అరకు అరుదైన గౌరవం.. గిరిజనులకు ఊతం
x

అరకు అరుదైన గౌరవం.. గిరిజనులకు ఊతం

అరకు కాఫీ రుచిని ప్రధాని మోదీ మరోసారి ప్రశంసించారు. అరకు కాఫీకి బ్రాండ్ అబాంసిడర్‌లా మారిపోయారు. ప్రధాని ట్వీట్‌పై చంద్రబాబు కూడా స్పందించారు.


ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ అరకు లోయకు అరుదైన గౌరవం కూడా దక్కింది. హ్యాట్రిక్ ప్రధాని అయిన మోదీ.. ఇప్పుడు అరకు కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారారు. వీలు దొరకడం ఆలస్యం అరకు కాఫీ అంటూ కలవరిస్తున్నారు. ఇదివరకే తన మన్‌కీబాత్‌లో అరకు కాఫీ రుచిని, గుమగమలను కొనియాడిన ప్రధాని మోదీ.. ఈరోజు మరోసారి ఆ అరకు కాఫీను గుర్తు చేసుకున్నారు. కేవలం అరకు కాఫీపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అరకు కాఫీ రుచి చూడాల్సిందేనని, తనివితీరా ఆస్వాధించాల్సిందేనంటూ బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయారు.

ఆహా అనిపించే అరకు కాఫీ

అరకు లోయలో పండే కాఫీ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడంలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అభినందించారు. ఈరోజు నిర్వహించిన మన్ కీ బాత్‌లో మన్యం ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ, ఏపీ ప్రభుత్వ సహకారంతో గిరిజనులు సాగు చేస్తున్న అరకు లోక కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ. ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచస్థాయి గుర్తింపును సాధిస్తుండటం భారతీయులంతా గర్విచదగ్గ విషయం. అలాంటి వాటిల్లో అరకు కాఫీ టాప్‌లో ఉంటుంది. ఇక్కడ గిరిజనులు కాఫీని అధికంగా సాగు చేస్తున్నారు. అద్భుతమైన రంగు, రుచి, వాసన ఉన్న అరకు కాఫీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో దాదాపు 1.50 లక్షల మంది ఆదివాసీ కుటుంబాలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నాయి. ఈ కాఫీకి గ్లోబల్ గుర్తింపు కోసం జీసీసీ విశేష కృషి చేస్తోంది. ఆదివాసీ రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తోంది. ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం పెరగడంతో పాటు వారు గౌరవనీయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు’’ అని వివరించారు మోదీ.

ఈ సందర్బంగానే గతంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీని రుచి చూసిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి ఫొటోలను కూడా మోదీ.. తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసుకున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పడానికి అక్షరాలు సరిపోవడం లేదని, ఆ కాఫీ రుచి అద్భుతమని అన్నారు. అరకు కాఫీ ఎన్నో ప్రపంచ స్థాయి అవార్డులు అందుకుందని, ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సమావేశంలో కూడా అరకు కాఫీకి విశేష స్పందన లభించిందన వివరించారు. మోదీ ట్వీట్‌పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. మరోసారి ప్రధాని మోదీతో కలిసి మరోకప్పు అరకు కాఫీని ఆస్వాధించడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు.

గిరిజనులకు ఊతం

ప్రధాని మోదీ తన మన్‌ కీ బాత్‌లో తమ సంస్థ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం చాలా గౌరవంగా ఉందని జీసీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు.. గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బంది సహా కాఫీ సాగుతో ముడిపడి ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి ప్రశంసనీయమని, ప్రధాని మాటలు అందరిలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని అన్నారు. అంతేకాకుండా అరకు కాఫీకి ప్రత్యేక గుర్తింపు లభించడం ఇక్కడి గిరిజనుల ఆర్థిక సాధికారతకు ఎంత గానో ఊతమిస్తుందని చెప్పుకొచ్చారు సురేష్ కుమార్.

Read More
Next Story