‘పొలం పిలుస్తోంది’ అందుకే.. క్లారిటీ ఇచ్చిన అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో రైతన్న కష్టాలను తీర్చడానికి తాను కృషి చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతన్న కష్టాలను తీర్చడానికి తాను కృషి చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రైతుల సమస్యలపై దృష్టి సారించామని, అధికారులతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా అధికారులకు కూడా కొన్ని ఆదేశాలను కూడా జారీ చేశామని వెల్లడించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే వారి బాగోగులపై కూడా దృష్టిస్తామని, అందుకోసమే ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు బాగా లబ్ది పొందగలుగుతారని, వారికి చాలా కొత్త అంశాలు తెలుసుకోవడనాకి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయానికి సంబంధించి అనేక మెళకువలు నేర్చుకోవడానికి రైతులకు అవకాశం లభిస్తుందని, దీనిని ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ఎరువులు, విత్తనాలు పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి. కార్యక్రమం నిర్వహణలో ఎటువంటి అవకతవకలు ఉండకూడదని కూడా హెచ్చరించారాయన. ఈ కార్యక్రమం ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో కాకుండా గ్రామస్థాయిలో నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అసలేంటీ పొలం పిలుస్తోంది
రైతులకు వ్యవసాయంలోని ఆధునిక పద్దతులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. ఖరీఫ్, రబీ సీజన్‌లలో నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగానే సాగు రైతులకు కావాల్సిన పనిముట్లు, యంత్రాలు పంపిణీ చేయడనాకి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ‘‘జీఎస్‌డీపీకి వ్యవసాయం 35 శాతం దోహదపడుతుంది. అటువంటి వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ ప్రాధాన్యత ఉన్న రంగాల పునరుద్దరణకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాం’’ అని వెల్లడించారు. అందుకోసమే ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించామని, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులను నేర్పించడం ద్వారా వారికి ఎంతో మేలు ఉంటుందని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు అచ్చెన్నాయుడు.