాజకీయ ఘర్షణలు, పోలీసు వ్యవస్థపై వచ్చిన పక్షపాత ఆరోపణలు కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. మహిళా నాయకులపై దాడులు, వ్యక్తిగత దూషణలు, ఫిర్యాదుల నమోదులో వివక్ష వంటి అంశాలు, ముఖ్యంగా మహిళలు, తటస్థ ఓటర్లలో అసంతృప్తిని పెంచుతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొంత మంది ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఈ రెండు విరుద్ధ ధోరణుల మధ్య, ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించడం, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం, రాజకీయ ఘర్షణలను తగ్గించడం ద్వారా మాత్రమే విశ్వాసాన్ని పునరుద్ధరించగలదు. లేకపోతే ఈ సంఘటనలు దీర్ఘకాలంలో ప్రభుత్వ ఇమేజ్‌ను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది.