ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ ప్రమాదకరంగా మారింది
x

ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ ప్రమాదకరంగా మారింది

అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ ప్రమాదకరంగా మారిందని, దీనిని పూర్తి స్థాయిలో నివారించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పర్యావరణ సమతుల్యతతో కూడి రాష్ట్రంగాను, ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు మొక్కలు నాటారు.

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని సంరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే నాలుగేళ్లల్లో ఐదు కోట్ల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంచేందుకు, అడవులను పరిరక్షణకు, పచ్చదనం పెంచేందుకు గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఈ సారి వాటితో పాటు అంతకంటే మంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. నగర వనాలను 175 నియోజక వర్గాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వీటిల్లో అన్నీ రకాల చెట్లను పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

అమరావతి గురించి ప్రస్తావిస్తూ.. అమరావతిని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యావరణానికి, పచ్చదనానికి కేరాఫ్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. అందులో భాగంగా జపాన్, కొరియా, సింగపూర్‌ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్నట్లుగా అమరావతిలో గార్డెన్లను పెంచుతామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్‌ పవర్‌ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గ్రీన్‌ ఎనర్జీని ఎంకరేజ్‌ చేస్తున్నామన్నారు. కోరుకున్న రైతులకు ఫ్రీగా సోలార్‌ పవర్‌ సెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఎనర్జీని డెవలప్‌ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జూన్‌ 21న యోగాలో ప్రపంచ రికార్డులు సృష్టించనున్నట్లు చెప్పారు. ఆయుష్‌ ద్వారా యోగాను ప్రతి ఇంటికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
వ్యక్తిగతంగా పర్యావరణ పరిరక్షణ కోసం పని చేశానని, ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో పని చేయాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వచ్చే ఏడాదికి నాటికి కోటి మొక్కలు నాటి పర్యవారణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అటవీ, పర్యావరణ శాఖలు తన పరిధితో ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత తనకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎక్కువుగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణను, పచ్చదనం పెంచడం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. నల్లమల అడవులను రక్షిస్తున్నకొమెర అంకమరావును అడవులు, పర్యావరణ శాఖ సలహాదారుగా నియమిస్తున్నాం అంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు ఇద్దరు కలిసి అనంతవరంలో మొక్కలు నాటారు. పంచాయతీరాజ్, అటవీ, మున్సిపల్‌ శాఖలతో పాటు పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను, మొక్కలను ఇరువురు పరిశీలించారు.
Read More
Next Story