
గ్లోబల్ డ్రోన్ మ్యాప్ లో కనిపించనున్న కర్నూలు ‘ఓర్వకల్లు’
16న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ
-వడ్ల శ్రీకాంత్
రాష్ట్రాన్ని డ్రోన్ హబ్ మార్చేందుకు ఉద్దేశించిన డ్రోన్ సిటీ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 16న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా దేశంలోనే డ్రోన్ తయారీకి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఏడాది నవంబర్లో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రాన్ని డ్రోన్ హబ్ గా మార్చేందుకు నిర్ణయం తీసుకుంటూ తీర్మానం చేసి ఆమోదించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేసేందుకు తగిన ప్రాంతంగా ఎంపిక చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రంలో డ్రోన్ సిటీకి 340 ఎకరాలు స్థల సేకరణను చేసి అభివృద్ధి చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పచెప్పారు. ఈ ఏడాది జనవరిలోనే స్థల కేటాయింపు జరిగింది. డ్రోన్ సిటీ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏపీఐఐసీ కృషి చేస్తుంది.
ఈనెల 16న ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉండటంతో డ్రోన్ సిటీకి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఎటువంటి అవసరాల కైనా ఉపయోగించే డ్రోన్ ల తయారీ కేంద్రంగా ఏపీని నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ టెక్నాలజీలో నెంబర్ వన్ గా ముందుకు తీసుకపోవడంతో పాటు వ్యవసాయం, మైనింగ్, భద్రత, రవాణా రంగాలలో డ్రోన్ వినియోగాన్ని పెంపొందించడం ద్వారా ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కల్పించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని అధికారులు చెప్తున్నారు.
డ్రోన్ సిటీ ద్వారా 8 నుంచి 9వేల మందికి ఉపాధి
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రంలో ఏర్పాటు చేసే సిటీ ద్వారా దాదాపు 8 నుంచి 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. డ్రోన్ సిటీ కొరకు అభివృద్ధి చేస్తున్న 340 ఎకరాలలో 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ డ్రోన్ సిటీ నందు డ్రోన్ ల తయారీ అసెంబుల్ యూనిట్లు, రీసెర్స్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ఫ్లయింగ్ జోన్స్, డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ సెంటర్, ప్రత్యేక డ్రోన్ టెస్టింగ్ ట్రాక్ అలాగే మరమ్మత్తు కేంద్రాలకు ప్రత్యేకంగా వేటికి అవసరమైన విధంగా అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. తద్వారా దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రంలో డ్రోన్ సిటీ ఏర్పాటు ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, పారిశ్రామిక అభివృద్ధి కూడా ఊపందుకుందని కర్నూలు జిల్లా వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Next Story