ఖాళీ అవుతున్న వైసీపీ.. మరో నేత హుష్ కాకి..
ఎన్నికల మొదలైనప్పటి నుంచి వైసీపీకి షాకులపైన షాకులు తగులుతున్నాయి. ఎన్నికల నగారా మోగిన కొద్ది రోజుల నుంచి వైసీపీ పార్టీ నుంచి నేతలు వైదొలగడం ప్రారంభించారు.
ఎన్నికల మొదలైనప్పటి నుంచి వైసీపీకి షాకులపైన షాకులు తగులుతున్నాయి. ఎన్నికల నగారా మోగిన కొద్ది రోజుల నుంచి వైసీపీ పార్టీ నుంచి నేతలు వైదొలగడం ప్రారంభించారు. ఒక్కొక్కరుగా పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఎన్నికల్లో వైసీపీపైనే పోటీకి కూడా నిలబడ్డారు. ఆ ఎదురు దెబ్బలకు పెద్దగా పట్టించుకోని వైసీపీకి.. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రజలు ఊహించని ఝలక్ ఇచ్చారు. అప్పటి నుంచి వైసీపీలో వలసలు ఊపందుకున్నాయి. పేరుమోసిన నేతలు కూడా ఫ్యాన్‌ను కట్టేసి సైకిల్ ఎక్కేస్తున్నారు. ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ స్థాయిలోని నేతలు కూడా వైసీపీకి టాటా చెప్పి కూటమి పార్టీల్లోకి వచ్చేస్తున్నారు. ఇటీవల ఈ వలసలు కాస్త తగ్గుముఖం పట్టాయని అన్న భావన మొదలైంది. కాగా అదేమీ లేదని.. వైసీపీ ఖాళీ అయ్యే దిశగానే అడుగులు వేస్తోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు తన రాజీనామాతో చెప్పకనే చెప్పారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా దొరబాబు రాజీనామా చేశారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గడం, సరైన గుర్తింపు కూడా ఇవ్వకపోవడం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలన్న ఉద్దేశంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చానే తప్ప రాజకీయ లబ్ది కోసం కాదని కూడా వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి జరగాలన్నదే తన కోరిక అని, అది ఎన్‌డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని కూడా అన్నారు. అనంతరం తన భవిష్యత్ కార్యాచారణపై కూడా ఓ ప్రకటన చేశారాయన.
‘‘ప్రస్తుతం అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. కానీ ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై అనుచరులతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. వారితో చర్చించిన తర్వాత ఏ పార్టీలో చేరేది అధికారికంగా ప్రకటిస్తా. నియోజకవర్గ ప్రజలకు 25 ఏళ్లుగా మమేకమై ఉన్నాను. నా వెంట ఇన్నాళ్లూ నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. ఏం చేసిన నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే చేస్తా. మాజీ సీఎం జగన్‌తో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చాను’’ అని వెల్లడించారు.
అసలు కారణం అదేనా..
అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాదని పిఠాపురం టికెట్ వంగా గీతకు ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, ఇదే అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించినా లాభం లేకపోవడంతో ఎన్నికల ప్రచారాలకు దూరం పాటించారని టాక్ నడుస్తోంది. తీరా జరిగిన ఎన్నికల్లో పవన్ కన్నా 70వేల ఓట్ల తేడాతో వంగా గీత ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. దీంతో తనకు టికెట్ ఇచ్చి ఉంటే.. రిజల్ట్ వేరేలా ఉండేదని పార్టీలో చర్చ వచ్చిందని, అందులో దొరబాబు మాటకు ఎవరూ విలువ ఇవ్వకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
దొరబాబు రాజకీయ ప్రస్తానం..
పెండెం దొరబాబు.. 2004 ఎన్నికల్లో బీజేపీ తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యేగా శాసనసభలో తన గళం వినిపించారు. ఆ తర్వాత 2012లో ఆయన వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మరోసారి పిఠాపురం నియోజకర్గంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి వైసీపీ నిరాకరించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున వంగా గీత.. పిఠాపురం బరిలో నిలబడి.. జనసేనాని పవన్ కల్యాణ్ చేతిలో ఓటమి పాలయ్యారు.