‘దేశంలోని ప్రతి ఇంటినీ మోదీ మోసం చేశారు’.. షర్మిల
x

‘దేశంలోని ప్రతి ఇంటినీ మోదీ మోసం చేశారు’.. షర్మిల

భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయంటూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారమని వ్యాఖ్యానించారు.


‘దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని మోసం చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ’ అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగానే.. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. దేశ ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం అంటే చాలా మంది అనుకుంటున్నట్లు ఏదో బ్రిటిషర్లు ఇచ్చి వెళ్లిన గిఫ్ట్ కాదని.. దాని కోసం వేలాది మంది వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన త్యాగాల ఫలితమే భారతదేశానికి సిద్ధించిన స్వాతంత్ర్యమని చెప్పుకొచ్చారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన, పాటుపడిన ప్రతి వీరుడికి ఆమె నివాళులు అర్పించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశంలో గత పదేళ్లుగా మతతత్వ పార్టీ అయిన బీజేపీ అధికారంలో ఉందని, ఈ పదేళ్లుగా అరాచక పాలన సాగుతుందని ధ్వజమెత్తారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం కనుమరుగవడం ప్రారంభమైందని, నేడు దేశంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనేదే కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వేటికి అతీతంగా అయితే కాంగ్రెస్ పోరాడిందో అదే మత రాజకీయాలను బీజేపీ పెంచి పోషించిందని, ప్రతి సమస్యను హిందూ.. ఇతర మతాల మధ్య వివాదంగా మార్చి దాని నుంచి రాజకీయ లబ్ది పొందుతూ వచ్చిందని విమర్శలు గుప్పించారు. ఆఖరికి ధర్మానికి ప్రతిరూపంగా ప్రతి హిందువు కొలిచే రాముడిని కూడా రాజకీయం చేసిన పార్టీ బీజేపీ అంటూ మండిపడ్డారు. అసలు ఈ పదేళ్ల కాలంలో దేశానికి ప్రధాని మోదీ ఏం చేశారు? అని ప్రశ్నించారు షర్మిల.

‘జాతీయ జెండాను బీజేపీ అవమానించింది’

‘‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవల దేశమంతా హర్ ఘర్ తిరంగా అనే క్యాంపెయిన్‌ను మొదలు పెట్టారు ప్రధాని మోదీ. అంటే ఒక వ్యక్తికి దేశభక్తి, దేశంపై ప్రేమ ఉందో లేదో బీజేపీ సర్టిఫై చేస్తుందా?’’ అని చురకలంటించారు. ‘‘ఎందరో వీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వరాజ్యాన్ని, స్వాతంత్య్రాన్ని, జాతీయ జెండాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించాయి. మూడు రంగుల జెండాను తాము ఆమోదించమని, జెండాకు ఒకే రంగు ఉండాలని చెప్పిన పార్టీ బీజేపీ. అందుకే 2001 వరకు కూడా ఆర్ఎస్ఎస్.. తన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదు. నిజానికి ఈ దేశానికి మోదీ చేసింది ఏమైనా ఉందా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. ప్రతి ఇంటిని మోసం చేసిన వ్యక్తి ప్రధాని మోదీ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.

ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని కాకమ్మ కబుర్లు చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత మోదీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు. మణిపూర్‌లో ఊచకోత కోస్తుంటే తమకేం పట్టనట్లు కూర్చున్నారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారంటూ విమర్శలు గుప్పించారు షర్మిల.

రాజ్యాంగాన్ని మారుస్తారా..!

‘‘బీజేపీ పాలనలో దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చేస్తామని బీజేపీ అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దేశంలో ఐక్యత రావాలి, మళ్ళీ ప్రగతి పునాదులు పడాలి అంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే దేశం చాలా ఇబ్బందులు పడుతుంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఉన్న ఒకే ఒక సమాధానం కాంగ్రెస్’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story