కోడిపందేల వద్ద జనసేన జెండాలు నాటాడు..సస్పెండయ్యాడు
పార్టీ గీత దాటాడని, పార్టీకి, పార్టీ విధానాలకు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించాడని వేటు వేసింది.
కోడి పందేలు నిర్వహించే బరుల వద్ద పార్టీ జెండాలు, పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడనే కారణంతో ఓ నాయకుడిని జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడు వద్ద కోడి పందేలు నిర్వహించారు. పెనమలూరు పరిధిలోకి కండిపాడు వద్ద కోడి పందేలు నిర్వహించే ప్రాంతంలో జనసేన నాయకుడు ముప్పా గోపాలకృష్ణ(రాజా) జనసేన పార్టీ జెండాలు.. జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీంతో ముప్పా గోపాలకృష్ణపై జనసేన పార్టీ హైకమాండ్ కన్నెర్ర చేసింది. పార్టీ గీత దాటి వ్యవహరించడంతో క్రమశిక్షణా చర్యలకు గురయ్యాడు. ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో జనసేన పార్టీకి చెందిన కీలక నాయకుడుగా ఉన్నాడు.
కోడి పందేల వద్ద పార్టీ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలను ఏర్పాటు చేయడాన్ని జనసేన పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను పార్టీ నుంచి సస్సెండ్ చేసింది. కోడి పందేల వద్ద కానీ, ఆ ప్రాంతంలో కానీ, బరుల వద్ద కానీ పార్టీ జెండాలు, పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆ పార్టీ విధానాలకు, పార్టీ ప్రతిష్టకు భంగకరమని, దీనికి బాధ్యులైన ముప్పా గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్సెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి జనసేన పార్టీతో కానీ, జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కానీ ఎలాంటి అధికారిక సంబంధం లేదని ముప్పా గోపాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని జనసేన శ్రేణులు, ముప్పా గోపాలకృష్ణ అనుచరలు, శ్రేయోభిలాషుల్లో జనసేన పార్టీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Next Story