‘పోలవరం ఎవరికీ అర్థమయ్యే ప్రాజెక్ట్ కాదు’.. ఎందుకో చెప్పిన అంబటి
x

‘పోలవరం ఎవరికీ అర్థమయ్యే ప్రాజెక్ట్ కాదు’.. ఎందుకో చెప్పిన అంబటి

పోలవరం ఆలస్యానికి ప్రధాన కారణం చంద్రబాబే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం ఇప్పుడప్పుడే పూర్తి కాదని మొదట చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు.


పోలవరం ప్రాజెక్ట్.. ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పుడూ కీలక అంశంగానే నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్తేనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. విమర్శలు ప్రతి విమర్శలు తీవ్రస్థాయికి చేరతాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎవరికీ అర్థమయ్యే ప్రాజెక్ట్ కాదని, చాలా చాలా గందరగోళంగా ఉంటుందంటూ వెల్లడించారు. తాను గతంలో చెప్పిన విషయాలనే చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు చెప్తూ కొత్త విషయంలా కలరింగ్ ఇస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి చంద్రబాబు అనేక అవాస్తవ ఆరోపణలు చేశారని, టీడీపీ హయాంలోనే కొన్ని తప్పిదాలు జరిగాయని, కానీ వాటిని ఇప్పుడు వైసీపీపై తోసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం అంతా గందరోగళం

‘‘పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎవరికీ అంత తేలికగా అర్థం కాదు. అంతగా బలంగా నేను ఎలా చెప్తున్నాను అంటే. అది నాకు కూడా అర్థం కాలేదు కాబట్టే. ఎన్నోసార్లు ప్రాజెక్ట్‌ను సందర్శించి, స్టడీ చేసి, అనేక మంది నిపుణులు, సలహాదారులతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కాదు అని నిర్ణయం తీసుకున్నా. అదే విషయాన్ని బయటకు చెప్పిన మొదటి వ్యక్తిని కూడా నేనే. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తున్నారు. కొత్తగా ఏం చెప్తున్నారు’’ అని అంబటి అన్నారు.

ఆ తప్పు చేసింది టీడీపీనే

‘‘టీడీపీ హయాంలో నది డైవర్షన్ చేయకుండా కాఫర్ డ్యామ్‌ నిర్మించారు. అది చాలా పెద్ద తప్పు. ఆ ఒక్క తప్పు జరగకపోయి ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయి ఉండేది’’ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏజెన్సీలు మార్చడం వల్ల పోలవరం ఆలస్యమైందని అనడం ఏమాత్రం సరికాదని, ఇలా వైసీపీపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. వారు చేసిన తప్పుల వల్ల పోలవరం ఆలస్యమైందే తప్ప, వైసీపీ వల్ల కాదని చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు రాంబాబు. మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్లు మీడియా ముందుకు వచ్చి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి అని అనడం తప్పని చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు అంబటి. పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారికే అర్థమవుతుంది

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ దిద్దుకోలేని తప్పులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్ట్ పనుల విషయంలో చంద్రబాబు ఉన్నప్పుడు తప్పు జరిగిందా, లేక జగన్ హయాంలో తప్పు జరిగిందా అనేది ఇరిగేషన్ శాఖపై అవగాహన ఉన్న వారికే అర్థమవుతుందని అంబటి వివరించారు. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను వేగవంతం మాత్రమే చేసిందని, జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించామని తాను మనస్ఫూర్తిగా చెప్పగలనని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తానని తెలిపారు.

ఆలస్యానికి చంద్రబాబే కారణం

గతంలో పోలవరం ప్రాజెక్ట్‌ను 2018 నాటికి పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని చంద్రబాబు చెప్పలేదా అని గుర్తు చేశారు అంబటి రాంబాబు. ‘‘అసలు ప్రాజెక్ట్ ఆలస్యానికి చంద్రబాబే కారణం. ఇప్పటికైనా అవాస్తవాలు పక్కనపెట్టి ప్రజలకు వాస్తవాలను చెప్పాలి. పోలవరం అనేది ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రాజెక్ట్. ఇందులో డయాఫ్రమ్ వాలా చాలా కీలకం. రెండు కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించాలి. కానీ 2014-19లో అధికారంలో ఉన్న బాబు.. డయాఫ్రమ్ వాల్, రెండు కాఫర్ డ్యామ్‌లు, డైవర్షన్‌ను ఒకేసారి ప్రారంభించారు. అందుకు ప్రాజెక్ట్‌ను తానే పూర్తి చేసి ప్రారంభించానని చెప్పుకోవాలని చంద్రబాబు పడిన తపనే కారణం. అదే ఆయన చేసిన తప్పు కూడా. ఇప్పుడు ఆ తప్పును జగన్ నెత్తిపై మోపడానికి బాబు ప్రయత్నిస్తున్నారు’’ అని అంబటి వివరించారు.

Read More
Next Story