
రాయలసీమ.. ఇక రాకెట్ వేగంతో అభివృద్ధి!
16న మోదీ చేతుల మీదుగా రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశ రాజకీయ దృష్టిని ఆకట్టుకోనుంది. నిన్న గూగుల్ డేటా సెంటర్ కి బాటలు వేసిన ఆంధ్రప్రదేశ్.. రేపు రాయలసీమ అభివృద్ధికి మార్గం సుగమం చేసింది. అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలానికి, అనంతరం కర్నూలుకు వెళ్తారు. ఈ పర్యటనలో ఆయన రూ.13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో కొన్ని శంకుస్థాపనలు, మరికొన్ని ప్రారంభోత్సవాలు, ఇంకొన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమాలు ఉన్నాయి.
ఉదయం 11:15 గంటలకు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, 52 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం ఆయన శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి ధ్యాన మందిరంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, ఆయన చరిత్రకు గుర్తుగా నిర్మించిన నాలుగు కోటల మోడల్స్ ఉన్నాయి.
మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రధానమంత్రి కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిలో పవర్ ట్రాన్స్మిషన్, రోడ్లు, రైల్వేలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, నేచురల్ గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి.
మోదీ శ్రీకారం చుట్టనున్న కీలక ప్రాజెక్టులు..
-₹2,880 కోట్ల విలువైన కర్నూల్–చిలకలూరిపేట ట్రాన్స్మిషన్ లైన్, 6,000 MVA విద్యుత్ సామర్థ్యంతో
-కర్నూల్ ఒర్వకల్, కడప కోప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలు — ₹4,920 కోట్ల పెట్టుబడితో
-విశాఖ సబ్బవరం–శీలనగర్ ఆరు లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే – ₹960 కోట్లతో
-₹1,140 కోట్ల విలువైన ఆరు రోడ్డు ప్రాజెక్టులు
-₹1,200 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు — కొట్టవలస–విజయనగరం నాల్గవ లైన్, సిమిలిగుడ–గోరాపూర్ డబ్లింగ్ మొదలైనవి
-శ్రీకాకుళం–అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ (₹1,730 కోట్లు), చిత్తూరు ఐఓసీ ఎల్పీజీ ప్లాంట్ (₹200 కోట్లు)
-నిమ్మలూరు (కృష్ణా జిల్లా)లో BEL నైట్ విజన్ ఫ్యాక్టరీ, ₹360 కోట్ల పెట్టుబడితో
ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని పారిశ్రామికీకరణ, రవాణా మౌలిక సదుపాయాలు, విద్యుత్, రక్షణ రంగాల అభివృద్ధికి గట్టి బలాన్నిస్తాయి.
శ్రీశైలం–కర్నూల్ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీకి మంచి మద్దతున్న ప్రాంతం కావడంతో రాయలసీమపై చంద్రబాబు దృష్టి పెట్టి ప్రధానమంత్రి మోదీని ఇక్కడకు రప్పిస్తున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు.